Visakhapatnam Crime: దేశంలోని ప్రశాంత నగరాల్లో ఏపీలోని విశాఖ ఒకటి. సముద్రపు అలల తాకిడితో హాయిగా ఉండే ఈ నగరం.. గత కొంతకాలంగా హత్యలు, అత్యాచారం ఘటనలతో మార్మోగుతోంది. క్రిమినల్ కేసులకు కేరాఫ్ గా మారుతూ పోలీసులకు సవాళ్లు విసురుతోంది. ఈ క్రమంలోనే తాజాగా విశాఖలో మరో క్రైమ్ చోటుచేసుకుంది. భార్య భర్తల జంట హత్యలు నగరాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి.
ఏం జరిగిందంటే!
విశాఖపట్నం పరిధిలోని కూర్మన్నపాలెం రాజీవ్ నగర్ లో జంట హత్యలు కలకలం రేపాయి. నావల్ డాక్ యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి నాగేంద్ర (Nagendra) ఆయన భార్య లక్ష్మీ (Lakshmi)లను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. దీంతో ఇంటి లోపల రెండు వేర్వేరు గదుల్లో వారు విగత జీవులుగా మారారు. రక్తపు మడుగులో వారి మృతదేహాలు కనిపించాయి.
నో రెస్పాన్స్
శుక్రవారం యోగేంద్ర మేనల్లుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో వారు తలుపు కొట్టినా, కాల్ చేసినా లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంటి చుట్టుపక్కల వారిని అడగ్గా వారు ఉదయం నుంచి అసలు బయటకే రాలేదని చెప్పారు. అనుమానించిన యోగేంద్ర మేనల్లుడు.. కిటికీ తలుపులను బద్దలు కొట్టాడు. అనంతరం లోపలికి చూడగా.. యోగేంద్ర అతడి భార్య రక్తపు మడుగులో పడి కనిపించారు.
పోలీసులకు ఫిర్యాదు
కిటికీలో నుంచి మృతదేహాలను చూసిన యోగేంద్ర బంధువులు.. ఒక్కసారిగా షాకయ్యారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అయితే అప్పటికే వారు చనిపోయినట్లు నిర్ధారించుకొని.. వెంటనే దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం బృందం ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించింది.
అనుమానం లేదట!
దర్యాప్తులో భాగంగా దువ్వాడ పోలీసులు.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యోగేంద్రకు ఎవరితోనైనా పాత పగలు, కక్ష్యలు లాంటివి ఉన్నాయా? అని ప్రశ్నించారు. అయితే ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని యోగేంద్ర మేనల్లుడు పోలీసులకు తెలిపారు. ఆర్థికపరమైన ఇబ్బందులు లేవని, పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారని పేర్కొన్నారు.
Also Read: Social Media Film Awards: దేశంలోనే టాప్ ఈవెంట్.. హాజరైన బిగ్ టీవీ సీఈవో.. ఇన్ ఫ్యూయెన్సర్లకు బిగ్ టిప్స్!
చంపింది ఎవరు?
జంట హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే రెండు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్ కి తరలించారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకైతే ఎలాంటి కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదని దువ్వాడ పోలీసులు తెలిపారు. క్లూస్ టీమ్ నుంచి కూడా నివేదిక రావాల్సి ఉందని పేర్కొన్నారు.