Ys Jagan : గన్నవరంలోని టీడీపీ (TDP) కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జైలులో ఉన్న వల్లభనేని వంశీని (Vallabhaneni Vamsi) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైెెఎస్ జగన్ (Ys Jagan) మంగళవారం కలవనున్నారు. ఉదయం 10 గంటల తర్వాత పలువురు పార్టీ (YCP) నేతలతో కలిసి ములాఖత్ లో (Mulakat) వంశీని పరామర్శించనున్నారు. ఇప్పటికే వంశీ భార్య పంకజ శ్రీని జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అరెస్టు చేసిన రోజు జరిగిన పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారు.
గత వారం హైదరాబాద్ లో వంశీని అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ సబ్ జైలుకు తరలించిన విషయం విదితమే. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా, ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా వంశీ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు… ఆయన సెల్ ఫోన్ కోసం తీవ్రంగా గాలించారు.
కీలకంగా మారిన వంశీ మొబైల్ :
వంశీ కేసులో ఆయన వ్యక్తిగత మొబైల్ కీలక ఆధారం అవుతుందని పోలీసులు చెప్తున్నారు. సెల్ ఫోన్ దొరికితే ముఖ్య సమాచారం దొరుకుతుందంటున్నారు. వంశీ ఎక్కువగా సాధారణ కాల్స్ కంటే వాట్సాప్ కాల్స్ ఎక్కువ చేసేవారని గుర్తించారు. అందుకే సెల్ ఫోన్ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. వంశీని అరెస్టు చేసిన రోజు ఆయన వద్ద ఫోన్ లభించలేదు. అదే ఇంట్లోనే ఎక్కడో ఉందని ఆయన పోలీసులకు తెలిపారు. దాంతో పోలీసులు దాని కోసం ఆరా తీస్తున్నారు.
మరోవైపు, తన భర్తను జైలులో మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని వంశీ భార్య పంకజ శ్రీ ఆరోపించారు. తన భర్త ఆరోగ్యం బాగోలేదని, ఆయన నడుం నొప్పితో బాధపడుతున్నారని, ఆయనకు జైల్లో తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే వంశీ ఆరోగ్యం బాగానే ఉందని అన్ని వైద్య పరీక్షలు చేశామని జైలు అధికారులు చెప్తున్నారు.