Telangana Govt: రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 5న ఎగ్జామ్స్ ప్రారంభమవ్వగా 25తో ముగిశాయి. దీంతో ఇంటర్ ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఏప్రిల్ మూడోవారం తర్వాత ఫలితాలు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా ఇంటర్ పరీక్షలకు 9,96,971 మంది విద్యార్థులు అటెండ్ కావాల్సి ఉండగా, 98శాతం మంది వరకూ హాజరైనట్లు అధికారులు చెప్పారు.
ఈనెల 20తో ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు పూర్తికాగా, మంగళవారం వరకూ బ్రిడ్జికోర్సు, ఒకేషనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. మరోపక్క ఈనెల 10 నుంచే ఇంటర్ స్పాట్ వాల్యువేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం 19 కేంద్రాల్లో ఈ ప్రక్రియ మొదలుకాగా, దీనిలో సుమారు 20వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
విద్యార్థులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్సులు
– 21,806 మందికి రూ.రూ.13 కోట్లు రిలీజ్
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ విద్యార్థుల ట్రాన్స్ పోర్ట్, ఎస్కార్ట్ అలవెన్స్ ను అధికారులు రిలీజ్ చేశారు. మొత్తం 21,806 మందికి రూ.13.08 కోట్ల నిధులు మంజూరు చేస్తూ విద్యాశాఖ సంచాలకులు నర్సింహారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఒక్కో విద్యార్థికి 10 నెలల పాటు ప్రతినెలా రూ. రూ.600 చొప్పున అందించనున్నారు. రెండు వారాల్లో విద్యార్థుల ఖాతాల్లోకి ఈ నిధులను జమ చేయనున్నారు.