Palakurthi: స్థానిక సంస్థల ఎన్నికలతో పాలకుర్తి నియోజకవర్గం రాజకీయ వేడి
పాలకుర్తి, స్వేచ్ఛ: స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే పాలకుర్తి (Palakurthi) నియోజకవర్గంలో రాజకీయం వేడి మొదలైంది. బరిలో నిలిచేందుకు గ్రామాల్లో ఆశావహుల సందడి మొదలైంది. పదవుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేతలంతా ఇప్పుడు ఓటర్లను తనవైపు ఆకర్షించేందుకు ముందస్తుగానే ముమ్మర కసరత్తులు మొదలుపెట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఒక్కో మండలానికి ముగ్గురు, నలుగురు ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక ప్రతిపక్షం కూడా ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతోంది. పాలకుర్తి, రాయపర్తి, పెద్దవంగర, తొర్రూరు మండలాల్లో ఇరు పార్టీల నేతలు గ్రామాలు కలియతిరుగుతూ ప్రజలతో మమేకయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. పరామర్శలు,ఆర్థిక సహాయాలు, పబ్లిసిటీ కార్యక్రమాలు, ఇలా అన్నీ జోరుగా సాగుతున్నాయి.
ఓటు బ్యాంకు కోసం లెక్కలు
గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బంధుతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీలిపోయింది. దానిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. అయితే, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో లోపాలు గ్రామీణ జనాలలో కొంతమేర అసంతృప్తి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. నిజమైన లబ్ధిదారులు కాకుండా అనర్హులకు ఇళ్లు కేటాయింపు కారణంగా కొంతలో కొంతమేర ఓట్లు పోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు యూరియా కొరత కూడా అధికార పార్టీ పట్ల ప్రజల్లో ఆగ్రహం రేపవచ్చని అంచనాగా ఉంది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తుపై ఎన్నికలు జరగపోయినా, పార్టీ బలపరిచిన అభ్యర్థులు బరిలో ఉంటారు, పార్టీల ప్రభావం గట్టిగానే ఉంటుంది.
Read Also- Telugu Director: చెప్పుతో కొట్టుకుంటూ.. భోరున విలపించిన తెలుగు దర్శకుడు.. వీడియో వైరల్!
బరిలోకి ఎవరెవరు?
పాలకుర్తి మండలంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్ తరఫున పల్లా సుందర్ రాంరెడ్డిని బరిలో దింపాలని ఎర్రబెల్లి వ్యూహం వేస్తున్నట్లు సమాచారం. రాయపర్తి మండలంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డికి అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డిను బీఆర్ఎస్ తరఫున దింపనున్నారని చర్చ నడుస్తోంది. ఇదిలావుంచితే, తొర్రూరులో కాంగ్రెస్ నుంచి సోమ రాజశేఖర్, సుంచు సంతోష్, మేకల కుమార్, మెర్గు మల్లేశం గౌడ్ రేసులో ఉన్నట్లు సమాచారం. విపక్ష బీఆర్ఎస్ తరఫున మాజీ జెడ్పిటీసీ మంగళపెల్లి శ్రీనివాస్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దవంగర మండలంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ కు టికెట్ కేటాయించే అవకాశం. కానీ.. బీఆర్ఎస్ మాత్రం సరైన అభ్యర్థి లేక తలపట్టుకుంటోంది.
Read Also- Private school fee: బెంగళూరులో ఒకటో తరగతి పిల్లాడి స్కూల్ ఫీజు ఎంతో తెలిస్తే గుండెదడ ఖాయం!
రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు గేమ్‌చేంజర్ కానున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆశావహులంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేతలు యువతను ఆకట్టుకునేందుకు గణపతి నవరాత్రి ఉత్సవాలకు చందాలు, డీజే బాక్సులు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో యువత ఇరు పార్టీల నేతలతో సత్సంబంధాలు పెంచుకుంటున్నారు.ఏదేమైనా రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also- Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ కోచ్ బాధ్యతల నుంచి ద్రవిడ్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదా!