విస్తరణ సమయంలో బెర్త్ ఖాయం!
ఏఐసీసీ ఛాయిస్‌గా పీసీసీకి సూచన
రాష్ట్ర నేతల్లో భిన్నాభిప్రాయాలున్నా..
ఉద్యమకారిణిగా పార్టీకే మైలేజ్ టాక్
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు కౌంటర్‌గా
రెండు మూడు రోజుల్లో ఆమె ఢిల్లీకి
సోనియాగాంధీతో భేటీ అయ్యే ఛాన్స్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : విజయశాంతి రాష్ట్ర మంత్రివర్గంలోకి రానున్నారా?.. విస్తరణ సమయంలో ఆమెను ఆ అవకాశం వరించనున్నదా?.. ఏఐసీసీ కోటాలో ఆమెకు బెర్త్ ఖాయమైనట్లేనా?.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారిణిగా ఆమెకున్న గుర్తింపు పార్టీకి మైలేజ్‌గా మారనున్నదా?.. ఆమెకు మంత్రిగా అవకాశం ఇవ్వాలన్నది సోనియాగాంధీ నిర్ణయమా?.. రాష్ట్ర నేతల్లో ఎలాంటి అభిప్రాయమున్నా క్యాబినెట్‌లో చోటు అనివార్యమా?.. ఇలాంటి చర్చ పార్టీలో మొదలైంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉద్యమకారులుగా పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి కొందరు ఉన్నా దాన్ని హైలైట్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో విజయశాంతి ద్వారా ఆ వెలితిని భర్తీ చేయాలన్నది ఏఐసీసీ ఉద్దేశంగా కనిపిస్తున్నది. మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆమెకు అవకాశం ఉంటుందనేది పార్టీ కేంద్ర వర్గాల సమాచారం. సోనియాగాంధీ నిర్ణయం కావడంతో ఓపెన్‌గా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు లేవు.
బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చేందుకు ప్లాన్
బీఆర్ఎస్‌కు గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి సోనియాగాంధీ పక్కా వ్యూహం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులంతా తమది ఉద్యమ పార్టీ.. కేసీఆర్‌ను మించిన ఉద్యమకారులెవరు.. చావు నోట్లో తలపెట్టి.. ఇలాంటి డైలాగులు వినిపిస్తున్న సమయంలో దీటుగా కౌంటర్ ఇవ్వడానికి విజయశాంతి ఎంపిక పర్‌ఫెక్ట్‌గా ఉంటుందనేది సోనియాగాంధీ అభిప్రాయం. మంత్రిని చేయడం ద్వారా అసెంబ్లీలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావ్ తదితరులకు ఆమె ద్వారా గట్టిగా కౌంటర్ ఇవ్వవచ్చన్నది పార్టీ ఉద్దేశం. లేదంటే ఆమె కేవలం కౌన్సిల్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో దీర్ఘకాలం పనిచేసినా ఆమెకు అక్కడ సరైన గౌరవం, ప్రాతినిధ్యం దక్కలేదని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెకు రాష్ట్ర మంత్రిగా అవకాశం ఇచ్చిందని చెప్పుకోడానికి అవకాశం చిక్కుతుంది.
బీఆర్ఎస్ చేసిందేంటో బహిర్గతం చేసేలా
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. తెచ్చింది బీఆర్ఎస్.. పదేండ్ల తర్వాత కూడా అసెంబ్లీ వేదికగా ఇలాంటి చర్చలు జరుగుతున్న సమయంలో విజయశాంతిని క్యాబినెట్‌లోకి తీసుకుంటే బీఆర్ఎస్‌లో ఉన్న పదేండ్ల కాలంలో ఏం జరిగింది.. కేసీఆర్ తీరు ఎలా ఉండేది.. ఆలె నరేంద్ర లాంటివారికి లభించిన గుర్తింపేంటి.. ఉద్యమం తర్వాత కోదండరాం లాంటివారికి అవమానాలు ఎందుకయ్యాయి.. ఉద్యమంలో కేసీఆర్ రోల్.. ఇలాంటివన్నీ వెల్లడించడానికి అవకాశం ఉంటుంది. గులాబీ నేతలకు ఆమె ద్వారా గట్టి కౌంటర్ ఇప్పించచ్చనేది కాంగ్రెస్ హైకమాండ్ భావన. ఇప్పటికే ఆమెకు ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉన్నది. దీంతో పాటు కేటీఆర్, కవిత ఉద్యమంలోకి రావడానికి ముందే విజయశాంతి ఎంటర్ అయ్యారు. వారందరికీ ఆమె సీనియర్ కావడంతో ఏది మాట్లాడాలన్నా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పటి పరిణామాలను బహిర్గతం చేస్తే గులాబీ లీడర్లు ఆత్మరక్షణలో పడతారనేది కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావన.
వారిని కట్టడి చేసేందుకు!
ఉద్యమం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటూ వారిని విజయశాంతి తనదైన శైలిలో కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. బీజేపీలో ఉన్నప్పుడూ ఆమె తెలంగాణ వాదాన్ని వినిపించారు. పార్టీ విధానపరంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై క్లారిటీ ఇవ్వని రోజుల్లోనే విజయశాంతి ఓపెన్‌గా మాట్లాడేవారు. తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ కోసం ‘తల్లి తెలంగాణ’ పేరుతో సొంత పార్టీనే పెట్టుకున్నారు. ఉద్యమం సమయంలో టీఆర్ఎస్‌లో విలీనం చేసిన విజయశాంతి కేసీఆర్‌తో కలిసి నడిచారు. తెలంగాణ ఏర్పాటు బిల్లు పార్లమెంటుకు వచ్చిన టైమ్‌లో ఆమె ఎంపీగానే ఉన్నారు. 2004 మొదలు 2014 వరకు తెలంగాణ ఉద్యమం, అందులో కేసీఆర్ పాత్ర, బీఆర్ఎస్ లక్ష్యం, పార్టీలో అంతర్గతంగా ఏం జరిగింది, ఆలె నరేంద్రలాంటివారికి ఎలాంటి గౌరవం దక్కింది, బీఆర్ఎస్ నుంచి ఆమె ఎందుకు బైటకు రావాల్సి వచ్చింది.. ఇవన్నీ సందర్భం వచ్చినప్పుడు వెల్లడిస్తే అది కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు లాంటి లీడర్లకే ఇబ్బందికరంగా మారుతుంది.
మంత్రిని చేస్తే పార్టీకి మైలేజ్!
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సోనియాగాంధీ స్వయంగా చొరవ తీసుకుని ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేలా ఏఐసీసీ ద్వారా పీసీసీకి చెప్పినట్లు సమాచారం. అన్ని విధాలుగానూ ఆమెను మంత్రిని చేయడం ద్వారా పార్టీకి మైలేజ్ వస్తుందని, ఏక కాలంలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులకు గట్టిగా కౌంటర్ ఇప్పింవచ్చన్నది సోనియాగాంధీ అభిప్రాయమని ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా రెండు మూడు రోజుల్లో సోనియాగాంధీని కలిసే అవకాశమున్నది. చివరి నిమిషం వరకూ ఆమె పేరు తెరమీదకు రాకపోయినా అనూహ్యంగా అభ్యర్థిగా ఖరారు కావడంతో హైకమాండ్ సెలక్షనే అనే చర్చలు గాంధీభవన్‌లో జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను మంత్రిని చేయడం ద్వారా మున్ముందు పరిణామాలు భిన్నంగా ఉంటాయని, కీలకమైన శాఖనే ఆమెకు అప్పగించే అవకాశమున్నదనేది పార్టీ కేంద్ర వర్గాల సమాచారం. మంత్రివర్గ విస్తరణ సమయానికి సస్పెన్స్ వీడనున్నది.
Also Read: నామినేషన్లు దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు