KTR on SIT Investigation: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలపాటు విచారణ ఎదుర్కొన్న తర్వాత కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నవ్వుతూ, హుషారుగా బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడ ప్రెస్‌మీట్ పెట్టి సంచలన (KTR on SIT Investigation) వ్యాఖ్యలు చేశారు.
పోలీసువారి విచారణకు ఏడున్నర గంటలపాటు సహకరించానని కేటీఆర్ చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా ఈ కేసుపై విచారణ జరుపుతున్నారని, ఈ సమయంలో లీకుల మీద లీకులు ఇస్తూ, తమ పార్టీ నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేసేవిధంగా నడుచుకుంటున్న వ్యవహారానికి బాధ్యులు ఎవరు? అని సిట్ అధికారులను ప్రశ్నించినట్టు కేటీఆర్ చెప్పారు. ‘‘మాకు సంబంధం లేదు. మీడియా ఏదో రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. హీరోయిన్లను బెదిరించి ఏదో చేసినట్టుగా రాస్తున్నారు. ఇది నిజంగా ఎవరికి జరిగింది. ఆ వివరాలు నా ముందు పెట్టండి అని అడిగాను. అక్కడున్న అధికారి స్పందిస్తూ, లేదండీ ఇది నిజం కాదు. మేము ఆల్రెడీ మీడియాకు చెప్పాం కదా అన్నారు. కరెక్ట్ కాదని మీరు చెప్పింది ఎక్కడో గింత వార్త వస్తుంది. కానీ నిజం కాని విషయాలు మీరు ఇన్ని రోజులు నడిపిన దానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించాను. మాకు కుటుంబాలు, మాకు కలిగిన క్షోభకు, బాధకు ఎవరు బాధ్యులు?, దీన్ని మీరు నిలువరించలేరా? అని అడిగాను. ఈ ప్రభుత్వం లీకువీరుల ప్రభుత్వం. లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం. ఈ లీకులను నమ్మొద్దని మీడియావారిని నేను కోరుతున్నాను’’ అని కేటీఆర్ అన్నారు.
Read Also- Veenvanka Anganwadi Centres: అంగన్వాడీ పౌష్టికాహారం పక్కదారి.. పసిపిల్లల ఆహారంపై అక్రమార్కుల కన్ను!
మాకు కూడా ఫ్యామిలీలు ఉన్నాయ్
‘‘ఇస్టానుసారం ప్రసారం చేయొద్దు. వాస్తవం ఏమిటి, అవాస్తవం ఏమిటి అని ఒకసారి తెలుసుకోవాలని నా విజ్ఞప్తి. హరీష్ రావు విచారణలో ఉన్నప్పుడు రకరకాల వార్తలు ప్రసారం చేశారు. ఈ రోజు నేను విచారణలో ఉన్నప్పుడు కూడా అలాగే చేసి ఉంటారు. దయచేసి బాధ్యత గల మీడియా సంస్థలకు ఇది నా విజ్ఞప్తి. ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి. జీవితాలు ఉన్నాయి. కార్యకర్తలు ఉన్నాయి. నియోజకవర్గాలు ఉన్నాయి. మాకు కూడా ఓట్లు వేసిన ప్రజలు ఉన్నారు. వాళ్లు బాధపడతారు. వండివార్చవద్దని కోరుతున్నాను’’ అని కేటీఆర్ అన్నారు.
టైమ్ పాస్.. ఆ కేసులో ఏమీ లేదు
మా ఎమ్మెల్యేలు, నేతల ఫోన్లు ట్యాప్ కావడం లేదా? అని పోలీసులను అడిగితే.. లేదు అని సమాధానం ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు. స్వయంగా ఒక మంత్రి తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందన్న దుస్థితి ఉందా లేదా? అని పోలీసులను అడిగానని, దానికి కూడా అది కాదు, ఇది కాదు అని సమాధానం చెప్పలేదన్నారు. సిట్ విచారణలో అడిగిన ప్రశ్ననే మళ్లీ మళ్లీ అడిగారని, ఒక 300 పేర్లు ముందు పెట్టి, ఆయన తెలుసా?, ఈయన తెలుసా? అని ప్రశ్నించారు. టైమ్ పాస్ చేయడం తప్ప, అక్కడ విషయమేమీ లేదని, వారికి కూడా ఆ విషయం తెలుసునని, అందుకే, బాధ్యతగల పార్టీగా ఏ విచారణకు పిలిచినా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని సిట్‌లు వేసిన సహకరిస్తాం, వస్తామని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షం పాత్ర చాలా పెద్దదని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. సింగరేణి టెండర్లలో దొంగలు దొరికారని, ముఖ్యమంత్రి-మంత్రుల మధ్య వాటా పంచాయితీలలో దొంగలు దొరికారని, హరీష్ రావు ఆధారాలు కూడా ఇస్తానని చెప్పినా కూడా ఇప్పటివరకు ఉలుకు, పలుకు లేదని ఆరోపించారు.
300 కోట్ల రూపాయల టెండర్‌లో ముఖ్యమంత్రి సన్నిహితుడు ఉన్నాడని, ఒక మంత్రి కొడుకు తుపాకి పెట్టి మరీ బెదిరిస్తే దాని మీద సిట్ లేదని కేటీఆర్ ఆరోపించారు. అధికార పార్టీలో ఉండి కూడా అక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ మీద సిట్ ఎందుకు వేయడం లేదని ఆయన ఆరోపించారు. ‘‘సిట్ అధికారులు ఒక రకంగా నన్ను హెరాస్‌మెంట్ చేయడం తప్ప, ఆ కేసులో ఏమీ లేదు. గత కొంతకాలంగా మా పార్టీ మీద మా నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్’’ అని అన్నారు.

