– శంకర్ నాయక్ వర్సెస్ రవీందర్ రావు
– వేదిక మీదే సవాళ్లు విసురుకున్న నేతలు
– సర్దిచెప్పిన ఎంపీ అభ్యర్థి కవిత
Communal Differences In Mahabubabad BRS Party: మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లుగా బీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ లోక్‌సభ ప్రచారంంలో బీఆర్ఎస్ పార్టీలోని వర్గ విభేదాలు ప్రచార సభ సాక్షిగా బయటికి రావటంతో నాయకులంతా తలలు పట్టుకున్నారు. మంగళవారం కవిత నామినేషన్ అనంతరం, నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చగా మారుతోంది.
ఇక్కడ ఎమ్మెల్సీ రవీందర్ రావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ల మధ్య ఆది నుంచి సఖ్యత లేదు. దీంతో మంగళవారం జరిగిన ప్రచారవేదిక మీద మాజీ ఎమ్మెల్యే వేదిక మీద మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. కొందరు నేతలు బీఆర్ఎస్‌లో ఉంటూ మరో పార్టీకి పనిచేస్తున్నారంటూ కామెంట్ చేశారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారని, అలాంటివి పునరావృతం కావొద్దని, అలాంటి ద్రోహులపై పార్టీ అధిష్ఠానం తక్షణ చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్సీ రవీందర్ మైక్ తీసుకుని శంకర్ నాయక్‌ను ఉద్దేశించి.. ‘పరిహాసంగా ఉందా? వేదిక మీద ఏం మాట్లాడుతున్నావ్?’ అనటంతో ఇరువురు నాయకుల అనుచరులు పెద్దగా కేకలకు దిగారు. దీంతో ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత.. శంకర నాయక్ దగ్గరి నుంచి మైక్ తీసుకుని సర్దిచెప్పబోగా, మళ్లీ మైక్ తీసుకున్న శంకర్ నాయక్ తనను ఎందుకు మాట్లాడనివ్వడం లేదని ప్రశ్నించారు. ‘చూసుకుందామంటే చూసుకుందాం’ అంటూ నేతలిద్దరూ సవాళ్లు విసురుకోవటంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో వేదికపై ఉన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఇతర సీనియర్ నాయకులు వారికి సర్దిచెప్పారు.
Also Read:పైకి షేర్వాణి..లోన పరేషానీ
మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్‌డ్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బలరాం నాయక్, బీజేపీ తరపున సీతారం నాయక్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుండగా.. అందులో భద్రాచలం మినహా ఆరు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్‌లు కాంగ్రెస్ చేతిలోనే ఉండటం బలరాం నాయక్‌కు కలిసి రానుంది.