Nagarkurnool District: కొందరు ఆటో డ్రైవర్లు ఇష్టారీతిన వ్యహరిస్తున్నారు. పరిమితంగా ప్రయాణికులను తీసుకెళ్లాలని అధికారులు పదే పదే చెబుతున్నప్పటికీ బేఖాతరు చేస్తూ ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నారు. తాజాగా తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా 23 మంది స్కూల్ విద్యార్థులను ఓ ఆటోలో ఇరికించి తీసుకెళ్లాడో డ్రైవర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 23 మంది చిన్నారులతో వెళ్తున్నఓ ఆటోను ట్రాఫిక్ ఎస్సై కళ్యాణ్ గమనించారు. వెంటనే అప్రమత్తమై ఆటోను అడ్డుకున్నాడు. సరిగా ఊపిరాడని స్థితిలో ఆటోలో ఇరుక్కొని ఉన్న విద్యార్థులను బయటకు రమ్మని ఎస్సై సూచించారు. ఈ క్రమంలో చిన్నారులు ఒక్కొక్కరిగా ఆటో నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. మహేష్ బాబు నటించిన ‘అతడు’ చిత్రంలోని ఓ కారు సన్నివేశాన్ని ఈ ఘటన గుర్తుచేసింది.
ఆటోను సీజ్ చేసిన ఎస్సై..
ఆటో నుంచి బయటకు వచ్చిన చిన్నారులను ట్రాఫిక్ ఎస్సై కళ్యాణ్ రెండు వాహనాల్లో ఇంటికి పంపేశారు. పరిమితికి మించి అత్యంత ప్రమాదకరంగా విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోను ఎస్సై సీజ్ చేశారు. డ్రైవర్ లైసెన్స్ సస్పెన్షన్, జరిమానా వంటి చర్యలు తీసుకున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని డ్రైవర్ ను హెచ్చరించారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులను సైతం ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. విద్యార్థులను స్కూలుకు పంపే హడావిడిలో ఓవర్ లోడ్ అయినా ఆటోలో ఎక్కించడం ప్రమాదకరమని సూచించారు. అనుకోనిది ఏమైనా జరిగితే అందరూ బాధపడాల్సి ఉంటుందని చెప్పారు.
Also Read: Australia: ఒళ్లుగగుర్పొడిచే కాలం.. ఎక్కడ చూసినా లక్షల్లో స్పైడర్లు.. వణుకుపుట్టాల్సిందే!
నెటిజన్లు ఫైర్..
ఏకంగా 23 మంది స్కూల్ విద్యార్థులు ఆటోలో ప్రయాణించిన వీడియోను చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు డ్రైవర్ అంతమందిని ఎలా ఎక్కించుకున్నారని ప్రశ్నిస్తున్నారు. కనీసం తల్లిదండ్రులైనా ఆటోలో ఎక్కించేముందు జాగ్రత్తగా ఉండాలి కదా? అని నిలదీస్తున్నారు. స్కూలు యాజమాన్యాలకు సైతం.. విద్యార్థులను తీసుకొచ్చే వాహనాలను పర్యవేక్షించే బాధ్యత ఉంటుందని గుర్తుచేస్తున్నారు. మరోవైపు స్కూళ్లకు రూ.వేల నుంచి రూ.లక్షల్లో ఫీజులు చెల్లించే తల్లిదండ్రులు.. ట్రాన్స్ పోర్టు విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండటం తగదని మరికొందరు నెటిజన్లు సూచిస్తున్నారు.
