Telangana Seperate State Dream Finally Comes True: అమరుల త్యాగాల పునాదుల మీద ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు.. జూన్ 2. దశాబ్దాల పోరాటాలు ఎట్టకేలకు ఫలించిన రోజు. ఇక్కడి ప్రజలు తమ ఆత్మగౌరవ, స్వయం పాలన బావుటాను సగర్వంగా ఎగురవేసిన రోజు. దశాబ్దాల పోరాటాల తర్వాత తెలంగాణలోని ప్రతి మోముపై చిరునవ్వు ఆవిష్కృతమైన రోజు. 2014 జూన్ 2న నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఏర్పడి మరో 3 రోజుల్లో పదేళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అన్నీ తామై వ్యవహరించిన కవులు, కళాకారులు, ఉద్యమకారులకు ఈ వేడుకల్లో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సమున్నత గౌరవం ఇవ్వాలని నిర్ణయించటం పట్ల యావత్ తెలంగాణ సమాజంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
భాషా ప్రయుక్త రాష్ట్రంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తొలినాళ్లలోనే ప్రత్యేక తెలంగాణ కావాలనే కోరికను తెలంగాణ సమాజం వ్యక్తపరచగా, 1969 నాటి తొలిదశ తెలంగాణ ఉద్యమంలో అది మరింత ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. పెద్దమనుషుల ఒప్పందం అమలుకు నోచుకోకపోవడం, తెలంగాణపై వివక్ష కొనసాగుతుండటం, తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి , హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని విలువైన భూములను సీమాంధ్రులు కారుచౌకగా కొనుగోలు చేయటం, ముల్కీ నిబంధనల ఉల్లంఘన, తెలంగాణ ఆదాయాన్ని ఇతర ప్రాంతాల అభివృద్ధికి వాడటం, ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణవారిపై వివక్ష వంటి చర్యలు తొలి దశ ఉద్యమానికి ఊపిరి పోశాయి. తెలంగాణ ఉద్యోగాల్లో ఆంధ్ర ప్రాంతం వారికి ప్రాధాన్యాన్ని ప్రశ్నిస్తూ, ఖమ్మంలో, ఉస్మానియా వర్సిటీలో ఉద్యమం ఆరంభమై, అనతి కాలంలోనే తెలంగాణ ప్రాంతమంతా వ్యాపించింది. తొలుత కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆంధ్రా ప్రాంతీయులు ఎక్కువ ఉద్యోగాలు దక్కాయంటూ 1969 జనవరి 9న ఖమ్మం జిల్లా పాల్వంచలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరవధిక దీక్ష ప్రారంభించగా, అది తెలంగాణను కుదిపేసి, చివరికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా మారింది. ధర్నాలు, సమ్మెలు, ఆందోళనలు, భౌతిక దాడులు, ప్రభుత్వ ఆస్తుల విధ్యంసం జరిగింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూత పడ్డాయి. ఆందోళన కారులపై లాఠీ చార్జీలు, కాల్పులు జరిగాయి. ఉద్యమాన్ని చల్లార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన హామీలు పనిచేయకపోగా, తెలంగాణేతరులను (నాన్‌ముల్కీలను) తొలగించి వారి స్థానంలో తెలంగాణ వారిని నియమించేందుకు కేంద్రం తెచ్చిన చట్టం చెల్లదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నాటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఎగిసిపడేలా చేసింది. దీంతో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో సదాలక్ష్మి, సుమిత్రా దేవి, ఈశ్వరీబాయి వంటి మహిళా నేతలూ గొప్ప పాత్ర పోషించారు.
Also Read: ఆహార ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట ఏదీ?
ఈ ఉద్యమానికి మద్దతుగా 1969 మార్చిలో మదన్ మోహన్ అధ్యక్షులుగా వెంకట్రామారెడ్డి కార్యదర్శిగా ఏర్పడిన తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్.. తర్వాత తెలంగాణ ప్రజా సమితిగా మారి, కొన్నాళ్లకు ఉద్యమం అంతా మర్రి చెన్నారెడ్డి వంటి నేతల చేతిలోకి వెళ్లింది. 1969 జూన్ 1న కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అవతరించటం, అప్పటికే ఉద్యమ హింసలో 370 మంది మరణించటంతో ఉద్యమకారులను శాంతింపజేసేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1969 ఏప్రిల్ 11న అష్టసూత్ర పథకాన్ని ప్రకటించింది. అయితే, దాని అమలులో న్యాయవివాదాలు రావటంతో ఉద్యమం నివురుగప్పిన నిప్పులా సాగింది. ఈ పరిస్థితులలో వచ్చిన 1971 సాధారణ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి 14 లోక్‌సభ సీట్లకు పోటీ చేసి, ఏకంగా 10 సీట్లు గెలుచుకుని ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నిలిపినా, ఆ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అఖండ మెజారిటీ సాధించటంతో.. చివరకు తెలంగాణ ప్రజాసమితి.. కాంగ్రెస్ పార్టీలో విలీనం కావటంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చల్లబడింది.
మూడు దశాబ్దాల తర్వాత మరోమారు మలిదశ రూపంలో తెలంగాణ ఉద్యమం పునరుజ్జీవితమైంది. ప్రొఫెసర్ జయశంకర్ మొదలు అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు పలు రూపాల్లో ఉద్యమానికి ఊపిరులూదారు. ఇదే సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యం అంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజకీయ భూమికను ఏర్పాటు చేసే యత్నం చేసింది. అదే సమయంలో నాటి వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తెలంగాణ ఏర్పాటుపై వినతి పత్రాన్ని సమర్పించటం, తర్వాత 2004 ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన కామన్ మినిమం ప్రోగ్రామ్‌లో తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపునివ్వటం, ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబరు 9న నాటి హోంమంత్రి చిదంబరం ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నాము’ అంటూ చేసిన ప్రకటన, సీమాంధ్రుల వ్యతిరేకతను లెక్కచేయకుండా సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయంతో 2014 జూన్ 2న తెలంగాణ కల సాకారమైంది.
గత మూడు దశాబ్దాల కాలంలో తెలంగాణతో బాటు దేశంలో విదర్భ, గూర్ఖాలాండ్, బుందేల్ ఖండ్, పూర్వాంచల్, సౌరాష్ట్ర, బోడోలాండ్, కొంగునాడు, తులనాడు, హరిత ప్రదేశ్, వింధ్య ప్రదేశ్, డార్జిలింగ్ వంటి అనేక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చినప్పటికీ ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే సాకారమైంది. సుమారు ఐదు దశాబ్దాల పాటు ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలిపేందుకు ఆయా కాలాల్లో అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ సంఘాల వారు క్రియాశీలక పాత్ర పోషించటమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. 1999లో జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలకు పచ్చజెండా ఊపిన బీజేపీ ఇక్కడి ఉద్యమ ఆకాంక్షలను గౌరవించకపోవటంతో నాడు తెలంగాణ సాకారం కాలేదనేదీ వాస్తవం. అదే సమయంలో తెలంగాణ ఇస్తే, సీమాంధ్రలో తమ పార్టీ కోలుకోలేని రీతిలో దెబ్బతింటుందని తెలసి కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటుకు ముందుకు వచ్చిన వాస్తవాన్నీ మరువలేము. ఏది ఏమైనా తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరిన ఈ అపురూప సందర్భంలో సాధించిన తెలంగాణను, పటిష్టం చేసుకుంటూ, దానిని ప్రగతి బాటన పరుగెత్తించి, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు కలిసి పనిచేయాలి. అదే మనం తెలంగాణ సాధనలో నేలకొరిగిన అమరులకు ఇచ్చే అసలైన నివాళి.
-డాక్టర్ తిరునహరి శేషు (పొలిటికల్ ఎనలిస్ట్) కాకతీయ విశ్వవిద్యాలయం