Tummala Nageshwar Rao: ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలోనే మేము తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో రైతు ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుంది.. యూరియా సరఫరాలో మా ప్రభుత్వం తీసుకురాదలుచుకున్న యాప్ అనేది కేవలం రైతుల సమయాన్ని ఆదా చేయాలనే సదుద్ధేశ్యంతో మాత్రమేనని’ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageshwar Rao) స్పష్టం చేశారు. సోమవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో ఉండే వారికి మేము చేసే మంచి పని కూడా మోసంలాగే కనిపిస్తుందని ఏద్దేవా చేశారు. పదేళ్ళు అధికారంలో ఉన్నామని చెప్పుకొనే వారికి యూరియా ఎవరిస్తారు ? ఎక్కడి నుండి వస్తుంది ఎలా వస్తుంది అని తెలియక మాట్లాడుతున్నారో లేక ఎప్పటిలాగే వాళ్ళ స్వార్ధరాజకీయాల కోసం మాట్లాడుతున్నారనేది తెలుస్తుందన్నారు.
రైతులను భయపెట్టే ప్రయత్నం
మొదటి రెండు పంటకాలలలో యూరియా సరఫరాలో ఆటంకాలు లేకుండా చేసిన మాప్రభుత్వం.. 3 వ పంటకాలంలో కేంద్రం నుండి కేటాయింపులు అనుకొన్న సమయానికి రాకపోవడంలో సరఫరాలో ఇబ్బందులు ఏర్పడిన మాట వాస్తవం అన్నారు. వానాకాలం 2024 వినియోగం 9.66 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే, 2025 లో ఇంతకంటే అధికంగా13,000 మెట్రిక్ టన్నులు అనగా 9.79 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరిపోయేంత యూరియా అందుబాటులో ఉన్నప్పటికి, ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతులను మరింత భయపెట్టే విధంగా మాట్లాడి, రైతులు యూరియా కోసం ఒకేసారి కొనుగోళ్ల కోసం వచ్చే విధంగా చేశారన్నారు.
కావాలనే యాప్ మీద అనుమానాలు
మోసాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, ఈ విషయాన్ని గ్రహించే గ్రామీణ ప్రజలు మరొక్కసారి మిమ్మల్ని తిరస్కరించారన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా, రైతులు క్యూ లైన్లలో వారి సమయాన్ని వృధా చేసుకొకుండా, పారదర్శకంగా అమ్మకాలు జరగాలనే ఉద్దేశ్యంతోనే మా ప్రభుత్వం యాప్ ని తీసుకురావడానికి నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతిపక్ష నాయకులు కావాలనే యాప్ మీద అనుమానాలు రేకెత్తిస్తు మాట్లాడుతుందని, ఇప్పటికే కిసాన్ కపాస్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించామన్నారు. దీనిని కూడా విజయవంతంగా అమలుచేసి, ప్రతిపక్ష నాయకుల అనుమానాలు పటాపంచల్ చేస్తామని, అలాగే పారదర్శకంగా యూరియా సరఫరా చేస్తామన్నారు. పది సంవత్సరాల పాటు మీరు చెప్పిన కథలు, చేసిన ఉత్తుత్తి హామీలు వినీవినీ విసిగెత్తిపోయి మార్పు కోరుకుంటున్న ప్రజల్ని, మీరు తెలంగాణ ప్రజల్ని ఆశపడి అనడం తెలంగాణ సమాజాన్ని కించపరిచే మాటలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజల్ని దోచుకుందెవరు? దాచుకుందెవరు అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.
Also Read: Eesha Song: ‘ఈషా’ సినిమా నుంచి మంచి ఫీల్ గుడ్ సాంగ్ వచ్చింది విన్నారా?.. ఎలా ఉందంటే?
ఏడాదిలోనే రైతు రుణమాఫీ
మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని, పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీసం లక్ష రుణమాఫీ చేయడానికే నానా అవస్థలు పడి, 4 వాయిదాలో చేస్తామని, 5 సంవత్సరాల సమయం తీసుకొని, సగం మందికి కూడా చేయని నాయకులా మా గురించి మాట్లాడేదని మండిపడ్డారు. ఎన్నికల హామీలో ఇచ్చిన మాటకు కట్టుబడి, 50 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీని అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంలోపే పూర్తి చేసి, రుణమాఫీ కోసమే 20,600 కోట్లు ఖర్చు చేసిన ఘనత మాది అని స్పష్టం చేశారు. మీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం తరువాత కూడా, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు రుణమాఫీ కోసం 20,600 కోట్లు చేశామంటే, మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి రైతుల మీద ఎంత అభిమానం, ప్రేమ ఉందో తెలిసిపోయిందన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసిన మా ముఖ్యమంత్రి మొండి పట్టుదల చూపించి, ఆర్థికంగా పరిస్థితులు అధ్వానంగా ఉన్న, మనకు అన్నం పెట్టిన రైతులకు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని, 25 లక్షలకు పైగా అర్హత కలిగిన రైతులకు 2 లక్షలలోపు రుణమాఫీని అమలు చేసి చూపించి, ప్రతిపక్షనాయకులకు దిమ్మతిరిగి పోయే సమాధానాన్ని ఇచ్చారన్నారు.
పెట్టింది మీరే కదా..?
వడ్లు కొనడం మాత్రమే కాదు..బోనస్ ఇచ్చి మరీ వడ్లు కొంటున్నాము. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరి వేస్తే ఉరి అని రైతులను బెదిరించి, వరి వేయకుండా చేసింది మీరే కదా.? రైతులకు ఆ పంట వేయకూడదు, ఈ పంట వేయకూడదు అని షరతులు . అలాంటి మీరు వడ్లు కొనడం గురించి, బోనస్ ల గురించి మాట్లాడుతుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కేవలం బోనస్ కోసమే దాదాపు 1800 కోట్లు ఖర్చు పెట్టాం. రైతుబంధును మీరు ఏ పంటకాలంలోనైనా 90 రోజులలోపు పూర్తి చేసారా? మేము 9 రోజుల్లోనే ఎకరానికి 6000 చొప్పున రైతుభరోసా చెల్లించాము.9 రోజుల్లో 67 లక్షల మంది ఖాతాలలో 8290 కోట్ల రైతుభరోసా నిధులు జమ చేశామన్నారు.
వ్యవసాయరంగంలో సాంకేతికత
రైతుబంధుగా మీరు ఎకరానికి 5000 ఇస్తే, మేము అధికారంలోకి వచ్చాక దానిని 6000 పెంచి, 67 లక్షల మంది రైతులకు అందించాము. మీరు రైతుబంధు పేరుతో రైతు సబ్సిడీ పథకాలు బంద్ చేస్తే, మేము రైతుభరోసా అందించడంతో పాటు రైతు సబ్సిడి పథకాలను తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు. మా ముఖ్యమంత్రిది ఒకే లక్ష్యం. రైతును రాజును చేయాలి. అందుకు అవసరమయిన అన్ని చర్యలను ముఖ్యమంత్రి అధ్యక్షతన మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.ఇప్పటికే వ్యవసాయరంగంలో సాంకేతికతను జోడించామని, భవిష్యత్తులో తెలంగాణ విజన్ 2047 కు అనుగుణంగా వ్యవసాయరంగాన్ని మార్చి, రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. యూరియా కోసం తీసుకొచ్చిన యాప్ ముందు ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలలోనే పరిశీలిస్తున్నామని, అప్పుడు రైతుల అభిప్రాయాల ప్రకారం యాప్ లో రైతు సౌలభ్యం కోసం చేయాల్సిన మార్పులుంటే చేస్తామన్నారు. కావాలంటే బిఆర్ఎస్ నాయకులు కూడా రైతుల ప్రయోజనాల కోసం మార్పులు సూచించవచ్చు అన్నారు.
Also Read: Deepu Chandra Das: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి హత్యోదంతంలో సంచలనాలు వెలుగులోకి

