Mahesh Goud vs Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పై విమర్శలు కురిపించడం బంద్ పెట్టాలని, ప్రజల కోసం పనిచేస్తుంటే బురద జల్లడం సరికాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వర్తించేలా బండి సంజయ్ కేంద్రాన్ని ఒప్పించాలని పీసీసీ చీఫ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. అధ్యక్ష పదవి రావట్లేదనే ప్రస్టేషన్ లో బండి సంజయ్ ఉన్నారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ను విమర్శిస్తే తాట తీస్తామన్నారు. ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఢిల్లీ పెద్దలకు గులాం గిరి చేసిన పనులను ప్రజలెవ్వరూ మర్చిపోలేదని వివరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి చెప్పులు మోసిన చరిత్ర బండి సంజయ్ కు ఉన్నదన్నారు.
ఇక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వలే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ ఎస్ లోపాయికారీ ఒప్పందాలతో ముందుకు సాగే ఛాన్స్ ఉన్నదన్నారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటుందన్నారు. బండి సంజయ్ లో రోజు రోజుకు అభద్రత భావం పెరిగిపోతుందన్నారు.
Also Read: Lady Aghori: ఏపీకి వస్తున్నా.. పవర్ చూపిస్తా.. లేడీ అఘోరీ వార్నింగ్
దీంతోనే సొంత పార్టీ కార్యకర్తలే బండి సంజయ్ వైఖరిపై గుర్రుగా ఉన్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి బండి సంజయ్ కు కనిపించకపోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు. కార్పొరేట్ సంస్థలను బెదిరించి బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుంటుందన్నారు. ఇక సన్న బియ్యంతో రాష్ట్రంలోని పేద ప్రజల కళ్లల్లో ఆనందం నెలకొన్నదన్నారు.