TG on Darshan Tickets: ఆలయాల్లో మాన్యువల్ టికెట్లకు ఫుల్ స్టాప్ పడనుంది.. కొన్ని ఆలయాల్లో వీఐపీ దర్శన టికెట్లతో పాటు అభిషేకాలు, పులిహార ఇలా టికెట్ల గోల్ మాల్ జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తుండటంతో ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. వాటికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏయే ఆలయాల్లో టికెట్ల దందా జరుగుతుందని ఆరా తీస్తుంది. అవినీతికి పాల్పడేవారిపై వేటువేసేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలపై ప్రత్యేక దృష్టిసారించింది.
ఆలయాల్లో పనిచేస్తున్న కొంతమంది చేతి వాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టిక్కెట్ల దందాకు తెరదీశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆలయ ప్రతిష్టకు మచ్చగా ఏర్పడుతుంది. దీంతో ఆ టికెట్ల దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏదో ఒక ఆలయంలో దర్శనం, అభిషేకాలు, ఆర్జిత సేవలు, వీఐపీ సేవలు, పులిహార టికెట్ల గోల్ మాల్ వ్యవహారం వెలుగు చూస్తుంది. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. ఈ టికెట్లను కొన్ని ఆలయాల్లో మ్యాన్వల్ గా రాసి ఇస్తుండటంతో అక్రమాలు జరుగుతున్నాయని దేవాదాయశాఖ గుర్తించింది.
కొన్ని ఆలయాల్లో అధికారులు, సిబ్బంది కుమ్మక్కై నకిలీ టికెట్లు ప్రింట్ చేసి మరీ విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భక్తుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి. వీఐపీ సేవలతో పాటు ఇకపై ప్రతీ టికెట్ ఆన్ లైన్ ద్వారా జారీ చేసేలా కసరత్తు చేస్తుంది. ప్రసాదాలు, తలనీలాలకు సంబంధించి అన్నీ కూడా ఆన్ లైన్ ద్వారా ఇవ్వాలని భావిస్తున్నది. ఆలయాల్లో నిఘా సైతం పెంచినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆలయాలకు భక్తులు సమర్పించే కానుకలు, సేవా రుసుములు సహా వివిధ పూజలకు సమర్పించే సొమ్ముల లెక్కల వివరాలు క్లియర్ గా ఉంటాయని ఎండో మెంట్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి నెలా ఆలయానికి వచ్చే ఆదాయ, వ్యయాల వివరాలు సైతం అందజేయాలని ఇప్పటికే ఈఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.
15న ప్రత్యేక సమావేశం
రాష్ట్రంలోని దేవాలయాల్లో టికెట్ల దందాపై మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. ఆ దందాకు చెక్ పెట్టేందుకు ఈ నెల 15న మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో ఎండో మెంట్ అధికారులు, ఈ గవర్నెన్స్ ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ఆన్ లైన్ టికెట్ల జారీ ప్రక్రియలో లోటుపాట్లు, దేవాదాయశాఖ అభివృద్ధి పనులు, చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు అంశాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సైతం చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమయంలో ఆన్ లైన్ లో టికెట్ జారీచేయకుండా ఎవరైనా మానువల్ టికెట్ ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆదేశాలు ఇవ్వబోతున్నారు.
Also read: Gold Rate Today : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్
వీఐపీ టికెట్ల విక్రయాలు?
రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలు వేములవాడ, యాదగిరి గుట్ట, భద్రాచలం, జోగులాంబ, కొండగట్టు, కొమరవెల్లి మలన్న , బాసర, భద్రకాళి, చెర్వుగట్టు ఉన్నాయి. ఈ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రత్యేక పండుల సమయంలో మాత్రం వేలల్లో భక్తులు వస్తుంటారు. నిత్యం భక్తులు రోజుకు వందల సంఖ్యలో వీఐపీలకు దర్శనం కల్పిస్తారు. ఒకే టికెట్ పై ఇద్దరు, ముగ్గురికి దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది. ప్రముఖ వ్యక్తులకు అయితే ఈ టికెట్లకు ఎలాంటి రుసుము ఉండదు. కానీ, కొన్ని ప్రముఖ ఆలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది టికెట్లను భక్తులకు విక్రస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఆలయ బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో క్యూలైన్లో నిల్చోని ఉండలేని పరిస్థితి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని టికెట్లు విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో వీఐపీ టికెట్లను విక్రయించి కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. సందర్భాన్ని బట్టి 500టికెట్లను వేల రూపాయలకు అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆలయ ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఏండ్ల తరబడి ఒక ఆలయంలో సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండటంతో వారు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అడ్డదారుల్లో డబ్బు సంపాదించేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
పారదర్శకంగా సేవలు
ఆన్ లైన్ టికెట్ల తో భక్తులు ప్రత్యేక దర్శనం, అభిషేకం, అర్చనలకు ముందుగా టికెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ విధానంతో నిధుల జమ, ఖర్చుల వివరాలు పారదర్శకంగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. నిధులు పక్కదారి పట్టే అవకాశం లేదు. వచ్చే ఆదాయం దేవాలయ అభివృద్ధికి ఉపయోగించుకునే వీలుంటుంది. దేవాలయాల్లో పూజలు, ప్రత్యేక దర్శనాలు, ఇతర సేవలు రోజూ నిర్వహిస్తూ ఉంటారు. ఈ సేవల ద్వారా ఆలయాలకు భారీ ఎత్తున ఆర్థిక వనరులు సమకూరుతుంటాయి. ఈ ఆదాయంలో ప్రధానంగా టికెట్ విక్రయాలు, దానాల ద్వారా వచ్చే ఆదాయం, హుండీ సొమ్ములు, ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక పూజా సేవలు ఉంటాయి. ఈ ఆదాయాన్ని ప్రధానంగా ఆలయ అభివృద్ధి, పూజా కార్యక్రమాల నిర్వహణ, వేడుకలు, ఆలయ భవనాల మరమ్మతులు వంటి వాటికి వినియోగిస్తారు.
Also read: Vishaka Tragedy: స్విమ్మింగ్ కు వెళ్లిన ఏడేళ్ల బాలుడు మృతి.. విశాఖలో ఘటన..
ఆన్ లైన్ టికెట్ సిస్టమ్ ద్వారా ఆదాయాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా వినియోగించుకోవచ్చని దేవాదాయ శాఖ భావిస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నింటిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వివరాలను సైతం సేకరించే పనిలో నిగ్నమైంది. అవినీతికి పాల్పడుతున్న అధికారులను గుర్తించే పనిలో పడింది. ఎవరైనా పాల్పడుతున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తుంది.
కొన్ని సంఘటనలు..
–బాసర ఆలయంలో లడ్డూ టికెట్ల లో అక్రమాలు జరిగాయి. బాధ్యులైన ఇద్దరు ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్‌తోపాటు నలుగురు రోజువారీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.
–చెర్వుగట్టు దేవస్థానంలోనూ నకిలీ టికెట్ల దందా చోటు చేసుకుంది. గుట్టపై దర్శనీయ స్థలాల్లో టికెట్ల రీసైక్లింగ్ జరగ్గా, గుట్ట కింద ప్రైవేట్ పార్కింగ్ ప్రదేశాల్లో దేవస్థానం పేరిట పార్కింగ్ ఫీజును వసూలు చేసిన విషయం గతంలో వెలుగు చూసింది. పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన బైక్ చోరీ కావడంతో బాధితుడు దేవస్థానాన్ని సంప్రదించగా ఈ దందా విషయం వెలుగులోకి వచ్చింది.
–గతంలో బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి పదేండ్లుగా నకిలీ టికెట్లను ప్రింట్ చేయించి అమ్ముతున్నట్లు తేలింది. ఈ ఏడాది జనవరి 12వ తేదీన అధికారులకు ఆలయంలో కొన్ని నకిలీ టికెట్లు దొరికాయి. దేవాలయం టికెట్ కౌంటర్‌లో పని చేస్తున్న ఓ వ్యక్తి వాటిని అమ్మినట్లు తేలింది. ఆలయ ఈవో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
–కొమురవెల్లి మలన్న ఆలయంలోనూ గతంలో వీఐపీల టికెట్లను విక్రయించుకున్నారనే ఆరోపణలున్నాయి.