Road Accidents: తెలంగాణలోని జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి. వీటిపై రోజుకు సగటున 70 ప్రమాదాలు జరుగుతుండగా 20మంది మృత్యువాత పడుతున్నారు. 65 మందికి పైగా గాయపడుతున్నారు. వీరిలో పలువురు శాశ్వత అంగవైకల్యం పొంది జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. సాధారణంగా అతి వేగం.. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తుండటమే ఈ విషాదాలకు కారణమని అంతా భావిస్తుంటారు.
అయితే, హైవే హిప్నాసిస్ కూడా యాక్సిడెంట్లకు కారణమవుతోందని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. వాహనాలు నడుపుతున్న వారిలో చాలామందికి తాము హైవే హిప్నాసిస్ కు గురవుతున్నామన్న విషయం కూడా తెలియదన్నారు. దీనికి గురైన వారు కళ్లు తెరిచే ఉన్నా వారి మెదడు మాత్రం సుషుప్తావస్తలోకి చేరుకుంటుందన్నారు. దాంతో యాక్సిడెంట్లు జరుగుతున్నట్టు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 4,983 కిలోమీటర్ల నిడివితో 23 జాతీయ రహదారులున్నాయి. ప్రతిరోజూ వీటిపై ప్రమాదాలు జరుగుతున్నాయి. రవాణా శాఖ వర్గాలు తెలిపిన ప్రకారం 44వ నెంబర్ నేషనల్ హైవేపై అత్యధికంగా యాక్సిడెంట్లు జరుగుతుండగా ఆ తరువాతి స్థానంలో 163వ నెంబర్ హైవే ఉంది. వీటితోపాటు మిగితా నేషనల్ హైవేలపై గత సంవత్సరం 25,934 యాక్సిడెంట్లు జరుగగా 7,773 మంది మృత్యువాత పడ్డారు. మరో 23,826మంది గాయపడ్డారు. వీటిలో కనీసం 10శాతం ప్రమాదాలు హైవే హిప్నాసిస్ కారణంగా జరుగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.
హైవే హిప్నాసిస్ అంటే…
దీనిపై ఓ సీనియర్ పోలీస్ అధికారితో మాట్లాడగా ఎవరైనా సరే వాహనాన్ని నడపటం మొదలు పెట్టిన రెండున్నర గంటల తరువాత హైవే హిప్నాసిస్ కు గురవుతుంటారని చెప్పారు. హైవేలు అభివృద్ధి చెందిన నేపథ్యంలో వాటిపై వాహనాలకు పెద్దగా అడ్డంకులు ఎదురు కావటం లేదన్నారు. మలుపులు కూడా పెద్దగా లేవన్నారు.
ఈ క్రమంలో కార్లు, భారీ వాహనాలు నడుపుతున్నవారు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేస్తున్నారన్నారు. తదేకంగా రోడ్డును చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న క్రమంలోనే వాహనాలు నడుపుతున్నవారు హైవే హిప్నాసిస్ కు గురవుతున్నారన్నారు.
ఈ స్థితిలో డ్రైవింగ్ చేస్తున్నవారు కళ్లు తెరిచే ఉంటారన్నారు. అయితే, మెదడు మాత్రం కనిపిస్తున్న దృశ్యాలను రికార్డు చేయదన్నారు. ప్రమాదం జరిగే అవకాశాలున్నా సిగ్నళ్లు ఇవ్వటం మానేస్తుందని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము ఏ వేగంతో వెళుతున్నాం?…ముందున్న వాహనం ఏ వేగంతో వెళుతోంది? అన్నది అంచనా వేయలేరన్నారు. దాంతో యాక్సిడెంట్లు జరుగుతున్నట్టు వివరించారు.
Also Read: hyderabad traffic: మహానగరంలో తప్పని తిప్పలు.. బేజారవుతున్న వాహనదారులు!
ఏం చేయాలి?
హైవే హిప్నాసిస్ బారిన పడకుండా ఉండటానికి డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ప్రతీ రెండున్నర…మూడు గంటలకొకసారి వాహనాన్ని నిలిపి వేయాలన్నారు. చాయ్ లేదా కాఫీ తాగి పది…పదిహేను నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలన్నారు. రాత్రుళ్లు హైవే హిప్నాసిస్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ ఆ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
డ్రైవింగ్ చేసే సమయంలో తదేకంగా రోడ్డునే చూడకూడదన్నారు. రియల్ వ్యూ మిర్రర్ లను చూస్తుండాలన్నారు. అదే సమయంలో రోడ్డు పక్కన ఉండే చెట్లు, హోటల్లు, దాబాలను చూస్తూ వాహనాలను నడపాలన్నారు. దీని వల్ల హైవే హిప్నాసిస్ కు గురయ్యే అవకాశాలు తగ్గుతాయన్నారు. కళ్లు మూసుకు పోతున్నట్టుగా అనిపిస్తే వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కగా ఆపి రెస్ట్ తీసుకోవాలన్నారు.