Brs Party: గులాబీ రజతోత్సవ సభ సక్సెస్‌తో పార్టీ నాయకులు, కార్యకర్తల్లోనూ జోష్ పెరిగింది. సభతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కు బూస్ట్ ఇచ్చినట్లయింది. అయితే సభ సక్సెస్ క్రెడిట్ ఎవరికి అనేది పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చజరుగుతుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దా? లేకుంటే కవితదా? మరెవరిది.. లేక వరంగల్ జిల్లా నేతలదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే జోరు కొనసాగాలంటే మరి ఎవరికి పార్టీలో కీరోల్ అనేది చర్చమొదలైంది.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతుండటంతో రజతోత్సవం పేరుతో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ సభ నిర్వహించారు. సభకు జనసమీకరణ చేశారు. ఊహించని రీతిలో సభను సక్సెస్ చేశారు. ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో కేడర్ ఉంది. నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, కరీంనగర్ పట్టభద్రుల-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటికి దూరంగా ఉండటంతో కొంత పార్టీపై దుష్ప్రాచారం సైతం జరిగింది. కేడర్ లో మరింత నైరాశ్యం నెలకొంది. అయితే పార్టీ రజతోత్సవ సభ సక్సెస్ కావడం, కేసీఆర్ సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేసి ప్రజల్లో సమస్యలపై చర్చకు దారితీశారు.
కేడర్ లో సభతో జోష్ నింపారు. అయితే ఈ సక్సెస్ క్రెడిట్ ఎవరిది.. ఎవరికి ఇవ్వాలనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఇంత భారీగా సభ సక్సెస్ కావడానికి శ్రమించిన వారెవరు.. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తూ నిత్యం నాయకులను అలర్టు చేసింది ఎవరు అనే చర్చజరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు ఈ క్రెడిట్ ఇవ్వాలా? లేకుంటే కేటీఆర్, కవితలకు ఇవ్వాలా.. ఎవరికి ఇవ్వాలనేది ఇప్పుడు టాపిక్ గా మారింది.
Also read: Kaleshwaram project: కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు..
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీ రజతోత్సవ సభపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సభ సక్సెస్ లక్ష్యంగా ముందుకు సాగారు. నిత్యం నాయకులతోనూ సమీక్షించారు. తొలుత రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పర్యటించి అన్ని నియోజకవర్గా నేతలతో భేటీ అవుతారని సమాచారం ఇచ్చారు. ఆతర్వాత కేసీఆర్ రంగంలోకి దిగి ఉమ్మడి జిల్లాల వారీగా ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో ముఖ్య నేతలతోసమావేశం నిర్వహించి సభ సక్సెస్ పై దిశానిర్దేశం చేశారు. ప్రతి ఉమ్మడి జిల్లా సమావేశంలో పాల్గొని నేతలతోనూ మాట్లాడారు. టెలీకాన్ఫరెన్స్ తో పాటు సక్సెస్ పై తీసుకోవాల్సిన అంశాలను సైతం వివరించారు.
తను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లతో పాటు సూర్యాపేట ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన సన్నాహక సమావేశాల్లోనూ పాల్గొని పార్టీ చరిత్ర, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వవైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముందుచూపుతో వ్యవహరించి ప్రజల తరలింపునకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు 3వేల బస్సులకు పార్టీ ఫండ్ తో బుక్ చేయించి జనం తరలించడంలోనూ కీలక భూమిక పోషించారు. సభ సక్సెస్ క్రెడిట్ అంతా కేటీఆర్ దేనని ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్సీ కవిత సైతం తనదైన శైలీలో సభ సక్సెస్ కు కృషి చేశారు. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ ఇలా జిల్లాల పర్యటనలు చేశారు. నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై తనదైన శైలీలో విమర్శలు గుప్పించారు. కేడర్ లోజోష్ పెంచారు. తాను అండగా ఉంటానని, ఏ కష్టం వచ్చినా సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు.
మరోవైపు జాగృతి నాయకులు, మహిళలను, బీసీలను ఎప్పటికప్పుడు జరుగుతున్న అన్యాయాలపై చైతన్యం చేస్తూ వారిని సభకు తరలించడంలోనూ సక్సెస్ అయ్యారని పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సభ సక్సెస్ లో జనసమీకరణలో కవిత కూడా కీలక భూమిక పోషించారని అనుచరులు పేర్కొంటున్నారు.
Also read: RTC Strike: మే 7 నుంచి ఆర్టీసీ సమ్మె.. జేఏసీ నిర్ణయం!
మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇలా మరికొందరు నేతలు సైతం సభ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంలో కీలక పాత్రపోషించారని ప్రచారం జరుగుతుంది. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కీలక భూమిక పోషించారనే ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి సభ ప్రారంభోపన్యాసం చేసి పార్టీలో చర్చకు దారితీసింది.
ఇలా సభ సక్సెస్ లో నేతలంతా తమవంతు కృషి చేశారు. సభను విజయవంతం చేశారు. అయితే సభ ఇంత భారీగా సక్సెస్ కావడంతో ఎవరి క్రెడిట్ అనేది చర్చకు దారితీసింది. కేసీఆర్ మాత్రం ఎవరికి ఇస్తారు? ఎవరిని అభినందిస్తారనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ సక్సెస్ క్రెడిట్ ఇచ్చే వారికి పార్టీలో ఎలాంటి పదవులు ఇస్తారనేది మరోవైపు చర్చజరుగుతుంది.