Radhakrishnan: రెండు నెలలక్రిత భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ సందర్శనకు వచ్చారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎయిర్‌పోర్టుకు వెళ్లి సీపీ రాధాకృష్ణన్‌కు సాదర స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా స్వాగతం పలికిన బృందంలో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మరికొందరు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికినవారి జాబితాలో ఉన్నారు.
గవర్నర్ తేనీటి విందు
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతిని రేవంత్ రెడ్డి సత్కరించారు. రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ విందులో ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాగా, సీపీ రాధాకృష్ణన్ సెప్టెంబర్ నెలలో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచారు. ఎన్డీయే ఆయనను బలపరించింది. జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్య కారణాలను చూపుతూ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. సెప్టెంబర్ 9న జరిగిన ఎన్నికలో పొన్నుస్వామి (సీపీ) రాధాకృష్ణన్ దేశానికి 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎన్డీయే బలపరిచిన ఆయన, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై గెలిచారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
