Pasamailaram Blast: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 36మంది ప్రాణాలను కోల్పోయారు. పలువురు తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నారు. అయితే ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధించి హృదయ విదారక గాధలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవి మనసులను మరింత బరువెక్కిస్తున్నాయి.
కొత్త జంట దుర్మరణం!
సిగాచీ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో కొత్తగా పెళ్లైన జంట ప్రాణాలు కోల్పోవడం మరింత వేదన కలిగిస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్ రెడ్డి (Nikhil Reddy), శ్రీ రమ్య (Sri Ramya).. రెండు నెలల క్రితం ప్రేమ వివాహం (Love Marraige) చేసుకున్నారు. దీంతో కొత్త జీవితంలో ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నారు. ఉద్యోగా అవకాశాల కోసం హైదరాబాద్ లోనే ఉంటూ కార్మికులుగా సిగాచీ పరిశ్రమలో పని చేస్తున్నారు. రోజువారీగా సోమవారం విధుల్లోకి వచ్చిన నిఖిల్ రెడ్డి, శ్రీరమ్య.. రియాక్టర్ పేలిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరువురు కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ఆషాడ మాసం తర్వాత ఇద్దరికీ పెద్దల సమక్షంలో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కన్నీరు మున్నీరు అవుతున్నారు.
2 క్రితమే జాయిన్.. ఇంతలోనే
సిగాచి పరిశ్రమ ప్రమాదం గురించి మరో విషాద గాధ వెలుగులోకి వచ్చింది. ఉద్యోగంలో జాయిన్ అయిన రెండ్రోజులకే మహారాష్ట్రకు చెందిన భీమ్ రావు ప్రాణాలు కోల్పోయారు. తొలుత తీవ్రగాయాలైన బీమ్ రావును హుటాహుటీన పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బీమ్ రావు ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల క్రితం సోనీ అనే మహిళతో బీమ్ రావుకు వివాహమైంది. వారికి ఆరేళ్ల కూతురు ఉంది. రెండేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు వచ్చిన బీమ్ రావు.. బండ్ల గూడలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి సెంట్రింగ్ పని చేస్తూ వచ్చిన ఆయనకు రెండ్రోజుల క్రితం సిగాచిలో జాబ్ వచ్చింది. కంపెనీలోని ప్యాకింగ్ విభాగంలో ఉద్యోగం రాడవంతో జాయిన్ అయ్యారు. పనిలో చేరిన రెండోరోజే ఇలా మృత్యువాత పడటంపై కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
రూ.కోటి నష్ట పరిహారం
సంగారెడ్డి జిల్లా పాశమైలారం అగ్ని ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటివరకూ 36 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ప్రమాద సమయంలో 143 మంది పరిశ్రమలో ఉన్నారని 58 మందిని అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, పాక్షికంగా గాయపడినవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు చెప్పారు.
Also Read: Doctors Day 2025: వెండితెరపై స్టార్స్.. రియల్ లైఫ్‌లో డాక్టర్స్
అసలేం జరిగిందంటే?
సోమవారం పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో సంఘటన స్థలిలోనే ఐదుగురు మృతి చెందగా.. మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనానికి బీటలు వచ్చాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ 36 మంది చనిపోగా.. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే పలువురు మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉండటంతో డీఎన్ఏ ద్వారా గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.