Telangana Tourism: రాష్ట్రంలో టూరిజం శాఖ ఏ ప్రాజెక్టు చేపట్టినా ఫారెస్టుశాఖ అడ్డుపడుతుంది. ప్రభుత్వం తెలంగాణలో టూరిజం బలోపేతం చేసేందుకు ప్రత్యేక టూరిజం పాలసీని సైతం తీసుకొచ్చింది. అందులో భాగంగానే కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందించింది. పలు పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. అయితే ఆ పనులు ముందుకు సాగడం లేదని టూరిజం అధికారులు పేర్కొంటున్నారు.
అధికారులకు సూచనలు
ప్రభుత్వం తొలుత అనంతగిరి(Anantagiri), అమరగిరి(సోమశిల), కిన్నెరసాని, పొదిల, బొగాత జలపాతం ప్రాంతాల వద్ద అభివృద్ధికి పర్యాటకశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాంతాలు అన్ని ఫారెస్టులతో కలిసి ఉన్నాయి. ఇక్కడి అభివృద్ధి పనులు చేపట్టాలంటే ఖచ్చితంగా అటవీశాఖ అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి. అనుమతి లేకుండా పనులు చేపట్టడం అసాధ్యం. ఈ ప్రాంతాలు అన్ని ప్రకృతితో ముడిపడి ఉన్నప్రాంతాలు. ఇవి పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని విడిది కోసం, మౌలిక సదుపాయాలన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ప్రకృతి ఒడిలో సేద తీరేవిధంగా అన్ని హంగులను సమకూర్చాలని యోచిస్తోంది. పర్యావరణపరంగా బఫర్ జోన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, నిబంధనలను పాటిస్తూనే.. ఫారెస్ట్ టూరిజంను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచనలు చేసింది. అయితే వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఏదో ఒక చెట్టును తొలగించాల్సి ఉంటుంది. అందుకు ఫారెస్టు అధికారులు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని, ససేమీర అంటుండటంతో పనులు ముందుకు సాగడం లేదని పర్యాటకశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
Alson Read: Harish Rao: మీకు అధికారం ఇచ్చింది ఎందుకు.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్!
నిబంధనలు సాకుగా చూపుతూ..
ఇదిఇలా ఉంటే అనంతగిరిలో కనీసం సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తే చెట్లు కోల్పోవల్సి వస్తుందని ఫారెస్టు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని సమాచారం. ఇది ఒకటే కాదు.. అక్కడ ఎలాంటి అభివృద్ధి చేపట్టాలన్న ససేమిరా అంటూ కొర్రీలు పెడుతున్నారని, కేంద్ర అటవీశాఖ నిబంధనలు సాకుగా చూపుతూ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నారని, ఇలా అయితే పర్యాటకశాఖ ఎలా ముందుకు పోతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యం నీరుగారే అవకాశం ఉందని టూరిజం అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఫారెస్టు అధికారులు ద్వంద వైఖరీ అలంభిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రోడ్ల విస్తరణకు అనుమతి ఇస్తున్న ఫారెస్టు అధికారులు.. టూరిజం బలోపేతానికి ఎందుకు ఇవ్వడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అటవీశాఖ అడ్డంకితోనే..
ఒక మొక్కకు 500 చెల్లించి తొలగింపు చర్యలు చేపట్టవచ్చు. దానిని మళ్లీ రీప్లేస్ మెంట్(మరో దగ్గర) నాటినట్లు లెక్కల్లో చూపితే సరిపోతుంది. కానీ అందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏకో టూరిజంను బలోపేతం చేయాలని ప్రయత్నం సైతం అటవీశాఖ అడ్డంకితోనే నిలిచిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అటవీ అధికారులు మంత్రుల సమీక్ష సమావేశంలో ఓకే అంటూ ఆ తర్వాత చట్టంలోని నిబంధనలు చూపుతున్నట్లు సమాచారం. ఈ నెల 19న టూరిజంశాఖ, అటవీశాఖ మంత్రులు టూరిజం ప్రాజెక్టులు-అనుమతులు- సమస్యలపై సమీక్షించారు. అధికారులు సైతం పాల్గొన్నారు. అయినప్పటికీ ఇరుశాఖల మధ్య క్లారిటీ రాలేదు. మళ్లీ మంగళవారం రెండుశాఖల అధికారులు ఫారెస్టుశాఖ అనుమతులతో భేటీ అవుతున్నారు. ఇందులోనైనా కొలిక్కి వస్తుందా? లేకుంటే ఫారెస్టు నిబంధనల పేరుతో టూరిజం ప్రాజెక్టులకు అడ్డుపడతారా? అనేది చూడాలి.
Also Read: Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
