KCR: రాష్ట్రంలో సింగిల్ గానే మళ్లీ అధికారంలోకి వస్తామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇటీవల గోదావరిఖని నుంచి పాదయాత్రను చేపట్టారు. ఆ పాదయాత్ర గజ్వేల్ చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని పాదయాత్ర బృందం.. అక్కడికి సమీపంలోనే ఉండే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందంతో సమావేశమైన కేసీఆర్.. ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అనే విషయంపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేమిటి? అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఆనాడు జగన్ కూడా ఇలాగే..
మరోవైపు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గతంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలతో పోల్చి విమర్శిస్తున్నారు కొందరు. జగన్ కూడా ఇలాగే సింగిల్ గానే వస్తామని, ‘వై నాట్ 175’ అంటూ ప్రగల్భాలు పలికారని చివరికి ఏం జరిగిందో అందరికి తెలుసునని ఓ వర్గం సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తోంది. తెలంగాణలో కూడా అదే జరగబోతుందా? బీఆర్ఎస్ కు కూడా తక్కువ సీట్లకు పరిమితం కాబోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక, కేసీఆర్ కామెంట్స్ విషయానికి వస్తే.. తెలంగాణలో ఎన్డీఏ కూటమి పోటీ చేయాలని చూస్తోందని ఇటీవల కొన్ని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ తెలంగాణ రాజకీయాల గురించి, గద్దర్ గురించి కీలక విషయాలు ప్రస్తావించారు, వాటి ఆధారంగా త్వరలో జనసేన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. తెలంగాణలో కూటమి ప్రవేశం వార్తలను ‘సిల్లీ’ అంటూ కొట్టిపారేసిన మేధావులు ఉన్నారు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో అలా కూటమి కట్టే చంద్రబాబు.. కేసీఆర్ కు ఎంత మేలు చేశారో అందరికి తెలుసు కదా అని వారి వెర్షన్.
YCP – I PAC: ఐప్యాక్ సేవలకు వైసీపీ గుడ్ బై? ముంచిందా? మించిందా?
అయినా సరే.. కేసీఆర్ మెల్లిగా పరిణామాల్ని పసిగడుతున్నారు కాబట్టే ప్రస్తుతం ఈ సింగిల్ కామెంట్స్ చేశారని కొందరు చెప్పుకుంటున్నారు. అందుకే కూటమి పార్టీలను ఉద్దేశించి మాట్లాడారు.. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లుగా, సమృద్దిగా ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు తయారవుతున్నారని నర్మగర్భంగా చెప్పారు. అదే సమావేశంలో చంద్రబాబు గురించి కూడా ఆయన కామెంట్స్ చేశారు. కూటమి లేకపోతే ఆయన గెలిచేవారా అని.
మొత్తానికి కేసీఆర్ భయం పట్టుకుందని లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరని కొన్ని వర్గాల వాదన. కాంగ్రెస్ సర్కారు మీద కొంత వ్యతిరేకత ఉందని భావిస్తున్న వేళ.. ఇంకో మూడున్నరేళ్ల వరకు అది పెరిగుతూ పోతే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుందామని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారనేద ఒక వాదన. మరోవైపు కేసీఆర్ మీద ఆయన కుటుంబం మీద ఇప్పటికి ఎప్పటికీ ప్రజలు కోపంగానే ఉంటారని ఓడిన అనంతరం అహంభావం తగ్గకపోవడం, బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు జనం నమ్ముతుండటం ఆయనకు చేటు చేసే అంశాలని ఇంకో వాదన. దీన్నే ఇప్పుడు కూటమి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నది. అందుకే కేసీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని, డాంభికాన్ని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.
ఇంకోవైపు ఆయన ఎంత సింగిల్ గానే వస్తామని చెప్పినా, ఎంఐఎం ఆయనకు మద్దతిస్తుందని కష్టకాలంలో ఆ పార్టీ కుండే ఏడు సీట్లు ఉపకరిస్తాయన్నది తెలిసిన విషయమే. అంతేందుకు.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ కు గనక ఇంకో నాలుగు సీట్లు తక్కువ వచ్చి ఉంటే ఆయన ఏం చేసి ఉండేవారన్నది కూడా కనీస రాజకీయ పరిజానం ఉన్న వారికి తెలుసు.
సరే.. అయినకు రాజకీయంగా అనుకూల వాతావరణమే ప్రస్తుతం తెలంగాణలో ఉందనకుందాం.. మరీ ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదు? నిన్న గాక మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? అంటూ పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ మాటలు భయానికి సంకేతాలు తప్ప, ధైర్యానికి సూచనలు కావు అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు