Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతిలో పలు పార్టీలకు చెందిన నాయకులు చేరారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉప్పల్, నాంపల్లి, చార్మినార్ నియోజకవర్గాలకు చెందిన నాయకులకు కండువాలు కప్పి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆహ్వానం పలికారు. జాగృతి నాయకులు గోపు సదానందం, పడాల మనోజ్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు శర్మన్, సురేశ్ రామారావు, సతీశ్, అనిల్, రాజు, బాలకృష్ణ, కృష్ణా నాయక్, రాములు తదితరులు జాగృతిలో చేరారు. కార్యక్రమంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు పాల్గొన్నారు.
‘వైద్యులపై దాడులు ఆపాలి’
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అత్యవసర వైద్య సేవలందిస్తున్న గ్రామీణ వైద్యులపై దాడులను ఆపాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ హుస్సేన్, నాయకులు నర్సింహా ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు గ్రామీణ వైద్యులు కల్వకుంట్ల కవితను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.
జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరిన ఉప్పల్, నాంపల్లి, చార్మినార్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు. pic.twitter.com/d458kHXqzp
— Telangana Jagruthi (@TJagruthi) October 17, 2025
Also Read: US Obesity Study: అధిక బరువుతో అమెరికా బేజారు.. ఉబకాయంలో ఆల్‌టైమ్ రికార్డ్.. ఇలా అయితే కష్టమే!
‘సేవలకు తగిన గుర్తింపు ఇవ్వండి’
రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మందికి పైగా గ్రామీణ వైద్యులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రథమ చికిత్సలు మాత్రమే చేస్తున్నామని గ్రామీణ వైద్యులు తెలిపారు. అయినా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, అధికారులు తరచూ తమ హెల్త్ సెంటర్లపై దాడులు నిర్వహిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కవిత వద్ద వాపోయాలు. దీనిపై కల్వకుంట్ల కవిత స్పందిస్తూ గ్రామీణ వైద్యులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయొద్దని, వారి సేవలకు తగిన గుర్తింపునివ్వాలని కోరారు.
బంద్‌కు సంపూర్ణ మద్దతు
స్థానిక ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 42 రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్ట్ స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ బీసీ సంఘాలు అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చాయి. దీనికి తెలంగాణ జాగృతి తరపున కవిత మద్దతు తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు చేశారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీలకు అర్హత లేదని మండిపడ్డారు. ‘తెలంగాణ చట్టసభలు పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్ లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్ లో పాల్గొంటోంది. అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా?. అసెంబ్లీ, కౌన్సిల్ లో బిల్లులు పాస్ చేసి కేంద్రంపై కొట్లాడకుండా ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తామే ముందుండి బంద్ చేయిస్తామంటోంది. రెండు జాతీయ పార్టీలు బీసీ లను వంచిస్తున్నాయి’ అని కవిత ఫైర్ అయ్యారు.
