Kurnool Court: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితుల్లో 11 మంది నిందితులకు న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. ఐదుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటిస్తూ గురువారం తీర్పును వెలువరించింది. నిందితులకు జీవిత ఖైదు విధించడంతో పాటు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయిలు న్యాయస్థానం జరిమానా విధించింది. శిక్షపడిన వారిలో రామాంజనేయులు, రామకృష్ణ, రామానాయుడు, చిన్న ఎల్లప్ప, పెద్ద ఎల్లప్ప, నారాయణ, బాలు, వెంకట్రాముడు, గంటల శ్రీను, రామాంజనేయులు, పెద్ద బీసన్నకు జీవిత ఖైదు పడింది. ఈ ఫైనల్ జడ్జిమెంట్‌తో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చెరకలపాడు, తోడిచేడు, పత్తికొండ గ్రామాల్లో పోలీసులు భారీగా పికెట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. అయితే కర్నూలు జిల్లా సెంట్రల్ జైలులో రెండు రోజులపాటు రిమాండ్ విధించి, అనంతరం కడప సెంట్రల్ జైలుకు దోషులను తరలించే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా కోర్టు ముందు శిక్ష పడిన నిందితుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఈ కేసులో బాధితుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మద్దికుంట వెంకటరెడ్డి వాదనలు వినిపించారు.
Read Also- Helicopter Crash: పెను విషాదం.. హెలికాఫ్టర్ ప్రమాదంలో టీడీపీ ఎంపీ సోదరి దుర్మరణం
అసలేం జరిగింది?
కాగా, 2017 మే 21న వెల్దుర్తిలో పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం శివారులో వాహనాన్ని అడ్డగించి నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివరెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. కృష్ణగిరి వద్ద కాపుకాసి అత్యంత పాశవికంగా ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ హత్య ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనమే సృష్టించింది. అప్పట్లో ఈ జంట హత్యల కేసులో 19 మందిపై కేసు నమోదైంది. ఈ 19 మందిలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కేజీ శ్యాంబాబు, కప్పట్రాళ్ల బుజ్జమ్మ కూడా ఉన్నారు. కేసులో ఏ4గా ఉన్న వ్యక్తి చనిపోవడంతో పేరు తొలగించారు. ఈ సంచలన తీర్పుపై మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి స్పందించారు. కోర్టు తీర్పుతో న్యాయస్థానాల పట్ల మరింత నమ్మకం పెరిగిందని తెలిపారు. ఈ సంచలన తీర్పుతో అయినా తనలాంటి మరో మహిళకు అన్యాయం జరగకూడదని భావిస్తున్నట్లు శ్రీదేవి చెబుతూ కంటతడి పెట్టారు.