TG Panchayat Raj: పల్లెల్లోనే సేంద్రియ ఎరువు తయారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇళ్ల నుంచి చెత్త సేకరించి దానిని ఎరువుగా తయారు చేసి పంచాయతీకి సైతం ఆదాయం సమకూర్చాలని భావిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని ఇళ్లు ఉన్నాయి? రోజుకు జీపీ కార్మికులు ఎంత సేకరిస్తున్నారు.. దానిని ఏం చేస్తున్నారు అనే వివరాలను శాఖ ఆరా తీస్తుంది. త్వరలోనే అన్ని జిల్లాల అధికారులతో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ ఎరువుల తయారీలో ఉపాధిహామీ కూలీలను కూడా భాగస్వాములను చేయాలని పీఆర్ శాఖ పక్కా ప్లాన్ చేస్తుంది. విజయవంతం చేసి మార్క్ చూపాలని భావిస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒక్కో శాఖలో ఒక్కొ స్పెషాలిటీ ఉండేలా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే పల్లెల్లో చెత్త సేకరణపై పంచాయతీ రాజ్ శాఖ ఫోకస్ పెట్టింది. గ్రామపంచాయతీ కార్మికులు ప్రతి ఇంటి నుంచి పొడి, తడి చెత్తను సేకరిస్తున్నారు. ఆ చెత్తను కాల్చివేస్తున్న ఘటనలు ఉన్నాయి. వృధా చేస్తున్నారు. అలా కాకుండా సేంద్రియ ఎరువు తయారు చేయాలని భావిస్తోంది.
గతంలో గ్రామాల్లో డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించారు. వాటిని వినియోగించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ భావిస్తుంది. సేకరించిన చెత్త ను డంపింగ్ యార్డుల్లోనే ఎరువులు తయారు చేయాలని ప్లాన్ చేస్తోంది. మరోవైపు గ్రామాల్లో పాలక వర్గాలు లేకపోవడంతో చెత్త సేకరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో పంచాయతీ రాజ్ శాఖ ఈ ప్రక్రియను గాడిలో పెట్టేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నారు.
చెత్త సేకరణపై ఆరా
గ్రామాల్లో కంపోస్టు ఎరువులు తయారు చేసేలా మండలంలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులు దీనిపై ఫోకస్ పెట్టేలా ఇప్పటికే మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అందుకోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా చెత్త బండిలో వేస్తున్నారా? చెత్త సేకరణ బండ్లు ఇంటింటికీ తిరుగుతున్నాయా..? సేకరించిన చెత్త ఏం చేస్తున్నారు? సెగ్రిగేషన్ షెడ్లకు తరలిస్తున్నారా? డంపింగ్ యార్డుల నిర్వహణ ఎలా ఉంది? చెత్తను తీసుకెళ్లి ఎక్కడో ఊరి చివర తగలబెడుతున్నారా? తదితర అంశాలపై రాష్ట్ర అధికారులు ఆరా తీస్తున్నారు. ఎన్ని గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులు ఉన్నాయి? సెగ్రిగేషన్ షెడ్ల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
త్వరలో అధికారులతో సమావేశం..
రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా గత ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి గ్రామాల్లో డంపింగ్ యార్డులు, సెగ్రి గేషన్ షెడ్లు నిర్మించింది. గ్రామ పంచాయతీల్లో ఒక్కో దానిని రూ.2.50లక్షలతో నిర్మించారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రీయ ఎరువులను తయారు చేశారు. సేంద్రియ ఎరువులను తయారు చేసి విక్రయించారు. వచ్చిన ఆదాయాన్ని గ్రామపంచాయతీకి వినియోగించారు.
Also read: Black magic: పాఠశాలలో క్షుద్రపూజలు.. వణికిపోతున్న విద్యార్థులు.. టార్గెట్ ఎవరు?
పర్యవేక్షణ కొరవడటంతో ఈ ప్రక్రియ అటకెక్కింది. మరోవైపు నిర్వహణ భారం కావడంతో ఎరువును తయారు చేయడం లేదని సమాచారం. దీంతో షెడ్లు వృథాగా మారిపోయాయి. కనీసం వాటిలో చెత్తను కూడా వేయటం లేదు. తడిపొడి చెత్తను వేరు చేయకుండా నిప్పుపెడుతున్నారు. ఇప్పుడు పంచాయతీరాజ్ ప్రత్యేక దృష్టిసారించి ఎరువుల తయారీ చేయాలని భావిస్తుంది. వారం పదిరోజుల్లో డీపీవోలు, డీఆర్డీఓలు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. చెత్త సేకరణ,సేంద్రియ ఎరువు తయారీ అవసరమైన చర్యలపై చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఆదాయం సమకూర్చేలే ప్లాన్
గ్రామపంచాయతీలు ఆర్థిక వనరులు లేక కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా అవి సరిపోకపోవడంతో కొన్ని అభివృద్ధి పనులు సైతం కుంటుపడుతున్నాయి. మళ్లీ తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుల తయారీపై పంచాయతీరాజ్ శాఖ దృష్టి సారించింది. సేంద్రియ ఎరువు తయారీతో పంచాయతీలకు ఆదాయ సమకూర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం దాదాపు ఇంటికి నాలుగు కిలోల తడి, పొడి చెత్త సేకరిస్తున్నారు. ఈ మేరకు లక్షల టన్నుల చెత్త పోగు అవుతుంది. చెత్తను సెగ్రి గేషన్ షెడ్లకు తరలించి తడి, పొడి చెత్త వేరు చేసి సేంద్రియ ఎరువు తయారు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో ఎస్ బీఎం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్లాలని భావిస్తున్నారు. వానపాముల సాయంతో 40 నుంచి 60 రోజుల వ్యవధిలోపే సేంద్రియ ఎరువు తయారవుతుంది.
Also read: Khammam farmers: భూములు కాపాడండి.. లేదంటే చావే గతి.. మంత్రికి రైతులు విజ్ఞప్తి
అవసరమైతే ఈజీఎస్ నిధులతో వానపాములు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం పంచాయతీలకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు ఖర్చు చేస్తామని పీఆర్ ఆర్డీ డైరెక్టర్ సృజన తెలిపారు. 1000 కిలో చెత్త ద్వారా దాదాపు 200 నుంచి 400 వరకు సేంద్రియ ఎరువు తయారు అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిని వ్యవసాయ అవసరాలకు విక్రయించడం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే పశువుల కొరత కారణంగా పంట ఎరువుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో పంచాయతీల్లో సేంద్రీయ ఎరువులు తయారు చేస్తే డిమాండ్ సైతం ఉంటుంది. మంచి ధర సైతం వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే చెత్త సేకరణ, సేంద్రియ ఎరువుల తయారీ ప్రక్రియను జిల్లా స్థాయిలో డీపీఓలు, మండల స్థాయిలో ఎంపీడీవోలు, గ్రామాల్లో కార్యదర్శులు పర్యవేక్షించేలా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.