Kishan Reddy: సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Kishan-Reddy (Image source Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Kishan Reddy: ఎప్పుడైనా ఆరా తీశారా? సోనియా గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

Kishan Reddy: సోనియా జీ.. ఆరు గ్యారెంటీల అమలుపై ఆరా తీశారా?

నిజమేంటో మీకు తెలియనట్లుంది
అందుకే విజన్ 2047పై ప్రశంసలు
420 హామీలను మూసీలో కలిపేశారా?
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi) ఎప్పుడైనా ఆరా తీశారా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రశ్నించారు. కనీసం తెలుసుకునే ప్రయత్నమైనా చేశారా? అని నిలదీశారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కిషన్ రెడ్డి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్-2047 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ఇటీవల సోనియాగాంధీకి అప్పగించారని గుర్తుచేశారు. ఈ సమయంలో 2 సంవత్సరాల పాలనలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డికి ఉన్న దూరదృష్టిని అభినందించినట్లు, తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు ప్రకటించారని పేర్కొన్నారు.

కానీ, 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో అభయహస్తం పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆవిష్కరించారని, 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి, అధికారం చేపట్టి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుందని, ఈ రెండేళ్లలో సోనియా కానీ, రాహుల్ కానీ, ప్రియాంక కానీ పార్టీ కానీ.. ఇచ్చిన హామీల అమలు గురించి ఏనాడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారా? అని ప్రశ్నించారు. కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన సమయంలోనైనా వీటి అమలు గురించి అడిగి తెలుసుకున్నారా? అని కేంద్ర మంత్రి నిలదీశారు.

Read Also- KCR On Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపం.. చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

2 సంవత్సరాల పాలనపై సీఎం రేవంత్ ను అభినందించారని, దీన్నిబట్టి చూస్తే.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించి కానీ, 6 గ్యారంటీలు ప్రజలకు అందించారా లేదా అనే వాస్తవాలు కానీ సోనియాకు తెలిసినట్లు లేదని పేర్కొన్నారు. ఆమె కనీసం తెలుసుకోవాలని ప్రయత్నించినట్లు కూడా లేదన్నారు. కానీ, ఇచ్చిన హామీలు వదిలివేసి తెలంగాణ ప్రజలను వంచిస్తూ, ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పేరిట విజన్ డాక్యుమెంట్ తో కొత్త పల్లవి అందుకుని పార్టీలో ఒకరినొకరు అభినందించుకుంటున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు. ఆనాడు ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టారని, ఇప్పుడు రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారని విమర్శించారు. మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలను గాలికొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేలేశారా? లేక గాంధీ భవన్ లో పాతరేశారా? తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయిందని, ఇప్పటికైనా కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించేముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి లేఖ ద్వారా గుర్తుచేశారు. లేదంటే అభయహస్తమే ప్రజల ఆగ్రహం రూపంలో భస్మాసుర హస్తమవుతుందని హెచ్చరించారు.

Read Also- Minister Ponguleti: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డు జీవో: మంత్రి పొంగులేటి

ఇదిలా ఉండగా నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజీ గ్రౌండ్స్‌లో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా ఘనంగా జరిగింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా భక్తులంతా స్వామి నామస్మరణతో పరవశించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. పూజా ప్రాంగణం మొత్తం దీపాల వెలుగులతో, భక్తి భావాలతో మార్మోగింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు ప్రార్థించారు. భక్తి, శ్రద్ధ, సంప్రదాయాలకు ప్రతీకగా అయ్యప్ప స్వామి పడిపూజ విజయవంతంగా ముగిసింది. ఈ మహా ఉత్సవానికి వారణాసి కాశీ విశ్వేశ్వర స్వామి ప్రధాన అర్చకుడు శ్రీకాంత్ మిశ్రా హాజరయ్యారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు, బీజేపీ ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, వేముల అశోక్, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కృష్ణ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, పాల్వయి హరీష్, రామారావు పటేల్, పాయల్ శంకర్, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, అంజిరెడ్డి, మల్క కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రా రెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాల అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి, భరత్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

Just In

01

Demon Pavan: డిమోన్ పవన్ రైట్ డెసిషన్.. సూట్‌కేస్ తీసుకోకుండా ఉంటేనా?

Ganja Smuggling: గంజాయి రవాణాపై స్పెషల్ ఫోకస్ చేసిన ఈగల్ టీమ్.. ఎందుకో తెలుసా?

SIR in Telangana: తెలంగాణలో ‘సర్’.. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కీలక ప్రకటన

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. విన్నర్ కళ్యాణ్, రన్నర్ తనూజ

Bigg Boss Telugu 9: టెన్షన్ పెట్టిన బిగ్ బాస్.. టాప్ 5గా వెనుదిరిగిన సంజన..