Miss World 2025: సంస్కృతి, సౌందర్యం రెండింటి మేళవింపుగా మిస్ వరల్డ్ —2025 ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణకు చెందిన వివిధ రకాల జానపద, గిరిజన, శాస్త్రీయ కళలు, హైదరాబాది దక్కని కళారూపాలను ఈ ఉత్సవాలలో సమ్మిళితం చేసి ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతి ని, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రపంచ దేశాల నుంచి హైదరాబాద్ నగరానికి విచ్చేసే సుందరీమణుల ఆహ్వానం కోసం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈనెల 3 నుంచి 9 వరకు కూచిపూడి, భరతనాట్యం, పేరిణి, కథక్, డప్పులు, భాజాబజంత్రీలు, మంగళ వాయిద్యాల తో కూడిన బృందాలతో స్వాగతం పలికేలా ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండి ఈ కళాకారులు ఎయిర్‌పోర్టులో ప్రపంచ సుందరి పోటీలకు విచ్చేస్తున్న సుందరీమణులకు స్వాగతం పలికారు. వారంతా తెలంగాణ నేల మీద, హైదరాబాదులో కాలిడగానే కుంకుమ తిలకం దిద్ది, హారతులతో వారికి స్వాగతం పలికారు.
Also read: Territorial Army: యుద్ధరంగంలోకి ధోని, సచిన్.. సౌత్ నుంచి మోహన్ లాల్.. పాక్ పని ఖతమే!
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రపంచ సుందరి ప్రారంభోత్సవ వేడుకలలో తెలంగాణ సంస్కృతి, కళలు ఆకట్టుకునేలా రూపొందించారు. తొలుత తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపనతో ప్రారంభం అవుతాయి. అందెశ్రీ రచించిన ఈ గీతానికి, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా, ఈ పాటని ఈ ప్రపంచ సుందరి వేడుకలలో ప్రముఖ గాయకుడు, శిక్షకుడు కొమాండూరి రామాచారి శిష్య బృందం 50 మంది బృంద గీతంగా ఆలపిస్తారు.
ఆ తర్వాత కాకతీయుల కాలం నుంచి తెలంగాణ శాస్త్రీయ నృత్య రీతిగా ఖ్యాతి గడించిన పేరిణి నాట్య ప్రదర్శన అత్యంత వైభవంగా జరగనుంది. 250 మంది మహిళా కళాకారిణులు పేరిణి లాస్య సంప్రదాయాన్ని అనుసరించి ఈ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. దీనికి పేరిణి సందీప్ నృత్య దర్శకత్వం వహించగా, ప్రముఖ సంగీత నిపుణుడు ఫణి నారాయణ స్వరాలు సమకూర్చారు. దాదాపు 10 నిమిషాల పాటు జరిగే ఈ పేరిణి నాట్యం లో సౌందర్యం, సంస్కృతి, స్త్రీల సాధికారత అంశాలు ప్రధానంగా ఉదహరించారు. కళాకారులు అందరూ కలిసి నక్షత్రం ఆకారంలో, సీతాకోకచిలుక ఆకారాన్ని, అలాగే మిస్ వరల్డ్ లోగో ఆకృతిని కూడా తమ విన్యాసాల లో భాగంగా ప్రదర్శిబోతున్నారు.
ప్రపంచ దేశాల నుంచి విచ్చిన సుందరీమణుల పరిచయ కార్యక్రమానికి ప్రారంభ సూచికగా, ఖండాల వారీగా తెలంగాణ జానపద, గిరిజన కళారూపాల ప్రదర్శనలతో ప్రారంభమవుతాయి. వాటిలో భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన కొమ్ము కోయ కళాకారులు రామకృష్ణ బృందం ప్రదర్శన ఉంటుంది. ఆదిలాబాద్ ప్రాంతం నుంచి గోండు జాతి ప్రజల విశిష్ట కళారూపం గుస్సాడీ కళా ప్రదర్శన కత్లే శ్రీధర్ బృందంతో మరొక ఖండానికి సంబంధించిన సుందరీమణులు వేదిక కి పరిచయం అవుతారు.
Also read: Territorial Army: యుద్ధరంగంలోకి ధోని, సచిన్.. సౌత్ నుంచి మోహన్ లాల్.. పాక్ పని ఖతమే!
అలాగే తెలంగాణ జానపద సంప్రదాయానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచే డప్పులు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత అందే భాస్కర్ బృందంతో, తెలంగాణ గిరిజన వైభవానికి ప్రతీకగా నిలిచే బంజారా మహిళల విన్యాసాలుస్వప్న బృందంతో ప్రదర్శన చేస్తారు. తెలంగాణ గ్రామీణ పల్లె జీవన ప్రతీకగా నిలిచిన ఒగ్గుడోలు కళా విన్యాసాలు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీత చౌదరపల్లి రవి కుమార్ బృందంచే ప్రదర్శితమవుతోంది. ఈ కళారూపాలు అన్నింటి మేళవింపుగా ముగింపు ఉంటుంది. ఇలా సౌందర్యం, సంస్కృతి రెండు కలగలిసిన వేడుకగా ఈ ప్రారంభోత్సవ సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.