– త్వరలో బీజేపీ టు కాంగ్రెస్ ఎపిసోడ్
– అగ్గి రాజేసిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు
– దమ్ముంటే టచ్ చేయాలని ఏలేటి సవాల్
– 48 గంటల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని వార్నింగ్
– ఏలేటికి మంత్రి పొన్నం కౌంటర్ సవాల్
– ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరిక
– నేతల వలసల వార్‌తో హీటెక్కిన తెలంగాణ రాజకీయం
Telangana Jumping Politics : పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో చేరికల పండుగ జరుగుతోంది. వరుసబెట్టి బీఆర్ఎస్ నేతలు హస్తం కండువా కప్పేసుకుంటున్నారు. కొందరు బీజేపీ బాట పడుతున్నారు. అయితే, ఈ చేరికల అంశంపై నేతల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. మూడు పార్టీల నాయకులు పంచ్ డైలాగులతో లోక్ సభ యుద్ధాన్ని మరింత హాట్‌గా మార్చేశారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలతో రాజుకున్న నిప్పు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అవే ఈ మాటల యుద్ధానికి దారి తీశాయి. ఆమధ్య బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వలసలు కొనసాగాయి, ఇప్పుడు కాంగ్రెస్ సీజన్ నడుస్తోంది, త్వరలో బీజేపీ నుంచి కాంగ్రెస్ ఎపిసోడ్ మొదలవుతుందని అన్నారు కోమటిరెడ్డి. అంతేకాదు, బీజేపీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు కూడా హస్తం గూటికి చేరతారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు వెంకట్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు బీజేపీ నేతలకు ఆగ్రహాన్ని తెప్పించాయి.
Read Also: కరెంట్, తాగునీటి కొరతను అధిగమించాలని సీఎం ఆదేశం
కాంగ్రెస్‌పై రెచ్చిపోయిన ఏలేటి
మంత్రి వ్యాఖ్యలతో బీజేపీ క్యాంప్‌లో కలవరం మొదలవ్వగా, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలు కాదు, ముందు కోమటిరెడ్డికి ఆయన తమ్ముడు టచ్‌లో ఉన్నారా? అంటూ సెటైర్లు వేశారు. తమ ఎమ్మెల్యేలను టచ్ చేయండి చూద్దాం అంటూ ఛాలెంజ్ విసిరారు. అదే గనక జరిగితే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, కాంగ్రెస్‌లో షిండే అంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డేనని అన్నారు. ఆయనతో సహా ఐదుగురు మంత్రులు తమకు టచ్‌లో ఉన్నారని, కానీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి తాము హుందాగా ప్రవర్తిస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఏలేటి.
ఏలేటికి మంత్రి పొన్నం కౌంటర్
మంత్రులు టచ్‌లో ఉన్నారంటూ ఏలేటి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ గుర్రుమంది. మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపై స్పందిస్తూ, దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని టచ్ చేయాలని సవాల్ చేశారు. మూర్ఖులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి దమ్ముంటే పదేళ్లలో దేశంలో ఏం చేసిందో చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిందని, దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తారా, మీరేమైనా జ్యోతిష్యులా? అంటూ ప్రశ్నించారు.
Read Also: ట్యాపింగ్ వేటు, తిరపతన్న, భుజంగరావు సస్పెండ్
ఎవరు వెళ్లినా నష్టం లేదంటున్న బీఆర్ఎస్
ఓవైపు కాంగ్రెస్, బీజేపీ మధ్య వలసల వార్ నడుస్తుండగా, ఇంకోవైపు బీఆర్ఎస్ వెళ్లిపోయేవాళ్లు వెళ్లిపోవచ్చు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. వలసలపై తాజాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఎవరు వెళ్లినా బీఆర్ఎస్‌కు నష్టమేమీ లేదని అన్నారు. ప్రస్తుతం పార్టీలో గట్టి కార్యకర్తలు మాత్రమే మిగిలారని వ్యాఖ్యానించారు. జనంలో ఉందాం, మళ్లీ పుంచుకుందామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల వేళ నాయకులు పంచ్ డైలాగులతో హీటెక్కిస్తున్నారు.