Telangana BJP: రాష్ట్రంలో బీజేపీ (Telangana BJP)జిల్లా అధ్యక్షుల పంచాయితీలో కొత్త ట్విస్ట్ మొదలైంది. పలు జిల్లాల అధ్యక్షులకు, పలువురు ఎంపీలకు పొసగకపోవడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. దీంతో పలు జిల్లాల అధ్యక్షులపై వేటు తప్పదనే ప్రచారం జరిగింది. అంతలోనే వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పు రాజశేఖర్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేయడం, మరుసటి రోజే రాష్ట్ర నాయకత్వం రిజైన్ కు ఆమోదం తెలపడం జరిగిపోయాయి. దీంతో ఇలాంటి వివాదాస్పదమైన జిల్లాల అధ్యక్షుల్లో ఆందోళన మొదలైంది. పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందోననే చర్చ జోరుగా సాగుతోంది. నెక్ట్స్ వికెట్ ఎవరిదోననే ఉత్కంఠ నెలకొంది.
ఉప ఎన్నికల తర్వాత నిర్ణయం
జిల్లా అధ్యక్షుల పంచాయితీపై రాష్ట్ర నాయకత్వం ఇప్పట్లో టచ్ చేయొద్దని తొలుత భావించింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని విరమించుకుంది. బైపోల్ సమయంలో ఈ అంశాన్ని టచ్ చేస్తే ప్రతికూలంగా మారే అవకాశముందని భావించి పక్కకు పెట్టింది. ఉప ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుందామని భావించింది. కానీ రాజశేఖర్ రెడ్డి రాజీనామాతో నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం రాజశేఖర్ రెడ్డి రాజీనామాకు ఆమోదం తెలపడంతో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పంతం నెగ్గించుకున్నట్లయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందే ఫుట్ బాల్ పంచాయితీకి రాష్ట్ర నాయకత్వం తెరదించింది. జిల్లా కన్వీనర్ గా ప్రహ్లాద్ రావుకు పార్టీ అవకాశం కల్పించింది.
పార్టీ శ్రేణుల నుంచి పలు అనుమానాలు
వికారాబాద్ జిల్లాతో పాటు తొలిదశలో మొత్తం ఆరు జిల్లాల అధ్యక్షులపై యాక్షన్ తీసుకునే అవకాశముందనే చర్చ పార్టీలో కొద్దిరోజులుగా జరుగుతోంది. ఇప్పటికే రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడికి రాష్ట్ర నాయతక్వం స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే సిద్దిపేట, జగిత్యాల జిల్లాల అధ్యక్షుల నియామకంపై పార్టీ శ్రేణుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే వికారాబాద్ జిల్లాపై ఉత్కంఠ వీడటంతో సిద్దిపేట, జగిత్యాల, పెద్దపల్లి, కొత్తగూడెం, రంగారెడ్డి రూరల్ జిల్లాలపై చర్యలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే వికారాబాద్ ఇష్యూకు పూర్తి భిన్నంగా ఈ జిల్లాల్లో పరిస్థితి ఉంది. వికారాబాద్ లో స్వయంగా ఎంపీ కొండాకు, రాజశేఖర్ రెడ్డికి మధ్య పొసగలేదు. కానీ మిగతా జిల్లాల్లో ఎంపీలకు ఆయా జిల్లాల అధ్యక్షులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ తరుణంలో స్థానిక ఎంపీలను కాదని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. వారిని తొలగించే సాహసం పార్టీ చేస్తుందా? లేక లైట్ తీసుకుంటుందా? అనేది చూడాలి.
Also Read: Telangana BJP: జూబ్లీహిల్స్ అభ్యర్థిపై తేల్చుకోలేకపోతున్న బీజేపీ.. ఇంకా టైం పట్టనుందా..!
