Pastor Praveen Pagadala: క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) అనుమానస్పద మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్ కు చెందిన ఆయన.. ఏపీలోని రాజమండ్రిలో రోడ్డుపక్కన శవంగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పక్కనే బైక్ పడి ఉండటంతో రోడ్డు ప్రమాదమని తొలుత భావించినా.. ఆయన శరీరంపై దాడి చేసినట్లుగా గాయాలు ఉండటం చర్చలకు వివాదస్పదమైంది. ప్రవీణ్ మృతిపై క్రైస్తవ మత పెద్దలతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో పాస్టర్ మృతి కేసు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ప్రవీణ్ మృతదేహం ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తాజాగా కేఏ పాల్ వెళ్లగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ఆస్పత్రి వద్ద రచ్చ
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్దకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) వెళ్లారు. పోస్టుమార్టం గదిలోకి తనను అనుమతించాలని కేఏ పాల్ పట్టుబట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కేఏ పాల్ ను అడ్డుకున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులపై పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్టర్ అనుమానస్పద మృతిపై వెంటనే విచారణ చేపట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. లేని పక్షంలో భగవంతుడు క్షమించడని వ్యాఖ్యానించారు.
సిట్ ఏర్పాటు: ఎస్పీ
పాస్టర్ ప్రవీణ్ మృతిపై రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొవ్వూరు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. ప్రవీణ్ మృతికి సంబంధించిన రెండు సీసీటీవీ ఫుటేజీలు లభించినట్లు చెప్పారు. సోమవారం అర్ధరాత్రి 11.31 నుంచి 11.42 మధ్య సమయం అత్యంత కీలకంగా మారిందని అన్నారు. రాత్రి 11 గంటల 42 నిమిషాలకు ఒక కారుతో పాటు 5 వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ బైక్ ను దాటుకొని వెళ్లాయని ఎస్పీ అన్నారు. అందులో రెడ్ కలర్ కారు, ప్రవీణ్ బైక్ ఒకేసారి వెళ్లాయని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ కారు కోసం విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Panic Button In MMTS: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఒక్క బటన్ నొక్కితే చాలు..
హోంమంత్రి ఏమన్నారంటే
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి అనిత (Home Minister Anitha) స్పష్టం చేశారు. డీఎస్పీ స్థాయిలో పోలీసుల బృందం విచారణ జరుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందన్న అనిత.. దీనిని కేవలం రోడ్డు ప్రమాదంగా భావించడం లేదని అన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాబట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరూ ప్రవర్తించవద్దని హోంమంత్రి అనిత అన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కాల్ డేటా రికార్డులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నట్లు ఆమె తెలిపారు. కేసు దర్యాప్తు విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్ఫష్టం చేశారు.
జగన్ దిగ్భ్రాంతి
ఏపీలో రచ్చ రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) స్పందించారు. ఎక్స్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన.. బంధువులు, కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నిస్పక్షపాత దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాస్టర్ మరణం వెనకున్న నిజా నిజాలను వెలుగులోకి తీసుకొని రావాలని కోరారు.