Pregnant: పాపం.. ఆ మహిళ ఎంతో హ్యాపీగా డెలివరీ కోసమని ఆస్పత్రికి వెళ్తే ఊహించని ఘటన చోటుచేసుకున్నది. దీంతో అసలేం జరిగిందో తెలియక రెండు మూడ్రోజులు తీవ్ర ఇక్కట్లు పడిన పరిస్థితి. తీరా చూస్తే.. అబ్బే మాదేం తప్పులేదు అంటూ డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న తప్పులతో ప్రభుత్వ ఆస్పత్రులు అంటే చాలు ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగింది? ఆస్పత్రిలో ఏం జరిగింది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. పూర్తి వివరాల్లోకెళితే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో డెలివరీ కోసం వచ్చిన మహిళా సర్జరీ విషయంలో డాక్టర్లు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. సర్జరీ చేస్తున్న సమయంలో కడుపులో సూది జారవిడిచి.. సర్జరీ అనంతరం సూది కనపడకపోయేసరికి ఎక్సరే తీసి సూది కడుపులో నుంచి బయటికి తీసి తిరిగి కుట్లు వేశారు. ఈ విషయం బయటికి తెలిసేసరికి తమదేం తప్పు లేదని కొంత మంది కావాలనే ఆస్పత్రిని అభాసుపాలు చేస్తున్నారని ఆస్పత్రి సుపరిడెంటెండ్ చెప్పడం గమనార్హం.
Read Also- YS Jagan: చంద్రబాబు-జగన్ మధ్య ‘కమ్మ’ ఫైట్.. అభ్యంతరమేంటి?
ఎందుకిలా..?
జమ్మికుంట పట్టణానికి చెందిన ఓ మహిళ ఆదివారం నాడు హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి డెలివరీ కోసం వచ్చారు. మొదట నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించిన వైద్యులు.. కాకపోవడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. అయితే సర్జరీ సమయంలో కుట్లు వేసి సూదిని కడుపులోనే మరిచిపోయారు. సర్జరీ తర్వాత సూది కనపడకపోయేసరికి డాక్టర్లకు అనుమానం వచ్చింది. వెంటనే ఆగమేఘాల మీద సర్జరీ చేసిన మహిళకు ఎక్సరే తీయగా.. కడుపులోనే సూది ఉన్న విషయాన్ని గ్రహించారు. దీంతో తిరిగి ఆ కుట్లు విప్పి సూదిని బయటికి తీసి మళ్లీ కుట్లు వేశారు. అయితే ఈ విషయం మూడ్రోజుల తర్వాత బయటికి రావడంతో ఇందులో తమ తప్పేం లేదని కుట్లు వేసేటప్పుడు చివరి సమయంలో సూది కడుపులో పడిపోయిందని వెంటనే ఎక్సరే తీసి సూదిని బయటికి తీశామనీ ఆస్పత్రి సూపరిడెంటెండ్ నారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. సూది మిస్సయిన మాట వాస్తమేనని, కడుపులో నుంచి సూది తీసి తిరిగి కుట్లు వేశారన్నారు. అంతేకాదు.. తనకేం ఇబ్బంది లేదని ఆరోగ్యం నిలకడగా ఉందని బాధితురాలు చెబుతున్నారు.
ఇంకెన్ని రోజులు ఇలా..?
కాగా, తెలంగాణలోని ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. ఈ మధ్యనే నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేటలో గర్భిణి కడుపులో డాక్టర్లు ఐదు సెంటీమీటర్ల సర్జికల్ సూది మరిచిపోయారు. ప్రసవం తర్వాత గర్భిణికి కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లిన కుటుంబ సభ్యులకు ఏం జరిగిందో తెలియక ముప్పు తిప్పలు పడ్డారు. తీరా స్కానింగ్ చేస్తే.. కడుపులో ఒక సూది ఉన్నట్లు నిర్ధారణ అయింది. సూది ప్రమాదకరమైన రీతిలో ప్రేగులకు దగ్గరగా ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించి, గాంధీ ఆసుపత్రిలో ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రజారోగ్య రంగంలో ఇలాంటి నిర్లక్ష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన వైద్యుల నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Read Also- BCCI: బీసీసీఐకి భారీ ఎదురుదెబ్బ.. బాంబే హైకోర్ట్ సంచలన తీర్పు