Damodara Rajanarsimha: సిజేరియన్లపై ఆడిట్ ను మరింత స్ట్రిక్ట్ గా నిర్వహిస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. కారణం లేకుండా సిజేరియన్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అధిక బిల్లులు వసూల్ చేసేందుకు సిజేరియన్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊపేక్షించేది లేదన్నారు. సి సెక్షన్ ఆడిట్ ను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక టీమ్ లు రంగంలోకి దిగుతాయన్నారు.
ఆయన కోఠిలోని మెడికల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రభుత్వ దవాఖాన్లలో నార్మల్ డెలివరీల సంఖ్యను మరింత పెంచాలన్నారు. నార్మల్ డెలివరీ వల్ల కలిగే లాభాలను, సీ సెక్షన్ వల్ల జరిగే నష్టాలను యాంటి నాటల్ చెకప్స్ సమయం నుంచే గర్భిణులకు, వారి కుటుంబ సభ్యులకు వివరించాలన్నారు.
Also Read: Ganja Seized: తెలంగాణలో డ్రగ్ మాఫియా పై ..ఎక్సైజ్ గట్టిదెబ్బ!
నార్మల్ డెలివరీల సంఖ్య పెంచేందుకు, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు. మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో వసతులను మరింత మెరుగు పర్చాలని, ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీ చేయించుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల హాస్పిటల్స్‌లో గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని హాస్పిటల్స్‌లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన వార్డులలో ఏసీలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఇక ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు.గతేడాది 8 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 6200లకు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇందులో డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయన్నారు.ఈ పోస్టులన్నింటికీ రాత పరీక్షలు పూర్తి కాగా, వెంటనే ఫలితాలు విడుదల చేసి, నెల రోజుల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందికి సకాలంలో ప్రమోషన్లు ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు.ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్ వీ కర్ణన్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు