తెలంగాణ

Warangal Trip: విదేశాలకు వద్దు.. వరంగల్ వెళ్లొస్తే సరి.. ట్రిప్ కు రెడీనా!

Warangal Trip: అసలే సమ్మర్ హాలిడేస్. ఏదైనా ట్రిప్ కొట్టనిదే సమ్మర్ హాలిడేస్ కి కిక్ రాదు. అందుకే సామాన్య కుటుంబం నుండి సంపన్న కుటుంబం వరకు ఏదైనా ఒక పిక్నిక్ ప్లానింగ్ ఖచ్చితంగా ఈ సమ్మర్ లో ఉంటుంది. అయితే ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్లి ఫ్యామిలీతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవారు కొందరు.

మరికొందరు మాత్రం దగ్గరలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లి సందడిగా తమ విహారయాత్ర సాగిస్తారు. మన సమీపాన ఉన్న పర్యాటక ప్రదేశాలు కూడా ఏమాత్రం విదేశీ పర్యాటక ప్రదేశాలకు తగ్గవని చెప్పవచ్చు. అలాంటి జాబితాలో ముందు వరుసలో అత్యధిక పర్యాటక ప్రదేశాలు గల జిల్లాగా తెలంగాణలోని వరంగల్ జిల్లా ఒకటి.

ఒక్క వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను చూస్తే చాలు, మనకు ప్రకృతిని ఆస్వాదించిన అనుభూతి కలగక మానదు. మన చరిత్ర ఎంత ఘనమైనదో తెలుసుకునేందుకు కూడా వరంగల్ చరిత్ర ఎంతో ప్రాధాన్యత సంతరించుకొని ఉంటుంది. ఈ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలు చూసేందుకు ఒక్కరోజు సరిపోదు సుమా. ప్రసిద్ధ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, సహజసిద్ధ ప్రకృతి అందాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి.

వరంగల్ పర్యాటక ప్రదేశాలు ఇవే..
వరంగల్ కోట ఇదొక కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ కోట. 13 వ శతాబ్దపు నిర్మాణ కోట కాగా, ఇక్కడి ఏ రాయి చూసినా శిల్పకళతో నిండి ఉంటుంది. అలాగే కాకతీయ రాజులు నిర్మించిన వెయ్యి స్తంభాల గుడి చూసేందుకు రెండు కనులు సరిపోవు. ఇక్కడి ప్రకృతికి, శిల్పకళా సౌందర్యానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. హన్మకొండలో వెలసిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ నీటి కొలను కూడా ఉంది.

ప్రకృతి ప్రదేశాలు..
వరంగల్ పర్యటనలో ప్రతి ఒక్కరికీ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా చేసే ప్రాంతమే లక్నవరం చెరువు. ఈ చెరువు చుట్టూ అడవులు, గుట్టలు ఉండే ప్రకృతి అందం చూస్తే ఔరా అనాల్సిందే. అంతేకాదు ఇక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్ చాలా ఫేమస్. ఫ్యామిలీతో పిక్నిక్ కు వెళ్లే వారికి ఇదొక అద్భుతమైన స్థలం. అలాగే పకాల సరస్సు ఇక్కడ ఇంకా వెరీ స్పెషల్. కాకతీయుల కాలంలో నిర్మించిన కృత్రిమ సరస్సు కాగా, పక్కనే పకాల వన్యప్రాణి అభయారణ్యం ఉండడంతో ప్రకృతి మరింత శోభాయమానంగా కనిపిస్తుంది.

రాయపర్తి బౌద్ధ గుహలు, ప్రాచీన జైన ఆలయం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అటవీ ప్రాంతాన్ని చూడాలన్న ఆసక్తి ఉన్న వారికి ఏటూరు నాగారం అడవులు ఇక్కడ ప్రాచుర్యం పొందాయి. అడవుల మధ్య నదుల తీరంలో మంచి ప్రకృతి సౌందర్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అప్పుడప్పుడు అడవి జంతువులు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. అడవి కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతి తీసుకుంటే ఎంతో మంచిది.

2 రోజుల్లో ఇలా ప్లాన్ చేసుకోండి
మొదటి రోజు ఉదయం 10 గంటలకు వెయ్యి స్తంభాల గుడి వద్దకు చేరుకోవాలి. ఆక్కడ గల కాకతీయుల శిల్పకళను ఆస్వాదించండి. ఆలయాన్ని చుట్టూ పరిశీలించండి. 11:30 భద్రకాళి ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించండి. ఇక్కడ చెరువు పక్కన ఉండడంతో వాతావరణం చల్లగా ఉంటుంది. అలాగే ఫోటోలు దిగేందుకు ఇదొక అనువైన స్థలం. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ చేయండి. 2:30 గంటలకు వరంగల్ కోట, 5 గంటలకు మ్యూజికల్ గార్డెన్ లో మీ సమయాన్ని వెచ్చించండి. ఇక అక్కడే బస చూసుకొని రెస్ట్ తీసుకోండి.

Also Read: TG CM in Vijayawada: ఒకే ఫ్రేమ్ లో సీఎం రేవంత్, నారా లోకేష్.. అందరూ ఖుషీ ఖుషీ!

రెండవ రోజు ఉదయం 8:00 గంటలకు లక్నవరం చెరువు ప్రయాణం వరంగల్ నుంచి 75 కిమీ సుమారు ఒకటిన్నర గంట సమయం పడుతుంది. అక్కడ ఊగే వంతెన, బోటింగ్, ఫోటోలు ఇలా తీసుకోండి. బ్రేక్ ఫాస్ట్ ప్యాక్ చేసుకుంటే చాలా మంచిది. 11:30 అడవి మధ్యలో ప్రశాంతంగా కాలినడక సాగించండి. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ ఇక్కడే దొరికే సౌలభ్యం కూడా ఉండవచ్చు. 2:30 గంటలకు పాఖల్ సరస్సు, అలాగే ఇక్కడి అటవీ ప్రాంతంలో ప్రకృతి, జంతువులతో సమయాన్ని వెచ్చించవచ్చు. ఆ తర్వాత 5:30 గంటలకు తిరుగు ప్రయాణమైతే మీ పిక్నిక్ ఇక ముగింపు.

ఖర్చు ఇలా..
వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఒక నలుగురు కారులో రెండు రోజుల పర్యటనకు వెళితే సుమారు రూ. 15,000 ఖర్చు కావచ్చని అంచనా. అన్ని ఖర్చులు కలుపుకొని ఈ ఖర్చు వస్తుందని చెప్పవచ్చు. ఇంకా తొలిరోజు ఇంటి వద్ద నుండి భోజనం తీసుకెళితే, ఇంకా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. మరెందుకు ఆలస్యం.. మన సమీపాన గల వరంగల్ జిల్లాలో ఇన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఒక్క ట్రిప్ వేయండి.. సమ్మర్ హాలిడేస్ లో జాలీగా పర్యావరణాన్ని ఆస్వాదించండి.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?