తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Transgenders Protest: అసెంబ్లీ సమావేశాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమపట్ల వ్యవహరించిన తీరుపై ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్యాంక్ బండ్‌వద్ద ఉన్న శ్రీశ్రీ విగ్రహం ముందు నిరసన ప్రదర్శన చేశారు. అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజున మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం 50మంది ట్రాన్స్ జెండర్లను పైలెట్ ప్రాజెక్ట్ కింద ట్రాఫిక్అసిస్టెంట్లుగా నియమించిందని చెప్పిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ లు హేళనగా నవ్వారని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న ట్రాన్స్ జెండర్లు పేర్కొన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమను మనుషులుగా గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రాఫిక్ అసిస్టెంట్లుగా చేర్చుకున్నట్టు చెప్పారు.
రాష్ర్టాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ ఏనాడూ తమను పట్టించుకున్న పాపానికి పోలేదన్నారు. ఇప్పుడు మేము గౌరవ ప్రదమైన పని చేస్తుంటే అవహేళన చేస్తారా? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. తమపట్ల అనుచితంగా ప్రవర్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Allu Arjun: ఏంది సామి.. ఇంకా దానిపై మోజు తీరలేదా?