Tummala Nageswara Rao: పాసుబుక్ లను అనుసంధానం చేసి యూరియాను పంపిణీ చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ఆదేశించారు. డిమాండ్ తక్కువగా ఉన్న జిల్లాల నుంచి ఎక్కువగా ఉన్న జిల్లాలకు యూరియాను తరలించి, రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో యూరియా నిల్వలు, సరఫరాలపై సచివాలయంలో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అవసరాల దృష్ట్యా కేంద్రం 50 వేల మెట్రిక్ టన్నులు ఈ నెలలో సరఫరా చేస్తామన్నారని, కానీ 28,600 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించి, అందులో 13000 మెట్రిక్ టన్నులు ఈ నెల 21 వరకు రాష్ట్రానికి సరఫరా చేశారన్నారు.
మీడియాలో ప్రభుత్వం బద్నాం
జియో పాలిటిక్స్ నేపథ్యం రెడ్ సీ లో నౌకాయనంలో ఇబ్బందులతో, మన దేశానికి ఇంపోర్ట్ చేయాల్సిన యూరియా సకాలంలో అందుబాటులోకి రాకపోవడానికి తోడు దేశీయంగా రామగుండం ఎరువుల కార్మాగారం నుంచి యూరియా ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేకపోవడంతో, ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్రాలకు యూరియా కేటాయింపులు మరియు సరఫరా పూర్తిగా కేంద్రం పరిధిలో ఉంటుందని, కాని ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం పై బురద జల్లేలా ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతాంగం ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థంతో విమర్శలు చేయడం, క్యూ లైన్ లో చెప్పులు పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుండటంపై మండిపడ్డారు. 63 వేల మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి సరఫరా చేసే విధంగా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఫోన్ లో మంత్రి కోరారు.
Also Read: ACB officials: ఏసీబీ వలకు చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.. ఎంత లంచం అడిగారంటే
సరఫరా అయ్యేలా చర్యలు
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కూడా ఫోన్ లో మాట్లాడారు. కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించి, రాష్ట్రానికి రావాల్సిన యూరియాను త్వరగా సరఫరా అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. రామగుండం నుంచి తెలంగాణ కు కేటాయించిన యూరియా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రీ డిపార్ట్ మెంట్ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్(CS Sanjay Kumar) కు తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ లైన్ లు లేకుండా చూడాలని, టోకెన్ పద్దతిలో స్టాక్ ను బట్టి రైతులకు యూరియా బస్తాలు అందించాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, కో ఆపరేటివ్ కమీషనర్ సురేంద్ర మోహన్, మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస రెడ్డి, ఇండస్ట్రీ డిపార్ట్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: Lord Vinayaka Marriage: వినాయకుడికి పెళ్లి జరిగిందా? పురాణాలు ఏం చెబుతున్నాయంటే?