తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad Metro Rail: వేగంగా పట్టణీకరణ జరుగుతున్న గ్రేటర్ హైదరాబాదులో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరించేందుకు సర్కార్ తీసుకున్న నిర్ణయం మరో అడుగు ముందుకు పడింది. మెట్రో రైల్ విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుండి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో విస్తరణ పనులు మరింత వేగవంతమైనట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ డాక్టర్ ఎన్వీఎస్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ప్రభావిత ఆస్తులను స్వాధీనం చేసుకుని, కూల్చి వేసే పనులు స్థానికుల పూర్తి సహాయ సహకారాలతో ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కారిడార్ లో సుమారు1100 ప్రభావిత ఆస్తుల ఉండగా, ఇప్పటి వరకు ఈ మార్గంలో 205 ఆస్తులకు చెక్కుల పంపిణీ జరిగిందని, ఆయా ఆస్తులకు సంబంధించిన రూ. 212 కోట్ల నష్టపరిహారం ఇప్పటికే చెల్లించడం జరిగిందని ఆయన వెల్లడించారు.
Also Read: Bhu Bharathi Portal: రేపే భూభారతి చట్టం.. ఆ తప్పు చేస్తే కఠిన చర్యలే.. మంత్రి వార్నింగ్ !
మిగిలిన ఆస్తులు కూడా త్వరలోనే చెక్కు రూపంలో నష్టపరిహారాన్ని అందిస్తామని తెలిపారు. ఈ మార్గంలో ఇరువైపులా చిక్కు ముడులుగా ఉన్న కొన్ని క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లను తొలగించి, తమ ఇంజినీరింగ్ సిబ్బంది మార్గాన్ని సుగమం చేసారని మెట్రో ఎండీ వెల్లడించారు. మెట్రో అధికారులతో పాటు, రెవెన్యూ, పోలీస్ పర్యవేక్షణలో మెట్రో మార్గం విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు.
ప్రభావిత ఆస్తుల యజమానులు స్వచ్ఛందంగా స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారాన్ని స్వీకరించేందుకు ముందుకు వచ్చి, తమ ఆస్తులను మెట్రో మార్గం కోసం ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే రోడ్డు విస్తరణ కోసం పలు భవనాలు, కట్టడాలను కూల్చివేసి, నిర్మాణ వ్యర్ధాలను తొలగించినట్లు ఆయన తెలిపారు. సున్నితమైన కట్టడాలకు ఎటువంటి ముప్పు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
రంజాన్ సందర్బంగా విస్తరణ పనుల వేగం కొంత తగ్గినప్పటికీ, ఇప్పుడు మరింత వేగవంతంగా స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేసినట్లు మెట్రో ఎండీ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు త్వరితగతిన పాత బస్తి విస్తరణ పనులు పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే ,మెట్రో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి ప్రకటనలో వెల్లడించారు.
Also Read: Gold Rate Today : బంగారం ప్రియులకు అలర్ట్.. ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?