Next CPI Maoist Leader (imagecredit:twitter)
తెలంగాణ

Next CPI Maoist Leader: ఉనికి కోల్పోయే పరిస్థితిలో మావోయిస్టులు .. అదొక్కటే మార్గం?

Next CPI Maoist Leader: 2026, మార్చి నాటికి మావోయిస్టుల ఫ్రీ కంట్రీగా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆపరేషన్ కగార్’ చివరి దశకు చేరుకున్నది. ఈ ఆపరేషన్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకూ మావోల ఏరివేత లక్ష్యంగా దట్టమైన అడువుల్లో నిత్యం తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. భద్రతా బలగాలు వారిని రౌండప్‌ చేస్తూ హతమారుస్తూ వస్తున్నాయి. ఇప్పటి వరకూ లెక్కలేనంత మంది మావోయిస్టులు హతమవ్వగా, మరోవైపు వందలాది మావోయిస్టులు అడవులను వదిలి పోలీసులకు లొంగిపోయి జనారణ్యంలో కలిసిపోయారు. ఇందులో మావోయిస్ట్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నోళ్లు, పార్టీని ముందుకు నడిపినోళ్లు చాలా మందే ఉన్నారు. ఇలా రెండ్రోజులకో ఎన్‌కౌంటర్ జరుగుతున్న పరిస్థితుల్లో ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది.

సరిగ్గా ఈ క్రమంలోనే పార్టీ చరిత్రలోనే అతి భారీ నష్టం వాటిల్లింది. బుధవారం చత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌లో ఒక జవాన్ మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, అగ్రనేత నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు మృతి చెందారు. చనిపోయిన వారిలో పలువురు కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం, మరోవైపు ఎన్‌కౌంటర్‌లో కీలక నేతలు చనిపోవడంతో దాదాపు ఆపరేషన్ కగార్ పూర్తయినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమిత్ షా అధికారిక ప్రకటన

ఈ ఎన్‌కౌంటర్‌లో పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు మృతిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌లో 27 మంది మృతి చెందారని, ఇందులో సీపీఐ మావోయిస్ట్‌ జనరల్‌ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారని తెలిపారు. ఉదమ్యానికి నంబాల వెన్నెముకగా నిలిచారన్నారు. మావోయిస్టులను అంతమొందించడంలో ఇదొక కీలక ముందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు. ‘ 30 ఏళ్ల పోరాటంలో ఇంత పెద్ద నాయకుడ్ని మట్టుబెట్టడం ఇదే తొలిసారి. కేశవరావుపై రూ.1.5 కోట్లు రివార్డు ఉంది. ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌ తర్వాత 54 మందిని అరెస్ట్‌ చేశాం. మరో 84 మంది లొంగిపోయారు. 2026 ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతమొందదిస్తాం’ అని ఎక్స్‌లో షా పేర్కొన్నారు. కాగా, ఈ ఎదురు కాల్పుల్లో పోలీసు సహాయకుడు ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన జవానుకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట పర్వతాల్లో 24 రోజులపాటు జరిగిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు 31 మంది మావోయిస్టులను హతమార్చిన విషయం తెలిసిందే వీరిలో 16 మంది మహిళలు ఉన్నారు.

కేశరావు ఎలా దొరికారు?

గత కొన్నిరోజులుగా అబూజ్మాడ్ అటవీ ప్రాంతాల్లో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మూడు జిల్లాల భద్రత బలగాలు కూంబింగ్‌కు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎదురుపడిన మావోయిస్టులను ఎక్కడికక్కడ బలగాలు మట్టుపెడుతున్నాయి. మాధ్‌ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు బుధవారం సమాచారం భద్రతా బలగాలకు సమాచారం అందింది. అంతేకాదు మావోయిస్టుల పెద్ద తలకాయ నంబాల కేశవరావు ఇక్కడే ఉన్నాడనే సమాచారంతో 15 రోజులుగా బీజాపూర్‌, నారాయణపూర్‌, దంతెవాడ డీఆర్జీ బలగాలు చుట్టుముట్టి ఆపరేషన్‌ ప్రారంభించాయి. మొత్తం 10వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ఈ కూంబింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి డీఆర్జీ బలగాలు-మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నది. ఈ కాల్పుల్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారిలో కేశవరావు కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు? కీలక నేతలు ఉన్నారా? లేదా? అనేదానిపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో అందరి దృష్టి మళ్లించిన కేంద్ర ప్రభుత్వం సైలెంట్‌గా అబుజ్మడ్‌లో ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే భారీ భద్రత మధ్య ఉన్న నంబాలను చుట్టుముట్టిన విషయాన్ని చివరి నిమిషం వరకూ భద్రతా బలగాలు బయటికి రానివ్వలేదు. అలా కేశరావును ఎన్‌కౌంటర్ చేసి మావోయిస్టులపై వ్యూహాత్మకంగా బలగాలు పైచేయి సాధించాయి.

ఎవరీ కేశవ్?

కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేట. తండ్రి వాసుదేవరావు అధ్యాపకుడిగా పనిచేశారు. కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని అతిదగ్గర్నుంచి చూశారు. విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాలవైపు ఆకర్షితుడై అంచెలంచెలుగా ఎదిగారు. వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఇసీ)లో 1974లో ఇంజినీరింగ్ చదివారు. ఎంటెక్ చదువుతున్న సమయంలో కేశవరావు పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. 1970 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1980లో అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యూ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ సందర్భంగా ఒకే ఒక్కసారి కేశవరావు శ్రీకాకుళంలో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత 1987లో మావోయిస్టుల్లోకి చేరిపోయిన కేశవరావు అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగారు. తొలుత బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఈ, మాజీ సైనికుల వద్ద శిక్షణ తీసుకున్నారు. ముఖ్యంగా ఆయనది మిలిటరీ వ్యూహరచనలో అందెవేసిన చేయి. అత్యాధునిక పేలుడు పదార్థాల వినియోగంలో, పేలుళ్లకు సంబంధించిన అధునాతన ప్రక్రియల ఆచరణలోనూ నిపుణుడు, పార్టీకి మూల స్తంభంగా నిలిచారు. మావోయుస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్యూహకర్త. మావోయుస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను నిర్వర్తించారు. అంతేకాకుండా జోనల్ కమిటీ, స్పెషల్ ఏరియా కమిటీ లాంటి పార్టీలోని మిలిటరీ సబ్‌ కమిటీల బాధ్యత కూడా కేశవరావుదేనని పోలీసుల అంచనా.

గెరిల్లా నుంచి అలిపిరి వరకూ

మావోయిస్ట్ ప్రాబల్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌పై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. గాగన్న అలియాస్ ప్రకాష్, అలియాస్ క్రిష్ణ, అలియాస్ విజయ్, అలియాస్ కేశవ్, అలియాస్ బసవరాజు, అలియాస్ బీఆర్, అలియాస్ దారపు నరసింహారెడ్డి, అలియాస్ నరసింహ.. ఇవన్నీ మావోయిస్టు పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావుకు ఉన్న పేర్లు. తిరుగుబాట్లు, గెరిల్లా యుద్ధ వ్యూహరచన, ఐఈడీలను వినియోగించడంలో దిట్ట. పెద్ద పెద్ద దాడులన్నీ కేశవరావు కనుసన్నల్లోనే జరిగేవి. 2010లో ఒడిశాలో 76 మంది సీఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందిన బలిమెల ఘటనకు నంబాల కేశవరావే ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. మావోయుస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు దాడుల్లో కేశవరావు కీలక నిందితుడిగా ఉన్నారు. 2003లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తుండగా అలిపిరిలో బాంబుదాడి ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పేలుళ్లలో ప్రధాన సూత్రధారి కేశరావే. అలాగే ఏపీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహకర్త కూడా కేశవరావేనని పోలీసుల అంచనా.

Also Read: MLA Gangula Kamalakar: మాపై విషప్రచారం చేస్తే అదరం బెదరం.. బీఆర్ఎస్ నేతలు!

కేశవరావు నాయకత్వంలోనే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, ఇతర ప్రాంతాలలో మావోయిస్టులు చాలా బలంగా మారారని విశ్లేషణలు చాలానే ఉన్నాయి. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేశవరావు బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ ఆపరేషన్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. సుమారు 30 ఏళ్లుగా కేశవరావు అజ్ఞాతంలో ఉంటున్నారు. 1987లో మొదలైన నంబాల ప్రస్థానం 2025 ఏప్రిల్ 21తో ముగిసింది. కొన్నేళ్లుగా పోలీసులు వెతుకుతున్న నంబాలపై రూ.1.5 కోట్లు రివార్డు ఉండటం గమనార్హం. కేశవరావు మృతి మావోయిస్టు పార్టీ చరిత్రలోనే అతి భారీ నష్టంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయన మృతి మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చలపతి, రేణుక, సుధాకర్ లాంటి టాప్ లీడర్లు మృతిచెందారు. ఒక్కో అగ్రనేత అస్తమిస్తుంటే పార్టీకి దిక్కెవరు? పార్టీని నడిపేదెవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకట్లేదు.

నెక్స్ట్ టార్గెట్ ఎవరు?

నారాయణపూర్ జిల్లా అడవుల్లో ఎన్‌కౌంటర్ ముగిసినా భద్రతా బలగాల కూంబింగ్‌ కొనసాగుతున్నది. నంబాల కేశవరావు మృతితో భద్రతా బలగాలు మరింత దూకుడు పెంచాయి. పనిలో పనిగా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న మడావి హిడ్మా టార్గెట్‌గా కేంద్ర హోంశాఖ ఆపరేషన్ షురూ చేసింది. అబుజ్మడ్ దండకారణ్యంలో హిడ్మా కోసం వేలాది మంది భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఎన్‌ఐఏ హిట్ లిస్టులో హిడ్మా ఉండగా, మావోయిస్టు పార్టీలో 18 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించినట్లుగా తెలుస్తోంది. రాబోయే 10 నెలలు కీలక నేతలు టార్గెట్‌గా ఆపరేషన్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు ఎక్కడెక్కడ షెల్టర్ జోన్ తీసుకున్నారన్నదానిపై పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖ సేకరిస్తున్నది.

గర్వంగా ఉంది.

ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. ‘మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నాను. మావోయిజం ముప్పును నిర్మూలించి, ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షా చేసిన పోస్ట్‌ని ట్యాగ్ చేస్తూ ప్రధాని ఇలా పోస్ట్ చేశారు.

న్యాయ విచారణకు డిమాండ్

బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌‌ను భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఈ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ‘ మావోయిస్టులను అరెస్ట్ చేయకుండా హత్య చేయడం అప్రజాస్వామికం. మావోయిస్టులు, ఆదివాసీల హత్యలను సీపీఐ తీవ్రంగా ఖండిస్తోంది. చట్ట విరుద్ధ చర్యలకు ఈ ఎన్‌కౌంటర్‌ మరో ఉదాహరణ. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు గురించి సమాచారం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు?, నేరుగా ఎన్‌కౌంటర్ చేయడం ఏంటి? ఈ తరహా దూకుడు పెహల్గాం ఉగ్రవాదులను పట్టుకోవడంలో ఎందుకు చూపించడం లేదు?’ అని రాజా మండిపడ్డారు.

చర్చలు జరపలేదేం?

27 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేయడం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటనలో తీవ్రంగా స్పందించారు. ‘ శాంతి చర్చలకు సిద్ధమేనని మావోయిస్టులు ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎన్‌కౌంటర్లు చేయడం అప్రజాస్వామికం. సమాజంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ వాదులు, మేధావులు రచయితలు తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నప్పటికీ కేంద్రం మొండివైఖరి ప్రదర్శించింది. ఎలాంటి సమస్యకైనా చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చరిత్ర రుజువు చేస్తుంది. తక్షణమే ఆపరేషన్ కగారు నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి’ అని కూనంనేని డిమాండ్ చేశారు.

ఎందుకింత అహం?

ఉగ్రవాదుల కంటే దారుణంగా మావోయిస్టులపై కేంద్రం సీత కన్ను ప్రదర్శిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి మండిపడ్డారు. శాంతి చర్చలు జరపాలని కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ అహం దెబ్బతింటోంది? అని ప్రశ్నించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతున్నారే తప్ప, మన పౌరులైన మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదు? కేంద్రానికి సూటి ప్రశ్నలు సంధించారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్లు పౌర హక్కులను కాల రాయడమే అవుతుందని, వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ఖనిజ సంపద కోసమే!

అమాయక ప్రజలపై సాగిస్తున్న నర మేధానికి కేంద్రం స్వస్తి పలకాలని సీపీఎం నేత జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలు జరుపుదామని, శాంతియుతంగా పరిష్కరిద్దామని, ఆయుధాల విషయాన్ని కూడా చర్చలు జరుపుదామని కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా సరే ప్రభుత్వం మూర్ఖంగా మావోయిస్టులను, మావోల పేరుతో గిరిజనులను కాల్చి చంపే నరహంతక చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఛత్తీస్‌ఘడ్ అడవుల్లో కార్పొరేట్ సంస్థలకు అక్కడ ఉండే ఖనిజ సంపాదనంతా దారాదత్తం చేయడానికి ఆటంకంగా మావోయిస్టులు ఉండటంతోనే ఇలాంటి చర్యలకు కేంద్రం పాల్పడుతోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్రం.. మావోయిస్టుల చర్చల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి శాంతియుత వాతావరణానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Also Rrad: Notice to Sunitha Rao: మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావుకు షోకాస్ నోటిసులు..!

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు