TGERC Members: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) సభ్యులు(టెక్నికల్)గా కంచర్ల రఘు, సభ్యులు(ఫైనాన్స్)గా చెరుకూరి శ్రీనివాస రావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గరిష్ట పదవీకాలం 5 ఏళ్లు కాగా, అంతకు ముందే 65 ఏళ్ల వయస్సుకి చేరితే మాత్రం అప్పటి వరకే ఈ పదవిలో కొనసాగుతారు.
ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్(ఐఆర్‌ఏఎస్)కి చెందిన శ్రీనివాస రావు 2016 జూలై 26 నుంచి ట్రాన్స్‌కో జేఎండీగా కొనసాగుతున్నారు. అంతకు ముందు ఆయన టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్(ఫైనాన్స్)గా పనిచేశారు. విద్యుత్ రంగంలో ఆయనకు దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కంచర్ల రఘు విద్యుత్ రంగ నిపుణుడిగా గుర్తింపు పొందారు.
2017-2022 మధ్యకాలంలో ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులను సుప్రీం కోర్ట్ ఆదేశాలతో తెలంగాణ ట్రాన్స్‌కోలో చేర్చుకోవడంతో సీనియారిటీ కోల్పోయిన ఆయన డబుల్ డిమోషన్ పొంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బదిలీ అయ్యారు.
సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణం, నిర్వహణ, మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ రంగ విధానాలు, ఈఆర్సీ రెగ్యూలేషన్స్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ఉద్యోగులకు శిక్షణ వంటి అంశాల్లో ఆయన నిష్ణాతన కలిగి ఉన్నారు.
Also read: BJP Maheshwar reddy: కేసీఆర్ దోపిడి, అవినీతికి మోడల్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి!
విద్యుత్ రంగంపై పలు పుస్తకాలను రాశారు. ఈఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ దేవరాజు నాగార్జున్ గతేడాది అక్టోబర్‌లో బాధ్యతలు స్వీకరించగా, తాజాగా ఇద్దరు సభ్యులను నియమించడంతో ఈఆర్సీలో ఖాళీలు భర్తీ అయ్యాయి.
ఏ ఈఆర్సీ ముందు హాజరు కావద్దని చెప్పారో..
విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం వంటి అంశాలపై ఈఆర్సీ నిర్వహించే బహిరంగ విచారణలకు రఘు నిత్యం పాల్గొని ప్రజలకు భారంగా మారే ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించే వారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారనుందని ఓ బహిరంగ విచారణలో ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.
దీంతో గత ప్రభుత్వ ఒత్తిడితో ఈఆర్సీ అప్పట్లో ఓ సర్క్యులర్ జారీ చేసింది. విద్యుత్ సంస్థల యాజమాన్యాల అనుమతితోనే విద్యుత్ ఉద్యోగులు ఈఆర్సీ బహిరంగ విచారణలకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో నాటి నుంచి ఈఆర్సీకి వెళ్లకుండా రఘు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడే అదే ఈఆర్సీ సభ్యుడిగా ఆయన నియామకం పొందడం గమనార్హం.