Rayaparthi MPDO: ఎంపీడీవోపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఉన్నతాధికారులు?
ఎంపీడీవోపై నేను చేసిన ఆరోపణలు తప్పుకాదు
ఫోన్ పే, గూగుల్ పే స్క్రీన్ షాట్లతో అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని బాధితురాలి ఆరోపణ
కార్యదర్శుల ప్రెస్‌మీట్‌పై టైపిస్టు ఆవేదన
తప్పుడు ఆరోపణలు చేశానంటే ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధం
రాయపర్తి ఎంపీడీవో ఆఫీస్‌లో టైపిస్ట్ స్వప్న మరో ప్రకటన
పాలకుర్తి, స్వేచ్ఛ : వరంగల్ జిల్లా రాయపర్తి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) గూగుల్ కిషన్ నాయక్‌పై (Rayaparthi MPDO) తీవ్ర ఆరోపణలు చేసిన టైపిస్టు తూర్పాటి స్వప్న ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. స్వప్న తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 28న వరంగల్ జిల్లా కలెక్టర్‌ను కలిసి అనంతరం, కలెక్టర్ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించాలనుకున్నానని తెలిపారు. అయితే, తన ఆరోపణలను కప్పిపుచ్చే ప్రయత్నంలో ఎంపీడీవో ఉద్దేశపూర్వకంగా గ్రామపంచాయతీ కార్యదర్శులతో మీడియా సమావేశం నిర్వహించారని, తనపై తప్పుడు ప్రచారం నడిపించారని విమర్శించారు. ‘‘గ్రామాల్లో తిరిగే వారు పంచాయతీ కార్యదర్శులు. నేను ఆఫీసులో టైపిస్టు బాధ్యతలు నిర్వహించేదానిని. ఆఫీసులో జరిగే విషయాలు వారికి ఎలా తెలుస్తాయో వారే చెప్పాలి’’ అని స్వప్న ప్రశ్నించారు. ప్రెస్ మీట్ పెట్టడాన్ని తాను తప్పుబట్టడం లేదని, కానీ తాను చేసిన ఆరోపణల పట్ల వారు ఒక కిందిస్థాయి ఉద్యోగినిగా తనకు మద్దతు ఇవ్వాల్సిందిపోయి, తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also- Woman Farmer: చేతులు పట్టుకొని భోరున ఏడ్చిన మహిళా రైతు.. చలించిపోయిన మంత్రి పొన్నం!
ఎంపీడీవో సంఘాల బాధ్యులుగా ఉన్నారన్న కారణంతో తనపై అక్కసు వెళ్లగక్కడం తగదని ఆమె స్వప్న మండిపడ్డారు. ‘‘నా వ్యక్తిగత అవసరాలకు కిందిస్థాయి సిబ్బందికి డబ్బులు కొడుతున్నానని అనడం దురుద్దేశపూర్వకం. నాకు ఫోన్ పే, గూగుల్ పే లేవు. మా నాన్న తూర్పాటి జగదీశ్వర్ ఫోన్ పే ద్వారా అవసరాల నిమిత్తం వాడుకుంటాను’’ అని వివరించారు. ‘‘జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లకు నా సర్వీస్ రూల్స్, రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్ల వంటి అంశాల్లో ఎంపీడీవో పురమాయిస్తేనే మా నాన్న ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించాను’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కార్యదర్శులు ఆలోచించాలని, తప్పును తప్పు అనే వారు తప్పుడు మనుషులు అవుతారు, కానీ నిజాయితీని తప్పు అనే వారు నిజాయితీ పరులు కాలేరు అని స్వప్న వ్యాఖ్యానించారు. నేను తప్పు చేసి ఉంటే ఉరి కంబం ఎక్కడానికైనా సిద్ధమని పేర్కొంటూ…మానవతా దృక్పథంతో పునరాలోచించి నా మీద చేసిన ఖండనను వెనక్కి తీసుకోవాలని కార్యదర్శులకు విన్నవించుకుంటున్నాను అని స్వప్న అన్నారు.
