Telangana Panchayat Raj: రెండేళ్లలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పును తీసుకువచ్చే పలు కీలక కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసింది. గ్రామ స్వరాజ్యం, మహిళా సాధికారత, మౌలిక వసతుల అభివృద్ధి మూడు ప్రధాన లక్ష్యాలతో శాఖ ముందుకు సాగుతున్నది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం, గ్రామీణ సమాజానికి నూతన దిశానిర్దేశం ఇవ్వడం.
ఈ లక్ష్యాల సాధనలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆలోచనలతో, ప్రజా కేంద్రిత దృక్పథంతో పలు సృజనాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఆ కార్యక్రమాలు ప్రస్తుతం గ్రామాల రూపురేఖలను మార్చుతూ, గణనీయమైన ఫలితాలను ఇస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నాయకత్వంలో రెండేళ్లలో ఈ శాఖ పల్లెల అభివృద్ధిపై స్పష్టమైన మార్పు చూపింది. ప్రజల భాగస్వామ్యంతో, మహిళల సాధికారతతో, గ్రామాల నుంచి తెలంగాణ సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తున్నది.
ప్రభుత్వం చొరవతో
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రహదారి నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి హ్యామ్, పీఎంజీఎస్‌వై, సీఆర్ఆర్, ఎంఆర్ఆర్ వంటి కీలక కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నది. గ్రామ పంచాయతీలను మండల, జిల్లా కేంద్రాలకు కలుపుతూ, రహదారి నాణ్యతను మెరుగు పరుస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నది. హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా 7,449.50 కి.మీ. గ్రామీణ రహదారుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నది. దీని కోసం ప్రభుత్వం రూ.16,007.56 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చి, మొత్తం 17 ప్యాకేజీలకు ఈ ప్రోక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. పీఎంజీఎస్‌వై కార్యక్రమం కింద గత రెండేళ్లల్లో 201 కి.మీ. రహదారులు, 34 వంతెనల నిర్మాణం పూర్తి కాగా, మొత్తం రూ.455 కోట్లు వెచ్చించారు.
రూ.4,174.83 కోట్ల అంచనా వ్యయం
విడుదలైన రూ.582.31 కోట్లలో గణనీయమైన పురోగతి సాధించారు. పీఎం జన్మన్ కింద 66.98 కి.మీ. పొడవైన 25 రహదారి పనులను రూ.66.86 కోట్లతో అప్పగించగా, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సీఆర్ఆర్ కార్యక్రమం పరిధిలో మొత్తం 2,163 పనులకు రూ.4,174.83 కోట్ల అంచనా వ్యయంతో ప్రగతి కొనసాగుతున్నది. 2023 డిసెంబర్ నుంచి కొత్తగా 1,121 పనులకు రూ.2,709.82 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చి, ఇప్పటి వరకు 600 కి.మీ. రహదారులు పూర్తి చేశారు. ఈ పనులకు రూ.570 కోట్లు ఖర్చు అయ్యింది. ఎంఆర్ఆర్ కింద మొత్తం 2,861 పనులకు రూ.3,347.44 కోట్ల అంచనా వ్యయంతో చర్యలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 2023 నుంచి కొత్తగా 1,059 పనులకు రూ.1,558.16 కోట్ల పరిపాలనా అనుమతి లభించగా, ఈ వ్యవధిలో 180 కి.మీ. రహదారులు పూర్తి చేసి రూ.452.51 కోట్లు వెచ్చించారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి శక్తివంతమైన రహదారి మౌలిక సదుపాయాలు అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే దిశగా ఈ కార్యక్రమాలు మైలు రాళ్లుగా నిలువనున్నాయి.
Also Read: Telangana Local Elections: ముగ్గురు పిల్లలు ఉన్న వారికి షాక్.. స్థానిక ఎన్నికల నుంచి అవుట్
గ్రామీణ సేవా వ్యవస్థలో స్థిరత్వం
ఒక వైపు గ్రామాల అభివృద్ధికి రోడ్లు, మరోవైపు పరిపాలన విభాగాన్ని బలోపేతానికి చర్యలు చేపట్టగా, ఎంపీడీఓలు, ఎంపీఓల నియామకాలు పూర్తయ్యాయి. క్రీడా కోటా కింద 171 మంది పంచాయతీ కార్యదర్శులను నియమించారు. జీవో 317 వల్ల ఇబ్బంది పడ్డ కార్యదర్శులకు ప్రభుత్వం డిప్యుటేషన్ విధానంలో సౌలభ్యం కల్పించి, వారి సేవలను కొనసాగిస్తున్నది. 92 వేల కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాల చెల్లింపుతో గ్రామీణ సేవా వ్యవస్థలో స్థిరత్వం వచ్చింది. ఇది ఉద్యోగుల నిబద్ధతను పెంచడమే కాకుండా, ప్రజలకు సేవల నాణ్యతను మెరుగుపరిచింది. గ్రామాలను పచ్చగా, శుభ్రంగా, ఆరోగ్యంగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం విస్తృత ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ప్రజల భాగస్వామ్యంతో “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమాన్ని రెండు సార్లు విజయవంతంగా నిర్వహించింది. ప్రతి ఏడాది నిర్వహించే “పనుల జాతర” ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు గ్రామీణాభివృద్ధి రెండూ కలిసేలా చేసింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతున్నారు.
వర్షపు నీటి సంరక్షణలో ఆదర్శం
2024 – 25 ఆర్థిక సంవత్సరంలో రూ.4,529 కోట్లు, 2025 – 26లో రూ.2,198 కోట్లు ఖర్చుతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశారు. వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేంద్రం చేపట్టిన “జల్ సంచయ్ జన భాగీదారీ” పథకంలో తెలంగాణ అద్భుత ఫలితాలను సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,61,370 నీటి సంరక్షణ పనులు పూర్తి చేసి దేశంలో మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకున్నది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ తరుఫున డైరెక్టర్ సృజన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి నిల్వ గుంతలు, ఫార్మ్ పాండ్లు, చెక్ డ్యామ్‌లు, చిన్న రిజర్వాయర్లు వంటి పనులు పల్లె పల్లెకు చేరి ప్రజల జీవన విధానాన్ని మార్చుతున్నాయి.
వర్షం కురిసిన ప్రతి చుక్కను నేలలో దాచే దిశగా తెలంగాణ చూపుతున్న దృక్పథం దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా మారింది. తెలంగాణ ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయం, సంక్షేమం, సమానత్వం అనే మూడు సూత్రాల మీద నడుస్తున్నది. పంచాయతీ కార్యదర్శుల సేవలను గుర్తించి, ప్రభుత్వం రూ.104 కోట్ల బిల్లులను ఏకకాలంలో విడుదల చేసి, వారి ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చింది. అదే విధంగా, ఇంటింటికి మంచి నీరు అందిచేందుకు కష్టపడే మిషన్ భగీరథ కార్మికులకూ రూ.120 కోట్ల జీతాలు విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం వారి కష్టానికి గౌరవం చెల్లించింది. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలనే లక్ష్యంతో రూ.1,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టి గ్రామీణ ఆరోగ్య రక్షణలో ఒక కొత్త అధ్యాయం రాసింది. ఈ ప్రాజెక్టులు తాగు నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్నాయి.
మహిళలకు ఆర్థిక భరోసా
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పాలసీ గ్రామీణ మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తెచ్చింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు ఆత్మవిశ్వాసం, అవకాశాలు, ఆర్థిక భద్రత ఇందిరా మహిళా శక్తి ద్వారా కలుగుతున్నది. కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా చేయాలి అనే ధ్యేయంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్లకు పైగా బ్యాంక్ రుణాలు అందిస్తున్నది. దీని వల్ల స్వయం సహాయక బృందాలు కేవలం పొదుపు సమూహాలుగానే కాకుండా, స్వయం సమృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయి. మహిళల కృషి ఫలించేందుకు ప్రభుత్వం పలు భరోసా పథకాలను అందిస్తున్నది. రూ.1,300 కోట్లకు పైగా వడ్డీ మాఫీ, రూ.10 లక్షల ప్రమాద బీమా, రూ.2 లక్షల లోన్ బీమా వంటి సరికొత్త పథకాలతో మహిళా సంఘాలు మరింత బలోపేతం అవుతున్నాయి. గతంలో 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకే స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం ఉండేది. ఇప్పుడు 15 ఏళ్లు దాటిన ప్రతి మహిళా సభ్యురాలిగా చేరే అవకాశం కల్పించడం ద్వారా సమాన హక్కులకు మరో ముందడుగు పడింది. దివ్యాంగ మహిళలు, కిశోర బాలికల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి వర్గానికీ భాగస్వామ్యం లభిస్తున్నది.
చీరల పంపిణీ
మహిళా సంఘాలు కేవలం పొదుపు బృందాలుగానే కాకుండా, ఉద్యమశీలతకు ప్రతీకలుగా మారాయి. ఉచిత బస్సు ప్రయాణాల నుంచి ఆర్డీసీ అద్దె బస్సులకు యాజమానులుగా ఎదిగారు. పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు, ఫిష్ ట్రక్కులు నడుపుతున్నారు. ఇందిరా క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో శిల్పారామంలో ఏర్పాటు చేసిన “ఇందిరా మహిళా శక్తి బజార్” వారి ఉత్పత్తులకు రాష్ట్ర స్థాయి వేదికగా మారింది. చరిత్రలో తొలిసారి 65 లక్షల ఎస్‌హెచ్‌జీ సభ్యులకు యూనిఫాం చీరలు పంపిణీ చేయడం మహిళా ఐక్యతకు చిహ్నంగా నిలిచింది.
అలాగే, రూ.110 కోట్ల తో 22 జిల్లాల్లో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాలు సంఘాల కార్యకలాపాలకు స్థిరమైన వేదికగా మారనున్నాయి. కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించే సంక్షేమ కార్యక్రమం తెలంగాణలో మహోత్సవంలా మారింది. కేవలం 5 రోజుల్లోనే 43 లక్షల చీరలను తెలంగాణ ఆడ బిడ్డలకు పంపిణీ చేసి రికార్డ్ సృష్టించారు. ప్రతి మహిళకు ప్రత్యేక గౌరవం చూపిస్తూ, వారి పాత్రను స్మరింపజేస్తూ, కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు అయింది. మహిళల హక్కులు, గౌరవం, శక్తికి ప్రతీకగా ఈ చీరల పంపిణీ తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచిపోనున్నది.
ఇంకా మరెన్నో
ఇక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం రాష్ట్రంలో భూమిలేని కూలీల జీవితాల్లో నూతన వెలుగు నింపింది. భూమి లేకపోయినా, శ్రమతో జీవనాన్ని కొనసాగిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అర్హత సాధించిన ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.12 వేల రూపాయల ఆర్థిక భరోసా అందించడం ద్వారా సామాజిక భద్రతకు కొత్త దిశ చూపింది. వారి జీవనంలో గౌరవం, ఆత్మవిశ్వాసం నింపుతున్నది. లక్ష మందికి పైగా అర్హులను గుర్తించి కొత్తగా చేయూత పింఛన్లు అందిస్తున్నది. దీంతో పాటు 14 వేల మంది ఎయిడ్స్ బాధితులకు, 4,021 మంది డయాలసిస్ రోగులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది.
Also Read: The Raja Saab: ‘ది రాజా సాబ్’ నుంచి మరో అప్డేట్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..

