తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : Telangana: రోడ్డు లేని రెవెన్యూ గ్రామం ఉండొద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించడంతో పాటు ప్రతీ మండలానికి డబుల్ లైన్ రోడ్డు ఉండాలని, ప్రతీ జిల్లాలకు ఫోర్ లైన్ రోడ్డు ఉండాలని నొక్కిచెప్పారు. ఇందులో భాగంగా నిధులు కూడా గణనీయంగా అవసరమవుతాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎక్కడెక్కడ రోడ్ల నిర్మాణం అవసరమనే అంశాలపై అధికారుల నుంచి జిల్లాలవారీగా వివరాలను తెప్పించుకోవాలనుకుంటున్నది.
ఇదే సమయంలో ప్రత్యేకంగా రెండు కార్పొరేషన్లను నెలకొల్పి ప్రభుత్వ గ్యారంటీతో రుణాలను సమకూర్చుకోవాలని భావిస్తున్నది. ద్రవ్య సంస్థల నుంచి తీసుకునే రుణంలో సగం కార్పొరేషన్ భరిస్తే, మిగిలిన సగాన్ని ప్రభుత్వం గ్యారంటీతో ఉండి తీర్చాలన్నది కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం వెనక ఉద్దేశం. త్వరలోనే ఈ కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా ప్రతి ప్రభుత్వానికి చేరనున్నది.
కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత తీసుకునే రుణాన్ని తిరిగి చెల్లించడానికి తగిన ఆర్థిక వనరుల సమీకరణ మార్గాలను కూడా సదరు ద్రవ్య సంస్థకు వివరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఆ రోడ్లపై టోల్ గేట్లు పెట్టి వాహనాల నుంచి రుసుమును వసూలు చేయాలన్న ప్రతిపాదనలు తయారయ్యాయి. ఇవి రోడ్లు భవనాల శాఖ అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయి. కానీ ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు గ్రామీణ రోడ్లపై టోల్ విధానాన్ని వ్యతిరేకించారు. ‘హ్యామ్’ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) పద్ధతిలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం మొత్తం వ్యయంలో నిర్దిష్ట భాగాన్ని (దాదాపు 40%) భరిస్తుంది. మిగిలిన 60% భారాన్ని నిర్మాణ సంస్థ (పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో) చూసుకుంటుంది. నిర్దిష్ట కాలానికి (సుమారు 30 ఏండ్ల) రోడ్లు నిర్మాణ సంస్థ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ప్రతీ సంవత్సరం ప్రభుత్వం నుంచి ఆ కంపెనీకి రీఇంబర్స్ అవుతూ ఉంటుంది.
ప్రభుత్వం ఈ తరహాలో నిర్మాణ సంస్థకు ఏటా నిధులను ఇవ్వాలంటే ఆ రోడ్ల మీద ఆదాయాన్ని ఆర్జించడం అనివార్యం అవుతుంది. దీన్ని పరిగణనలోకి తీసుకునే రోడ్లు భవనాల శాఖ అధికారులు టోల్ ఫీజు వసూలు విధానాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ స్థానిక ఎమ్మెల్యేలు టోల్ ఫీజు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటివరకూ జాతీయ రహదారులపై మాత్రమే టోల్ విధానం అమలవుతుండగా ఇప్పుడు గ్రామీణ రోడ్లకు కూడా దీన్ని వర్తింపజేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, ఎమ్మెల్యేలుగా తాము సమాధానం చెప్పుకోవడంలో సమస్యలు తలెత్తుతాయన్న వాదనను లేవనెత్తారు. దీంతో టోల్ విధానానికి సూత్రప్రాయంగా స్వస్తి చెప్పిన ప్రభుత్వం ఇతర మార్గాల్లో ఆదాయాన్ని ఎలా ఆర్జించవచ్చన్నదానిపై ప్రత్యామ్నాయాలను అన్వేషించి రుణం ఇచ్చే ద్రవ్య సంస్థలను కన్విన్స్ చేయనున్నది.
AlSO Read: lEuru Crime: ఒంటరి మహిళలే ఇతని టార్గెట్.. తాడుతో గొంతు కోసి చోరీలు.. ఎట్టకేలకు అరెస్ట్..
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి, విస్తరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రోడ్లు-భవనాల శాఖకు రూ. 3,986 కోట్ల నిధుల్ని కేటాయించింది. ఇందులో రోడ్ల నిర్మాణం కోసమే దాదాపు రూ. 3,955 కోట్ల మేర ఖర్చు చేయాలని అంచనా వేసుకున్నది. ఇక ఈ శాఖ జీతభత్యాలు, రోజువారీ అవసరాలు తదితరాలకు అదనంగా రూ. 1,921 కోట్లను కేటాయించింది. ఇప్పటికే రీజినల్ రింగు రోడ్డు, గ్రీన్ ఫీల్ఢ్ హైవే, జాతీయ రహదారులు.. ఇలా అన్నింటిపై దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కార్.. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంతగా నిధులను సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. రోడ్ల నిర్మాణానికి కొత్తగా నెలకొల్పే కార్పొరేషన్ల ద్వారా ఎంత మేరకు రుణాన్ని సమకూర్చుకోనున్నది రానున్న రోజుల్లో తేలనున్నది. ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉన్న కార్పొరేషన్ల ఏర్పాటు ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చనున్నది.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే గ్రామీణ సడక్ యోజన, జాతీయ రహదారుల అథారిటీ తదితరాలతో వచ్చే నిధుల వాటాను వినియోగించుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా జమ చేయాల్సిన నిధులపై ఆలోచనలు చేస్తున్నది. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారంతో రోడ్ల అభివృద్ధికి నిధులను సమకూర్చడం సంక్లిష్టంగా మారడంతో కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రుణాన్ని తీసుకోవాలన్న ఆలోచనకు శ్రీకారం చుడుతున్నది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈhttps://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు