Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీని పట్టి పీడిస్తున్న సమస్యల్లో వాయు కాలుష్యం ప్రధానమైంది. చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ ప్రజలు రోడ్లపైకి రాలేక తీవ్ర అవస్థలు పడుతుంటారు. పిల్లలను స్కూళ్లకు పంపాలంటేనే తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కాలుష్య కట్టడికి దశాబ్దకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా అవి తాత్కాలిక ఉపశమానాన్ని మాత్రమే అందించాయి. ఇది గమనించిన ఢిల్లీ కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య కట్టడి చర్యల్లో భాగంగా శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ప్రారంభించింది.
ఆ వాహనాలకు ఇంధనం బంద్
ఢిల్లీలో నానాటికి క్షీణిస్తున్న వాతావరణంపై ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. కాలుష్య కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. సుదీర్ఘ చర్చల అనంతరం మంత్రి మంజిందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేకుండా చేయాలని నిర్ణయించారు. పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక గాడ్జెట్లు ఏర్పాటు చేసి 15 ఏళ్లు పైబడిన వాహనాలను గుర్తిస్తామని మంత్రి తెలిపారు. ఈ ఆంక్షలకు సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖకు సమాచారం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
డిసెంబర్ నాటికి 90% ఎలక్ట్రిక్ బస్సులు
కాలుష్యం నియంత్రణలో భాగంగా ఢిల్లీలో తిరిగే ప్రభుత్వ బస్సులను సైతం ప్రక్షాళన చేయనున్నట్లు పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి 90% సీఎన్ జీ బస్సులను దశలవారీగా ఉపసంహరించుకొని వాటి స్థానాల్లో ఎలక్ట్రిక్ బస్సులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఎత్తైన బిల్డింగ్స్, హోటల్స్, వాణిజ్య సముదాయాలపై తప్పనిసరిగా యాంటీ స్మోగ్ గన్లను అమర్చాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
తుక్కు విధానంతో పాత వాహనాలకు చెక్
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాలుష్యం అనేది ప్రధాన అంశంగా మారిపోయింది. తాము అధికారంలోకి వస్తే కాలుష్య కట్టడికి శాశ్వత పరిష్కారం కనుగొంటామని బీజేపీ పార్టీ పదే పదే ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చింది. ఇందుకు అనుగుణంగా ఢిల్లీ ప్రజలు ఆ పార్టీకి ఘన విజయం అందించడంతో ఆ దిశగా కమలదళం అడుగులు మెుదలుపెట్టింది. కేంద్రం తీసుకొచ్చిన తుక్కు విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఢిల్లీ సర్కార్ రెడీ అవుతోంది. ఈ విధానం ద్వారా ఫిట్ నెస్ లేని వాహనాలకు చెక్ పెట్టి కాలుష్యాన్ని నియంత్రించాలని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భావిస్తున్నారు.