- పైకి గంభీరంగానే ఉన్నా లోన ఆందోళనతో ఉన్న కేసీఆర్
- మాజీ సీఎం కేసీఆర్ ఫేమస్ డైలాగ్ గుర్తుచేసుకుంటున్న జనం
- సీఎం రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బతో బహిరంగ సభలు బంద్
- కేవలం టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు, బస్సు యాత్రలకే పరిమితం
- బహిరంగ సభలు నిర్వహిస్తే జనం రారేమోనన్న టెన్షన్
- జనాన్ని తరలించే ధైర్యం చేయలేకపోతున్న అభ్యర్థులు
- ఓడినా, గెలిచినా మళ్లీ మరో ఐదేళ్ల దాకా ఆగాల్సిందే
- తీవ్ర నిరుత్సాహంలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు
- కేవలం కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకే బస్సు యాత్రలు
- ఇంతటి ఆందోళనలోనూ కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
- కాంగ్రెస్ అభ్యర్థులు టచ్ లో ఉన్నారంటూ బీరాలు
సరిగ్గా ఏడాది క్రితం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం చెమటోడుస్తున్నారు. సొంత పార్టీలోనే రేవంత్ పై నమ్మకం లేని నేతలు ఉన్నారు. అలాంటి పరిస్థితిలో పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ రేవంత్ ను చాలా తక్కువ అంచనా వేశారు. అసలు తమ ప్రత్యర్థే కాదనుకున్నాడు గులాబీ బాస్. ఇంతింతై వటుడింతై అన్నట్లు రేవంతుడు అటు పార్టీలో ఇటు పబ్లిక్ లో బలవంతుడు అయ్యాడు. అసెంబ్లీ ఎన్నికలలో ఏకంగా బీఆర్ఎస్ కంచుకోటలనే బద్దలు కొట్టారు. ఎంతలా అంటే మాజీ సీఎం కారు షెడ్డులోకి వెళ్లిపోయేలా..సాధారణంగా విజయం అనేది ధీమా పెంచుతుంది. ఓటమి మాత్రం గుబులు పెంచుతుంది. పదేళ్లుగా తెలంగాణ సెంటిమెంట్ ను క్యాష్ చేసుకుని ఆస్తులు రెట్టింపు చేసుకోవడం తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోని నేతగా ముద్ర పడ్డారు కేసీఆర్. ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి కొట్టిన స్ట్రాంగ్ డోస్ కు దిమ్మదిరిగిన కేసీఆర్ చాలా రోజులు ఫాం హౌస్ కే పరిమితం అయ్యారు. తర్వాత ప్రజలకు మొహం చూపలేక ఇప్పుడు బహిరంగ సభలు పెట్టేందుకు వెనకాడుతున్నారు. అందుకే బస్సు యాత్రతో సరిపెట్టేస్తున్నారు. పైగా ఎన్నడూ లేనిది టీవీ ఛానల్ కు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి స్పీడ్ కు కేసీఆర్ భయపడుతున్నట్లే కనిపిస్త్ోంది.
కేసీఆర్ ఫేమస్ డైలాగ్
అప్పట్లో కేసీఆర్ డైలాగ్ గుర్తుకు వస్తోంది. పైకి మాత్రం షేర్వాణి లోన పరేషాని అని చాలా సందర్భాలతో కేసీఆర్ అంటుండేవారు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది కేసీఆర్ సారుకు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పదేళ్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. ఏ నాడూ ప్రజల ముందుకు వచ్చి.. తన పాలన లోపాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. పేదోళ్లకు కష్టం వచ్చినా.. విపత్తులతో విలవిలలాడినా.. దగ్గరకు వచ్చి సాంత్వన కలిగించే మాటను చెప్పింది లేదు. తాను.. తన మనుషులు.. తన ప్రపంచాన్ని వేరుగా చేసుకున్న ఆయన.. అందులోనే మునిగి తేలేవారు. మంత్రులు మొదలు సామాన్యుల వరకు ఎవరికి అందుబాటులో ఉండేవారు కాదు. సీనియర్ ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు గంటల కొద్దీ సమయం వెయిట్ చేయాల్సి వచ్చేది. తన తప్పొప్పులను ఎత్తి చూపే మీడియాను అస్సలు పట్టించుకోకపోవటమే కాదు.. వారికి ఎలాంటి సమాచారం అందకుండా కట్టడి చేసిన రోజుల్ని మర్చిపోలేం.
కేసీఆర్ పంచ్ లు ప్రాసలు ఏమైనాయి?
అయితే కేసీఆర్ మీడియా ముందుకు వచ్చినా.. బహిరంగ సభల్లో ప్రసంగించినా ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఆయన వేసే పంచ్‌లు, ప్రాసలు, అంతకుమించి కౌంటర్లు.. మధ్య మధ్యలో జోక్‌లు మామూలుగా ఉండవు. అందుకే కేసీఆర్ స్పీచ్ వస్తోందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కిపోతుంటారు. ఇదంతా ఒకప్పటి పరిస్థితి.. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఆయన స్పీచ్ లో ఎంతసేపూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు ..అంత మంది ఉన్నారు..ఇంత మంది ఉన్నారు అంటూ కాకి లెక్కలు చెబుతున్నారే తప్ప పార్టీ నుంచి ఎంత మంది వెళ్లిపోతున్నారో పట్టించుకోవడం లేదు. ఒ అబద్దాన్ని పదే పదే చెబితే కొంతకాలానికి నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డిని మానసికంగా తన మాటలతో రెచ్చగొడితే సీఎం రేవంత్ ఆవేశంతో కేసీఆర్ ను తిడితే ఆ సింపతీని ఉపయోగించుకుని నాలుగు ఓట్లు పెంచుకుందామని చూస్తున్నారే తప్ప కేసీఆర్ చేసే వ్యాఖ్యలకు ఆయన పార్టీకే ఎక్కువ డ్యామేజీ అయ్యే ప్రమాదం ఉంది.
కేవలం వాటికే పరిమితం
కేసీఆర్ కు పవర్ పోయిన తర్వాత తనలో మార్పు అనివార్యమన్న విషయాన్ని గ్రహించారు. ఆయన నిజంగా మారారా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఎన్నికల వేళ మార్పు వచ్చిన భావన ప్రజల్లో కలిగేలా చేయటం కోసం ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను షురూ చేసిన ఆయన.. టీవీ చానళ్ల వద్దకు వెళ్లి.. ప్రత్యేక ఇంటర్వ్యూల పేరుతో గంటల కొద్దీ సమయాన్ని గడపాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడ చూసినా తన మాటలు.. తన వాదన బలంగా వినిపించేలా చేయటమే ఆయన లక్ష్యమంటున్నారు. తన మాటలు మంత్రాల వలే ఉంటాయన్న విషయాన్ని తన సన్నిహితుల వద్ద గొప్పగా చెప్పుకునే ఆయన.. అదే నమ్మకంతో ఎన్నికల వేళ ప్రజల మనసుల్ని గెలుచుకోవాలన్న ఆత్రుతతో ఉన్నారు.
జనాన్ని తరలించే దమ్ము ఏది?
కేసీఆర్ మాత్రం బహిరంగ సభలు పెట్టే ధైర్యం చేయడం లేదు. ఎందుకంటే జనాన్ని తరలించే దమ్ము లేదు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఆ కొద్ది మంది నేతలు ఎన్నికలలో డబ్బులు ఖర్చుపెట్టేందుకు వెనకాడుతున్నారు. బహిరంగ సభలకు వచ్చేవారికి ఒక్కో వ్యక్తికి కనీసం వెయ్యి రూపాయలైనా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఒక్కో బహిరంగ సభకు దాదాపు కోట్లతో కూడుకున్న వ్యవహారం. స్వచ్ఛందంగా జనం వచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. ఇలాంటి పరిస్థితిలో గులాబీ బాస్ ముందు ఉన్న ఆప్షన్స్ ఇవే..అయితే టీవీ ఇంటర్వ్యూలు, బస్సు యాత్రలు. ఇవి రెండూ పెద్దగా ఖర్చులేని పనులు. మరి రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బ సామాన్యంగా లేదు. అందుకే ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి పైకి షేర్వాణి లోన పరేషాని అంటున్నారంతా.