Pashamylaram Blast: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాదస్థలిని తెలంగాణ రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యల్లో పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఘటనకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రసాయన కంపెనీల్లో తనిఖీలు నిర్వహించి లోపాలను గుర్తించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితుల కుటుంబానికి భారీ పరిహారం ప్రకటించారు.
రూ.కోటి నష్ట పరిహారం
సంగారెడ్డి జిల్లా పాశమైలారం అగ్ని ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటివరకూ 36 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ప్రమాద సమయంలో 143 మంది పరిశ్రమలో ఉన్నారని 58 మందిని అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, పాక్షికంగా గాయపడినవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు చెప్పారు.
పాశమైలారం పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయిలు నష్టపరిహారం
-సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/B3FuC8CvnX— ChotaNews App (@ChotaNewsApp) July 1, 2025
బాధ్యులపై కఠిన చర్యలు: సీఎం
ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కంపెనీల్లో పీరియాడికల్ ఇన్స్పెక్షన్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సీఎం.. సూటి ప్రశ్నలు
అంతకుముందు పాశమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన క్రమంలో అధికారులకు సీఎం రేవంత్ పలు ప్రశ్నలు సంధించారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో పరిశ్రమలశాఖ అధికారులు, బాయిలర్స్ డైరెక్టర్స్ తనిఖీలు చేశారా? బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా? బాయిలర్ల పనితీరుపై యాజమాన్యానికి ఏమైనా సూచనలు చేశారా? అని ప్రశ్నించారు. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిశ్రమలో గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అని ప్రశ్నించారు. ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.
Also Read: Madhya Pradesh: ఆస్పత్రిలో ఘోరం.. యువతి ఛాతిపై కూర్చొని.. కసిగా గొంతు కోసిన ఉన్మాది!
ప్రమాద వివరాలు ఇలా..
సోమవారం పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో సంఘటన స్థలిలోనే ఐదుగురు మృతి చెందగా.. మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనానికి బీటలు వచ్చాయి. ఈ ఘటనలో ఇప్పటివరకూ 36 మంది చనిపోగా.. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే పలువురు మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉండటంతో డీఎన్ఏ ద్వారా గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.