– ఓవైపు కుమార్తె అరెస్ట్
– ఇంకోవైపు నేతల వలసలు
– పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌లో నైరాశ్యం
– మళ్లీ పార్టీని ఫామ్‌లోకి తెచ్చేందుకు రంగంలోకి కేసీఆర్
– నీళ్ల కటకట అంటూ రైతు జపం
– కాంగ్రెస్ సర్కార్ పై సీరియస్ వ్యాఖ్యలు
– మాటకు మాట బదులిచ్చిన కాంగ్రెస్ నేతలు
– పాపం అంతా కేసీఆర్‌దేనంటూ విమర్శల దాడి
– హస్తం నేతల మాటల మంటలతో హీటెక్కిన రాజకీయం
War Of Words, Congress Hits Back Says Kcr Made Telangana: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనాల్లోకి వచ్చి చాలాకాలమే అయింది. అప్పుడప్పుడు దర్శనం ఇచ్చే ఆయన, ఎన్నికలప్పుడే ఫాంహౌస్ దాటతారనే అపవాదు ఉంది. ఆఖరికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బయటకు వచ్చింది లేదు. తుంటి ఆపరేషన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. చాలారోజుల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, అంతా కాంగ్రెస్ పాపమేనంటూ విమర్శలు చేశారు. ఓవైపు లిక్కర్ కేసులో కవిత అరెస్ట్, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరోవైపు నేతల వలసలు, ఇలా సమస్యల సుడిగుండంలో ఉన్న కేసీఆర్ సడెన్‌గా రైతు జపం చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఆయన చేసిన విమర్శలకు మాటకుమాట బదులిచ్చారు మంత్రులు.
కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే రైతుల పేరుతో కేసీఆర్ డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు. కవిత మద్యం కేసులో జైలులో ఉన్నారని, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్‌లో సినీ హిరోయిన్లను బెదిరింపులకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. కేసీఆర్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలకు సాయం చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు కేసీఆర్‌కు లేదని, ఎన్నికలు వచ్చాయి కాబట్టే ఆయన ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారని అన్నారు. కేసీఆర్ డ్రామాలను ప్రజలు నమ్మరని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కేసీఆర్ చేసిన ఆరోపణలు అక్కసుతో కూడుకున్నట్టుగా ఉన్నాయన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమని మండిపడ్డారు. కేసీఆర్ సరిదిద్దుకోలేనంత తప్పిదాలు చేస్తే, అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థలను దారిలో పెట్టే ప్రయత్నంలో తామున్నామని తెలిపారు.
Read Also: తెలంగాణ టచ్.. పాలిటిక్స్
కాంగ్రెస్‌లోకి వరుసగా నేతలు చేరుతుంటే, కార్యకర్తలను కాపాడుకోవడం కోసం కేసీఆర్ నోటికొచ్చింది మాట్లాడరని అన్నారు. అయినా, ఆయన ఇంత దిగజారి మాట్లాడతారని అనుకోలేదని చెప్పారు భట్టి. ఇక, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ నైతికంగా పతనం అయ్యారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. ప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్ పంట నష్టం డ్రామా చేశారని విమర్శించారు. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్దమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ డిప్రెషన్, ఫస్ట్రేషన్‌లో ఉన్నారని, ఒడిపోవడమే కాదు, పార్టీ మిగలదు అనే భయం మొదలైందని చురకలంటించారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదన్న ఆయన, కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరని చెప్పారు. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే కరెంట్ పోయింది అని కేసీఆర్ అబద్దం చెప్పారని అన్నారు. ఇక, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందిస్తూ, కేసీఆర్, కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో లద్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పొలంబాట పేరుతో వేటాడుతాం అంటూ రెచ్చగొడుతున్నారని, రైతుల ఆత్మహత్యలను బీఆర్ఎస్ నాయకులు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పద్దతి మార్చుకోవాలన్న ఆయన, జగదీష్ రెడ్డి బినామీ కాంట్రాక్టుల ధన దాహంతో తమ ప్రాంతం ఎడారిగా మారిందని విమర్శలు చేశారు. మొత్తంగా కేసీఆర్ వ్యాఖ్యలకు మాటకు మాట బదులిచ్చారు కాంగ్రెస్ నేతలు.