Vehicle Registration: వాహనదారులు కొనుగోలు చేసే నూతన వాహనాలకు షోరూంల వద్దే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. అందుకు ప్రభుత్వ ఆదేశాలతో రవాణా శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వాహన షోరూంలలో శనివారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ ఆదేశాలతో డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్‌కు అంతా సిద్ధం చేశారు. ప్రయోగాత్మకంగా ఒక షోరూంలో శుక్రవారం అమలు ప్రక్రియను ప్రారంభించగా సక్సెస్ కావడంతో అమలు ప్రక్రియను ఇవాళ్టి నుంచి చేపడుతున్నారు.
షోరూం నుంచి.. ఇంటికే ఆర్‌సీ
ద్విచక్ర వాహనాలు, కార్లు కొన్న యజమానులు వాహన రిజిస్ట్రేషన్‌కు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా రవాణా శాఖ ఈ నెల 8న విధానపర నిర్ణయం తీసుకున్నది. అందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ 15 రోజుల్లో సిద్ధం చేయాలని కమిషనర్ ఇలంబర్తి ఆదేశించిన నేపథ్యంలో సంబంధిత సాఫ్ట్‌వేర్ తయారు చేసి ప్రయోగాత్మకంగా ఓ షో రూంలో విజయవంతంగా శుక్రవారం పరీక్షించారు. 4 వీలర్ వాహనాన్ని వాహనదారుడికి ఈ విధానం ద్వారా రవాణా శాఖ ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ అందజేశారు.
Also Read: Peddi Special Song: ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్ కోసం రెడీ అవుతున్న టాప్ హీరోయిన్.. ఎవరంటే?
సమర్థవంతమైన రవాణా సేవలు
సాఫ్ట్‌వేర్ విజయవంతం కావడంతో కొనుగోలు చేసే వాహనాలు, వాటి యజమానులు సంబంధిత రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండానే షోరూంల వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని రవాణా శాఖ వెల్లడించింది. ఈ కొత్త విధానంతో వాహనం కొనుగోలు చేసిన అధికారిక డీలర్‌నే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారని, అవసరమైన పత్రాలు (ఇన్వాయిస్, ఫారం 21, ఫారం 22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫోటోలు మొదలైనవి) డీలర్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయబడతాయని తెలిపింది. రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారని, సర్టిఫికేట్ నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపబడుతుందని, దీంతో ప్రజలకు సమయం ఆదా అవుతుందని చెప్పింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం
ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లే అవసరం ఉండదని, వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుందని తెలిపింది. అవసరమైతే రవాణా శాఖ అధికారులు అధికారిక ఆటో మొబైల్ డీలర్ల వద్ద వాహనాలపై యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహిస్తారని, దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించింది. ఈ సౌకర్యం ద్విచక్ర వాహనాలు, కార్లకు మాత్రమే వర్తిస్తుందని, వాణిజ్య (ట్రాన్స్‌పోర్ట్) వాహనాలకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు మరింత సులభమైన, డిజిటల్, సమర్థవంతమైన రవాణా సేవలను అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందని జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ వెల్లడించారు. ఈ విధానం అమలు ప్రక్రియపై రవాణా శాఖ కమిషనర్ 33 జిల్లాల రవాణా శాఖ అధికారులతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించి అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. అమలులో షో రూం డీలర్లకు ఏవైనా సందేహాలుంటే సంబంధిత జిల్లా రవాణా శాఖ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
Also Read: Purushaha Movie: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘పురుషః’ సాంగ్ ప్రోమో.. మగాడంటే అంతేనా మరి?

