IND vs NZ: ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) లో టీమిండియా (Team India) అదరగొడుతోంది. కప్ ను ముద్దాడటమే లక్ష్యంగా దుబాయిలో అడుగుపెట్టిన భారత్.. ఆడిన రెండు మ్యాచ్ లలో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను మట్టికరిపించిన రోహిత్ సేన.. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను సైతం సెకండ్ మ్యాచ్ లో ఓడించింది. తద్వారా సెమీస్ బెర్త్ ను సైతం ఖాయం చేసుకుంది. ఇక లీగ్ దశలో భారత్ తన ఆఖరి మ్యాచ్ ఆదివారం (మార్చి 2) ఆడనుంది. కివీస్ తో తాడోపేడో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి గ్రూప్-A విభాగంలో టాప్ లో నిలవాలని టీమిండియా కోరుకుంటోంది. అయితే కివీస్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాలో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. స్టార్ పేసర్ షమీ కివీస్ తో మ్యాచ్ కు దూరం కానున్నట్లు క్రీడా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సెమీస్ కోసం షమీకి విశ్రాంతి!
ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా లేని లోటును స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) తీరుస్తున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనే 5 వికెట్లు పడగొట్టి జట్టుకు తను ఎంత విలువైన అటగాడినో షమీ చాటి చెప్పాడు. పాక్ తో మ్యాచ్ లో వికెట్ తీయనప్పటికీ తన నిప్పులు చెరిగే బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అయితే ఆ మ్యాచ్ సందర్భంగానే బౌలింగ్ చేస్తూ షమీ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఓ దశలో మైదానాన్ని సైతం వీడి.. మరలా తిరిగొచ్చాడు. దీంతో న్యూజిలాండ్ తో మ్యాచ్ లో షమీకి విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా సెమీస్ లో అతడి సేవలను మరింత మెరుగ్గా వినియోగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Delhi Pollution: ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ వాహనాలకు నో పెట్రోల్ – డీజిల్!
షమీ స్థానంలో అర్ష్ దీప్ నకు ఛాన్స్!
న్యూజిలాండ్ తో మ్యాచ్ కు షమీ దూరమైతే అతడి స్థానంలో అర్ష్ దీప్ (Arshdeep Singh)ను తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్స్ లోనూ అతడు చెమటోడుస్తున్నాడు. కివీస్ జట్టులో ఐదుగురు ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉండటంతో జట్టు మేనేజ్ మెంట్ అర్షదీప్ వైపే మెుగ్గు చూపే అవకాశముందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా ప్రస్తుతం అర్ష్ దీప్ ఫుల్ ఫామ్ లో ఉండటం కూడా జట్టుకు కలిసి రానుంది. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టీ-20 సిరీస్ లో అర్ష్ దీప్ చెలరేగి ఆడాడు. ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్ లతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
రోహిత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
టీమిండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma).. పాక్ తో మ్యాచ్ సందర్భంగా కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో కివీస్ తో మ్యాచ్ కు అతడు సైతం దూరం కానున్నాడన్న వార్తలు ఒక్కసారిగా ప్రచారం లోకి వచ్చాయి. రోహిత్ స్థానంలో వైస్ కెప్టెన్ అయిన గిల్.. తర్వాతి మ్యాచ్ కు సారథ్య బాధ్యతలు వహిస్తారని క్రీడా వర్గాలు అంచనా వేశాయి. అయితే ఆ ప్రచారాలను టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తాజాగా పటాపంచలు చేశాడు. రోహిత్ ఫిట్ గానే ఉన్నాడని తేల్చి చెప్పాడు. దీంతో కివీస్ తో మ్యాచ్ లో రోహిత్ బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.