Telangana State Emblem Symbol Photos Goes Viral: జూన్ 2న జరగబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా రానుండగా..అదేరోజున ఆమె చేతులమీదుగా రాష్ట్రగీతం, రాజముద్రలను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్ పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న తొలి అవతరణ దినోత్సవ వేడుకలను అంగరంగా వైభవంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్ర గీతం జయ జయహేకు తుది మెరుగులు దిద్ది మళ్లీ ఆవిష్కరిస్తున్నారు. అలాగే రాజముద్రను కూడా కొత్తగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజముద్ర ఎలా ఉంటుందనేది తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Also Read: దశాబ్దాల కల నెరవేరిన సుదినం..
రాష్ట్ర రాజముద్రను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెట్టింట మూడు డిజైన్లతో ఉన్న లోగోల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తొలి లోగో మధ్యలో పూర్ణకుంభం, దానికి ఇరువైపులా తంగేడు ఆకులు, పై భాగంలో మూడు సింహాలు, కింద చార్మినార్ ముద్ర ఉంది. అలాగే రెండో లోగో పైభాగంలో 3 సింహాల రాజముద్ర, మధ్యలో రాష్ట్ర మ్యాప్, కింద హుస్సేన్ సాగర్‌లో ఉండే బుద్ధుని స్టాచ్యూ ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక లోగోను రాష్ట్ర రాజముద్రగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. నేడు తెలంగాణ కొత్త రాజముద్ర ఇదేనంటూ మరో లోగో బయటికొచ్చింది. ఈ లోగోలో రాష్ట్రాన్ని సాధించిన అమరవీరులకు గుర్తుగా ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని మధ్యలో ఉంచారు. దానికి ఇరువైపులా తంగేడు ఆకులు, పైన మూడు సింహాల రాజముద్ర ఉన్నాయి. చుట్టూ నాలుగు భాషల్లో హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అని రాసి ఉంది.