Kishan Reddy: వందేమాతర గీతాన్ని రాజకీయంగా వివాదాస్పదం చేసే ప్రయత్నాలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ కోఠిలోని వివేక వర్ధిని కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు.
భేదాల్ని మరిచిపోయి
వందేమాతరం అనేది ఓ పార్టీ నినాదం కాదని ఆయన పేర్కొన్నారు. దేశ సమైక్యతను ప్రతిబింబించే స్ఫూర్తివంతమైన గీతమని తెలిపారు. బ్రిటీష్ పాలకులు విభజించి పాలించు విధానంతో దేశాన్ని చీల్చాలని చూసినప్పుడు, వందేమాతరం భారతీయులను ఏకం చేసిందని వివరించారు. కులం, మతం, ప్రాంతం అన్న భేదాల్ని మరిచిపోయి దేశమే ప్రథమం మిగిలినవన్నీ తర్వాతే అన్న భావనను పెంచిందన్నారు. ఈ గీతం స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం పోసిందని కిషన్ రెడ్డి వివరించారు. అనంతరం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు రోజుల ప్రత్యేక ఫొటో ప్రదర్శనను కిషన్ రెడ్డి ప్రారంభించారు.
Also Read: Shivaji Apology: విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చిన శివాజీ ఏం చెప్పారంటే?
స్పాట్ ఆన్‌లైన్ క్విజ్..
ఈ ఎగ్జిబిషన్‌లో వందేమాతరం చారిత్రక ప్రస్థానాన్ని వివరించే 22 ఇన్ఫర్మేషన్ ప్యానెల్స్‌తో పాటు, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా తెలంగాణ(Telangana), హర్యానా(Haryana) రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఆహారపు అలవాట్లను, కళా రూపాలను చాటిచెప్పే ప్రత్యేక ప్యానెళ్లను ఏర్పాటు చేశారన్నారు. సందర్శకుల కోసం డిజిటల్ సెల్ఫీ పాయింట్లు, స్పాట్ ఆన్‌లైన్ క్విజ్ వంటి అత్యాధునిక వసతులు కల్పించినట్లు తెలిపారు. క్విజ్‌లో పాల్గొన్న వారికి అక్కడికక్కడే డిజిటల్ సర్టిఫికెట్లు అందజేస్తున్నారని వివరించారు. ఇదిలా ఉండగా ఈనెల 31వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే ఈ ప్రదర్శనను విద్యార్థులు, నగర ప్రజలు సందర్శించి దేశ ఘన చరిత్రను తెలుసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

