Harish Rao vs Komatireddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇవాళ సభలో మరోమారు మాటల యుద్ధం నడిచింది. విపక్ష బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేత హరీష్ రావు (Harish Rao) తొలుత మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రవేశపెట్టిన బడ్జెట్.. అంకెల గారడీలా ఉందని మండిపడ్డారు. తెలంగాణ వృద్ధి రేటు దేశంలో పోలిస్తే పూర్తిగా తగ్గిందన్న ఆయన.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలా ఎప్పుడు జరగలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ బుద్ధి మాంద్యం వల్లే
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు (Telanagana Budjet Sessions) ఏడో రోజు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. వివిధ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చ సందర్భంగా విపక్ష నేత, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ల ఆదాయం భారీగా తగ్గిపోయినట్లు చెప్పారు. 2023-24 నాటికి ఆదాయం రూ.14 వేల కోట్ల ఆదాయం పెరిగితే.. 2024-25లో మెుత్తం ఆదాయం కేవలం రూ.12 వేల కోట్లుగానే ఉందని అన్నారు. ఇది ఆర్థిక మాంద్యం కాదన్న ఆయన ప్రభుత్వ బుద్ధి మాంద్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు చెప్పారు. ఈ కారణంగానే గచ్చిబౌలిలో 400 ఎకరాలు అమ్మి.. దాని ద్వారా రూ.30 వేల కోట్లు రాబట్టాలని హరీష్ రావు ఆరోపించారు. అటు గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు సైతం టోల్ విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు హరీష్ ఆరోపణలు చేశారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని విమర్శించారు.
కోమటిరెడ్డి కౌంటర్
బడ్జెట్ అంశం వదిలి ఇతర అంశాలను సభలో ప్రస్థావించడంపై అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తనదైన శైలిలో హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. భూముల అమ్మకాల గురించి హరీష్ రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి ఎన్నికలకు సరిగ్గా 2 నెలలు ముందు ఔటర్ రింగ్ రోడ్డును రూ.7300 కోట్లకు అమ్ముకున్నారని విమర్శించారు. అటువంటి వాళ్లు భూముల అమ్మకాల గురించి మాట్లడటమేంటని ప్రశ్నించారు. కోకాపేట భూముల అమ్మకాల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని కోమటిరెడ్డి అన్నారు. మరోవైపు గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రాహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పారు.
Also Read: Happiest Country in World: ఇదెక్కడి విడ్డూరం.. మనకంటే పాక్ ప్రజలే సంతోషంగా ఉన్నారట
గ్రామాలకు డబుల్ రోడ్లు
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. గ్రామీణ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో మండలాలను అనుసంధానం చేస్తూ ప్రతీ గ్రామానికి ఉన్న లింక్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లను అసలు పట్టించుకోలేదని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు మినహా ఎక్కడైనా రోడ్లను వేశారా? అంటూ విపక్ష సభ్యులను ప్రశ్నించారు. రోడ్లు వేసినట్లుగా చూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాలు విసిరారు. అయితే ఈ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆర్ అండ్ బీ పనుల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని అన్నారు.