Woman Farmer: భారీ వర్షాలకు ధాన్యం తడిచిపోవడంతో గుండెలవిసేలా రైతు కన్నీరు
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
మహిళా రైతుకు 10 వేల రూపాయల తక్షణ ఆర్థికసాయం అందజేత
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో మొంథా తుపాను ప్రభావంతో సంభవించిన విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో గురువారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తడిచిన ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి వెళ్లి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పది ట్రిప్పుల ధాన్యం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ మంత్రి చేతులు పట్టుకొని తారవ్వ అనే మహిళా రైతు (Woman Farmer) భోరున ఏడ్చింది. ఆమహిళా రైతును మంత్రి పొన్నం ప్రభాకర్ ఓదార్చి, తక్షణ సాయం కింద పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. ఈ తుపాను కారణంగా ఊహించనంతగా, వందలాది మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకుపోయి, వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయిందని ప్రస్తావించారు.
Read Also- Akhanda 2: సర్వేపల్లి సిస్టర్స్.. థమన్ అసలు ఏం చేస్తున్నావయ్యా?
హుస్నాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట నష్టంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయామని, శుక్రవారం నాడు (అక్టోబర్ 31) ముఖ్యమంత్రి హుస్నాబాద్ పరిధిలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. అధికారులు రైతుల మొత్తం నష్టాన్ని రికార్డ్ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. నియోజకవర్గంలో ముగ్గురు గల్లంతు అయి మృత్యువాత పడ్డారని, వారి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం శ్రమిస్తోందన్నారు. పంట నష్టం, ప్రాణ నష్టం, పశు నష్టం జరిగిందని, ఇది పెను విపత్తు అన్నారు. జాతీయ విపత్తు కింద తీసుకొని రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇది ప్రకృతి వైపరిత్యమని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.
హనుమకొండ జిల్లాలో 22 సెం.మీ. వర్షపాతం
హనుమకొండ, స్వేచ్ఛ: హనుమకొండ జిల్లాలో ఈ నెల 29న ఉదయం 8:30 నుండి 30వ తేదీ (గురువారం) 8:30 గంటల వరకు 229.6ఎంఎం వర్షపాతం నమోదయిందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. జిల్లాలో కురిసిన వర్షపాతం, వరద ప్రభావం, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ వెల్లడించారు. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో 390.6 ఎంఎం, వేలేరు 313.8 ఎంఎం, కాజీపేట 313.6 ఎంఎం, ధర్మసాగర్ 312.8 ఎం ఎం, హనుమకొండ 310.8ఎంఎం, ఎల్కతుర్తి 295.4 ఎంఎం, హసన్‌పర్తి 252.4ఎంఎం, ఐనవోలు 208.4 ఎంఎం వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
హనుమకొండ పట్టణంలో 15 కాలనీలు గోకుల్ నగర్, ఇందిరమ్మ కాలనీ, పోచమ్మ కుంట, హనుమకొండ చౌరస్తా, ఎన్జీవోస్ కాలనీ రోడ్, భగత్ సింగ్ కాలనీ, పోస్టల్ కాలనీ, జవహర్ కాలనీ, భీమారం మెయిన్ రోడ్, కాపు వాడ, వివేక్ నగర్, అమరావతి నగర్, సమ్మయ్య నగర్, ప్రగతి నగర్, తిరుమల్ నగర్ లు వరద నీటి ముంపునకు గురైనట్లు తెలిపారు. జిల్లా పరిధిలో 5 లో లెవెల్ కాజ్ వే లలో మూడింటి పై నుండి వరద నీరు ప్రవహిస్తుందన్నారు. ఇందులో నడికూడ మండలం కంఠాత్మకూర్, ఆత్మకూరు మండలం కటాక్ష పూర్ చెరువు లో లెవెల్ కాజ్ వే, ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ నుండి జిలుగుల రోడ్డులో శివాలయం వద్ద ఉన్న కాజ్ వే పై నుండి వరద నీరు ప్రవహిస్తుందన్నారు. జిల్లాలో 920 చెరువులకు గాను 500 చెరువులు మత్తడి పోస్తున్నట్లు పేర్కొన్నారు.
