కామారెడ్డి స్వేచ్ఛ : Kamareddy District: ఉగాది పండుగపూట విషాదం నెలకొంది. నీటి మునిగి నలుగురు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు బ్యాక్వాటర్లో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి సీఐ రవీందర్, ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భిక్కనూరు గ్రామ పరిధిలో గల వెంకటాపూర్కు చెందిన మౌనిక(26) ముగ్గురు పిల్లలు మైతిలి(10), అక్షర(9), వినయ్(7)లతో కలిసి శనివారం మధ్యాహ్నం పొలం పనుల నిమిత్తం వెళ్లారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి మౌనిక దుస్తులు ఉతుకుతుండగా.. పిల్లలు స్నానం చేసేందుకు చెరువులో దిగారు.
కాగా.. చెరువులో భారీ గుంత ఉండడంతో పిల్లలు అందులో మునిగిపోయారు. వారిని గమనించిన పినతల్లి మౌనిక కాపాండేందుకు వెళ్లి ఆమె కూడా నీట మునిగింది. సాయంత్రం దాటినా నలుగురు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం చెరువు వద్దకు వెళ్లి చూడగా దుస్తులు కనిపించినా ఎవరి ఆచూకీ కనిపించలేదు.
దీంతో కుటుంబీకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి తర్వాత వినయ్ మృతదేహం నీటిపై తేలింది. దీంతో మిగతా వారికోసం గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి మృతదేహాలను పోస్టుమార్టం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు