BRS Party Silver Jubilee: వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సభకు తరలివచ్చారు. ఎటువైపు చూసినా బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతూ కనిపించింది. అయితే ఇక్కడ మరో పార్టీ జెండాలు కూడా కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. ఔను.. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఈ తీరు కనిపించడంతో పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కావడంతో రాష్ట్రం నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. సభా ప్రాంగణం నిండుగా కనిపిస్తోంది. సుమారు 1200 ఎకరాలకు పైగా సభకు సిద్ధం చేయగా, ఉదయం నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సందడి చేస్తున్నారు. కొందరు ఎడ్ల బండ్లు, బస్సులు, కార్లు, ఇలా వాహనాలలో సభకు తరలివచ్చారు. అయితే పలు గ్రామాల వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీలు సైతం నిర్వహించారు.
కాగా బీఆర్ఎస్ రజతోత్సవ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఒక పార్టీ సభ నిర్వహించే సమయంలో మరే ఇతర పార్టీ జెండాలు కనిపించవు. కానీ ఇక్కడ మాత్రం వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు రెండు పార్టీల జెండాలను పట్టుకొని జై జగన్.. జై కెసిఆర్ అంటూ నినదించారు. దీనితో కొందరు బీఆర్ఎస్ నాయకులు సైతం విస్తుపోయిన పరిస్థితి.
అయితే మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ కు మధ్య మిత్ర బంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో ఎన్నికల సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఏపీలో మళ్లీ జగన్ వస్తారని కేసీఆర్ తేల్చి చెప్పారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం సమయంలోనూ, కెసిఆర్ అప్పుడు హాజరయ్యారు. ఇలా వారి మధ్య మైత్రి బంధం నేటికీ కొనసాగుతూ ఉందని చెప్పవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకొని కొందరు కార్యకర్తలు వైసీపీ జెండాలను సైతం బీఆర్ఎస్ రజతోత్సవ సభ వద్ద రెపరెప లాడించారు.
Also Read: Congress on BRS Party: మరికొద్ది గంటల్లో బీఆర్ఎస్ సభ.. కాంగ్రెస్ సంచలన ట్వీట్..
ఈ దృశ్యాలను కొందరు టిడిపి శ్రేణులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ హల్చల్ చేస్తున్నారు. అయితే ఈ దృశ్యాల మీద కొందరు నెటిజన్స్ మాత్రం ఇవి పాత వీడియోలని అంటుండగా, మరికొందరు క్లియర్ ఆడియో రికార్డ్ వినిపిస్తుందని అంటున్నారు. మొత్తం మీద ఇది నిజమో కాదో కానీ ఏపీ మాజీ సీఎం జగన్ పేరు మాత్రం బీఆర్ఎస్ సభ వద్ద వినిపించిందని మరికొందరు అంటున్నారు.