Medchal News: రాష్ట్రంలోని 210 గ్రామపంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. ఆ గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే ఆత్మీయ భరోసా పథకానికి దూరం కానున్నారు. అదే విధంగా ఉపాధి హామీ పనులకు సైతం అవకాశం ఉండదు. దీంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన స్టార్ట్ అయింది. ఉపాధికి ప్రత్యామ్నాయం చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది.. ప్రత్యేక చర్యలు ఏమైనా చేపడుతుందా? అనేది ఆసక్తి నెలకొంది.
ప్రభుత్వం మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. కొన్ని మున్సిపాలిటీల్లోనూ సమీప గ్రామపంచాయతీలను విలీనం చేసింది. దీంతో రాష్ట్రంలో 30 మున్సిపాలిటీల్లో 210 గ్రామపంచాయతీలను ప్రభుత్వం విలీనం చేసింది. ఫ్యూచర్ సిటీ అథారిటీ లో 76 గ్రామాలను విలీనం చేయగా, మేడ్చల్ జిల్లాలోని 61 గ్రామాలు, ఇతర జిల్లాల్లో మరో 73 పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగా ములుగు జిల్లాలోని ములుగు మున్సిపాలిటీలో 3 పంచాయతీలు, ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీగా ఏర్పాటు చేయగా..
6 జీపీలను విలీనం చేశారు. కామారెడ్డి జిల్లాలో బిచ్ కుందా మున్సిపాలిటీలో 4 జీపీలు, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో అలియాబాద్, ముడుచింతలపల్లి, ఎల్లంపేట 36 గ్రామాలు, పెద్దపల్లి జిల్లా రామగుండం 4 జీపీలు, జగిత్యాల జిల్లాలో 1 జీపీ, రంగారెడ్డి జిల్లాలో పెద్ద అంబర్పేట2, చెవేళ్లలో 4 , మొయినాబాద్లో 5 జీపీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో 4 జీపీలు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 2, నారాయణపేట జిల్లా మద్దూరులో 4 జీపీలు మున్సిపాలిటీల్లో కలిశాయి.
అంతేకాకుండా, యాచారం, కందుకూరు, కడ్తాల్, ఆమనల్, మహేశ్వరం మండలాల్లో 76 గ్రామాలతో ప్యూచర్సిటీ అథారిటీ ఏర్పాటు, మేడ్చల్ జిల్లాలో 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
ఈ గ్రామాల్లోని ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయి. ఆ గ్రామాల విలీనంతో ప్రభుత్వం అమలు చేసే కొన్ని పథకాలకు దూరమవుతున్నారు. అందులో భాగంగానే అర్బన్ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు కాదు.
కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం మాత్రమే కేంద్రం ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో పనిచేసేవారికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి కూడా దూరం కానున్నారు.
వేసవిలో చేయూత నిస్తున్న ‘ఉపాధి’
రాష్ట్రంలో విలీనం చేసిన 210గ్రామాల ప్రజలు వేసవికాలంలో వ్యవసాయ, ఇతర పనులు లేకపోవడంతో గ్రామీణ జాతీయ ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారు. ప్రతి రోజూ 250 నుంచి ఆపై వేతనం పొందుతున్నారు. మున్సిపాలిటీల్లో విలీనంతో ఉపాధి పథకంలో అర్హత కోల్పోయారు. కేంద్రం నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీల్లోనే నిరుపేదలకు మాత్రమే ఉపాధి పని కల్పించాలనే నిబంధనలు ఉండటంతో కూలీలు ఉపాధికి దూరం కావడంతోపాటు ఆర్థిక చేయూత కోల్పోతున్నారు.
ఈ గ్రామాలకు చెందిన భూమిలేని నిరుపేదలు సైతం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కోల్పోయే అవకాశం లేకపోలేదు. దీంతో ఉపాధి హామీ కూలీలు ఆందోళన చెందుతున్నారు. పల్లెలను పట్టణాల్లో కలపడంతో తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని ప్రజలు వాపోతున్నారు.
ఈ నెల నుంచి పనులు నిలివేత
మున్సిపాలిటీలో విలీనం అయిన గ్రామాల్లో ఈ ఏప్రిల్ నెల నుంచి ఉపాధి హామీ పథకం పనులు నిలిపివేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పథకం పనులు నిలిపివేస్తే ఆ పనులపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు జీవనోపాధి కరువు అవుతుంది. కుటుంబ పోషణ కష్టంగా మారనుంది. వారికి ప్రత్యామ్యాయం చూపుతారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో విలీనమైన గ్రామాల ప్రజలకు ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీ గానీ, ప్రత్యామ్నాయం గానీ చూపలేదు.
Also read: Bhatti Vikramarka: భూ నిర్వాసితులను బీఆర్ఎస్ మోసగించింది.. భట్టి విక్రమార్కఫైర్..
ఇదిలా ఉంటే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు పూర్తిగా హెచ్ఎండీఏ పరిధిలో ఉంది.ఈ జిల్లాల్లోని గ్రామాలు ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీలో 76 కలిశాయి. గ్రామాలకు ఉపాధి పథకం వర్తింపచేయవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాదిలో మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామ పంచాయితీల్లోని ప్రజలకు ఉపాధి హామీ పథకం తరహాలో ఏమైన నూతనంగా పథకాన్ని అమలు చేసి ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటారా? అనేది చూడాలి.
ప్రజల డిమాండ్ నేపధ్యంలో ప్రజాప్రతినిధులపైనా ఒత్తిడితో ఎలా ముందుకు పోతారనేది ఆసక్తి నెలకొంది. విలీనమైన గ్రామపంచాతీల్లోని సిబ్బంది ఎంతమంది ఉన్నారో వివరాలు ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వారిని మున్సిపాలిటీల్లో సర్దుబాటు చేయబోతున్నారు.